ఈ వంట ఆడపిల్లలకు మాత్రమే!

ఏ ఊర్లో అయినా ఆడవాళ్లు మాత్రమే తినే ప్రత్యేకమైన వంట ఉంటుందా? తమిళనాడులోని తిరునల్వేలిలో అటువంటి వంటకం ఉంది. పేరు ఉళుందాన్‌ కలి.

Published : 26 Feb 2023 00:13 IST

ఏ ఊర్లో అయినా ఆడవాళ్లు మాత్రమే తినే ప్రత్యేకమైన వంట ఉంటుందా? తమిళనాడులోని తిరునల్వేలిలో అటువంటి వంటకం ఉంది. పేరు ఉళుందాన్‌ కలి. అమ్మాయి రజస్వల అయ్యే వయసు నుంచి ఈ వంటకాన్ని తల్లులు ప్రత్యేకంగా వండుతారు. పుట్టింటి నుంచి ఇచ్చే సారెలో ఈ వంటకం ఉండాల్సిందే. ఎందుకు ఈ వంటకం అంత ప్రత్యేకం అంటే...

వంటకాన్ని మినుములు, తాటిబెల్లం, నెయ్యితో తయారుచేస్తారు. ఇనుము పుష్కలంగా ఉండే ఈ వంటకం ఆడవాళ్లకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తుందని అక్కడి వారి నమ్మకం. శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించే గుణాలు ఈ తీపి వంటలో మెండుగా ఉంటాయని ఈ సమయంలో వండుతారు. ఈ వంటకం ఎముకలను బలోపేతం చేసి, హార్మోన్ల అసమతుల్యతను రాకుండా చేస్తుంది. అందుకే అక్కడి ఆడవాళ్లు నెలసరి సమయంలో నొప్పి నివారణిగా కూడా ఈ వంటకాన్ని వండిపెడతారు. దీన్నో ఔషధంగా భావిస్తారు. తయారీ: అరకప్పు మినప్పప్పు, చెంచా బియ్యాన్ని దోరగా వేయించి చల్లార్చి మెత్తగా పొడిగా చేయాలి. పావు కప్పు తాటి బెల్లాన్ని నీటిలో కరిగించి అయిదు నిమిషాలు ఉడికించి, ముందుగా చేసి ఉంచిన మినప్పప్పు పొడిని నెమ్మదిగా వేస్తూ గరిటతో తిప్పి ముద్దగా చేస్తారు. ఇందులో పావుకప్పు నీటిని కలిపి మరోసారి పొయ్యిపై ఉంచి చిన్నమంటపై ఉడికిస్తూ చెంచా నువ్వుల నూనె, నెయ్యి వేస్తారు. బాగా ఉడికేవరకు గరిటతో కదుపుతూనే ఉంటారు. తల్లీ, బిడ్డలకు మంచిదని గర్భిణులకు, బాలింతలకు ప్రత్యేకంగా వండుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని