పరీక్షలా.. ఇవి తినండి!

వచ్చేది పరీక్షాకాలం.. ఏడాదంతా చదవడం ఒకెత్తు. ఇప్పుడు చదవడం ఒకెత్తు. శరీరానికి హాయిగా ఉంటూ... ఒత్తిడిని తగ్గించే ఆహారం తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు..

Published : 26 Feb 2023 00:13 IST

వచ్చేది పరీక్షాకాలం.. ఏడాదంతా చదవడం ఒకెత్తు. ఇప్పుడు చదవడం ఒకెత్తు. శరీరానికి హాయిగా ఉంటూ... ఒత్తిడిని తగ్గించే ఆహారం తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు..

గుడ్డు: ఇనుము, బి12సహా విటమిన్లు నిండుగా ఉండే గుడ్లతో రోజుని మొదలుపెడితే సరిపోతుంది. ఉడికించి, ఆమ్లెట్‌, ఎగ్‌ బుర్జీ ఎలా అయినా ఇవ్వండి. చదివినవి మర్చిపోకుండా ఉంటారు. తేలిగ్గా గుర్తుపెట్టుకుంటారు.

పచ్చనివి: కొత్తిమీర, పాలకూర, కరివేపాకు, చుక్కకూర ఏదైనా ఆకుకూరైనా తీసుకోండి. పప్పులోనో, పచ్చడిలోనో జోడించండి. అలసిన కళ్లకు మేలు చేస్తాయి. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. మెదడు చకచకా పనిచేస్తుంది.

వాల్‌నట్స్‌: ఇవేకాదు పల్లీలు, బాదం, పిస్తా ఏవైనా సరే గుప్పెడు గింజల్ని పిల్లలకు సాయంత్రం చిరుతిండిగా పెట్టండి. ఇవి పిల్లల్లో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గకుండా చూసి రోజంతా శక్తిమంతంగా ఉండేట్టు చేస్తాయి. ఒత్తిడి కారణంగా వచ్చే మతిమరుపు దరిచేరదు.

ఉసిరికాయలు: పరీక్షలు ఉన్నన్ని రోజులు కాసిని ఉసిరి క్యాండీలనో, ఉప్పులో వేసిన ముక్కలనో దగ్గర పెట్టుకోండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇవ్వండి. ఇవి మెదడుకి ఆక్సిజన్‌ పుష్కలంగా అందేట్టు చేసి పిల్లల్ని చురుగ్గా ఉంచుతాయి. హుషారుగా పరీక్షలు రాసేందుకు సహకరిస్తాయి.

నీళ్లు: అరె నీళ్లు కూడా పోషకాలేనా అనుకోవద్దు. పరీక్షల సమయంలో... చాలామంది పిల్లలు నీళ్లు తాగరు. శరీరానికి సరిగా నీళ్లు అందకపోతే... పిల్లల్లో ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే నీళ్లు సమృద్ధిగా తాగాలి.

వీటితోపాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలు, ఓట్స్‌ వంటివి తినడం వల్ల పిల్లలు హుషారుగా ఉంటారు. ఒత్తిడిని జయిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని