పాతికవేలమందికి ఒకేసారి వండేయొచ్చు!

15 అడుగుల లోతు, 37 అడుగుల వెడల్పున్న బాండీ గురించి ఎప్పుడైనా విన్నారా! ప్రపంచంలోనే అతి పెద్ద బాండీని 1567లో అక్బర్‌ ఈ కడాయిని  అజమర్‌ షరీఫ్‌ దర్గాకి బహుకరించారు.

Published : 16 Apr 2023 00:08 IST

15 అడుగుల లోతు, 37 అడుగుల వెడల్పున్న బాండీ గురించి ఎప్పుడైనా విన్నారా! ప్రపంచంలోనే అతి పెద్ద బాండీని 1567లో అక్బర్‌ ఈ కడాయిని  అజమర్‌ షరీఫ్‌ దర్గాకి బహుకరించారు. ఇది రాజస్థాన్‌లో ఉంది. ఇక్కడ ఒకేసారి 4,800 కిలోల ప్రసాదం తయారు చేస్తారు. అది దాదాపుగా 25,000 మందికి సరిపోతుంది. ఉర్సు ఉత్సవాలు, పండగల వేళల్లో భక్తులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. మిగిలిన సమయంలో దర్గాలో ఇంకో చిన్న బాండీలో ప్రసాదం తయారు చేస్తారు. ప్రసాదం తయారీకి భక్తులు భారీగా డబ్బు, బియ్యం ఇతర నిత్యావసరాలు ఈ బాండీలో వేస్తారు. అవన్నీ లెక్కించిన తర్వాత ప్రసాదం తయారీ మొదలుపెడతారు. ఈ బాండీకి కింద నాలుగు వైపులా చెక్కలను పెట్టేందుకు ద్వారాలు ఉంటాయి. వాటిల్లో 50 కేజీల చొప్పున చెక్కలను పెట్టి మంట పెడతారు. బియ్యం, పంచదార, నెయ్యి, నీళ్లు, రోజ్‌వాటర్‌, కుంకుమపువ్వు నీళ్లు, పసుపు, మైదా, డ్రైఫ్రూట్స్‌ ఉపయోగించి ఈ మీఠా చావల్‌ ప్రసాదాన్ని వండుతారు. ఆ సమయంలో దర్గాని సందర్శించడానికి వచ్చిన భక్తులంతా కడాయిలో తలా పిడికెడు బియ్యం, పంచదార వేస్తారు. ప్రసాదం ఉడికిన తర్వాత నిచ్చెన వేసుకొని బాండీలోకి దిగి బకెట్ల ద్వారా ప్రసాదాన్ని పైకి తీసుకొస్తారు. దాన్ని అక్కడున్న వాలంటీర్లకి, భక్తులకు పంచి పెడతారు. జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రసాదాన్ని తినాలంటారు భక్తులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని