Updated : 15 Jun 2021 12:55 IST

నోరూరించే క్రిస్‌మస్‌

క్రిస్‌మస్‌ అంటేనే... మనసంతా సంతోషంతో నిండిపోతుంది. మరి నోరూరించే వంటకాలతో ఆ ఆనందాన్ని రెట్టింపు చేయాలనుకుంటారా... అయితే వీటిని ప్రయత్నించాల్సిందే.


కుల్‌ కుల్‌

కావాల్సినవి: మైదా, గోధుమపిండి,  బొంబాయిరవ్వ- కప్పు చొప్పున, ఉప్పు- సరిపడా, వంటసోడా- చిటికెడు, బెల్లం- అరకేజీ, యాలకులపొడి- టీస్పూన్‌, నెయ్యి- మూడు టేబుల్‌స్పూన్లు.

తయారీ:  వెడల్పాటి గిన్నెలో మూడు రకాల పిండిలు, ఉప్పు, సోడా వేయాలి. నెయ్యిని వేడిచేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలపాలి. దీని మీద మూతపెట్టి గంటసేపు పక్కన పెట్టుకోవాలి. దీంట్లోంచి చిన్న ముద్దను తీసుకుని ఉండలా చుట్టుకోవాలి. చపాతీ కర్రకు నూనె రాసి దాని మీద ఈ ఉండను పెట్టి బొటనవేలితో నొక్కుకుంటూ వెళ్లాలి. కొత్త దువ్వెనతో కూడా గవ్వలను చేసుకోవచ్చు. కడాయిలో నూనె వేడిచేసి గవ్వలను తక్కువ మంట మీద గోధుమ రంగులోకి వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి. బెల్లంలో పావుకప్పు నీళ్లు పోసుకుని కరిగించి పాకం పట్టాలి. దీంట్లో యాలకుడి పొడి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తీగపాకం వచ్చేంతవరకు ఉండి గవ్వలను ఈ పాకంలో వేసి బాగా కలిపి తీసేయాలి.


గులాబీపూలు

కావాల్సినవి: మైదా, బియ్యప్పిండి, పంచదార పొడి, కప్పు చొప్పున, కార్న్‌ఫ్లోర్‌- పావుకప్పు, ఉప్పు- కొద్దిగా, యాలకుల పొడి- చిటికెడు.

కార్న్‌ఫ్లోర్‌ వేయడం వల్ల గులాబీపువ్వు గుత్తి నుంచి సులువుగా ఊడి వస్తుంది.

తయారీ:  వెడల్పాటి గిన్నెలో మైదా, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, పంచదార పొడి వేసి నీళ్లు పోస్తూ చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి గంటసేపు పక్కన పెట్టేస్తే పంచదార బాగా కలుస్తుంది. దీంట్లో చిటికెడు యాలకుల పొడి, ఉప్పు వేసి రెండు, మూడు నిమిషాలపాటు కలపాలి. కడాయిలో నూనె వేడిచేయాలి. దీంట్లో గులాబీలు వేసుకునే గుత్తిని పెట్టి ఐదు నిమిషాలపాటు వేడిచేస్తే పిండి గుత్తికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు పిండి మిశ్రమంలో గుత్తిన మూడు వంతులు ముంచి తర్వాత నూనెలో ముంచి ఉంచితే గుత్తి నుంచి గులాబీ పువ్వు ఊడివస్తుంది. దీన్ని తక్కువ మంట మీద దోరగా రెండు వైపులా వేయించి తీయాలి. ప్రతిసారీ గుత్తిని నూనెలో ముంచి తీస్తే గులాబీపూలు చక్కగా వస్తాయి.


క్రిస్‌మస్‌ ఫుడ్జ్‌

కావాల్సినవి: చాక్లెట్‌ చిప్స్‌- ముప్పావుకప్పు, కండెన్సెడ్‌ మిల్క్‌- లీటరు, వెన్న- నాలుగు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌- రెండు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎక్‌స్ట్రాట్‌- టీస్పూన్‌, ఉప్పు- పావు టీస్పూన్‌, కుకింగ్‌ స్ప్రే- కొద్దిగా, క్రిస్మస్‌ స్ప్రింకెల్స్‌- మూడు టేబుల్‌స్పూన్లు.

తయారీ: బేకింగ్‌ పాన్‌ మీద కుక్కింగ్‌ స్ప్రే చల్లి పేపర్‌ అతికించాలి. గిన్నెలో చాక్లెట్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, బటర్‌, క్రీమ్‌, వెనీలా, ఉప్పు వేసి తక్కువ మంట మీద కలుపుతూ కరిగించాలి. లేదా మూడు నిమిషాలపాటు అవెన్‌లో పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి పైన స్ప్రింకిల్స్‌ చల్లాలి. దీన్ని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత ముక్కల్లా కోసుకోవాలి.


శాంటా కుకీస్‌

కావాల్సినవి: మైదా- రెండు కప్పులు, పంచదార- పావుకప్పు, పాలు- పావుకప్పు, ఫుడ్‌కలర్‌ - కొద్దిగా, బటర్‌- రెండు టేబుల్‌స్పూన్లు, చాక్లెట్‌చిప్స్‌- ఐదు.

తయారీ: అవెన్‌ను ముందుగా 325 డిగ్రీల వరకు వేడిచేసి పెట్టుకోవాలి. బటర్‌ను వేడిచేసి దాంట్లో పంచదార, పాలు, ఆ తర్వాత మైదా వేసి కలపాలి. దీంట్లోంచి కప్పు ముద్దను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతా దాంట్లో ఎర్రని ఫుడ్‌కలర్‌ కలపాలి. దీంట్లోని పిండిని తీసుకుని అంగుళం, అర అంగుళం మందాన ముక్కల్లా చేసుకోవాలి. తెల్లని ముద్దలో నుంచి కొంత భాగాన్ని లడ్డూల్లా చుట్టాలి. ఎర్రభాగాన్ని శాంతా శరీరంలా వాడాలి. తెల్లని ముద్దతో చేతులు, కాళ్లూ చేయాలి. చాక్లెట్‌ చిప్స్‌ను కళ్లలా అలంకరించాలి. శాంతా సిద్ధం అయిన తర్వాత వీటిని కుకీషీట్‌ మీద ఉంచి పావుగంట పాటు బేక్‌ చేయాలి. ఇష్టమైతే ముఖం మీద కాస్త క్రీమ్‌ వేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు