కొత్తకొత్తగా ఇడ్లీ వడ్డించండి!

ఆవిరి మీద ఉడికే తెల్లని ఇడ్లీలు... తాకితేచాలు మాసిపోయేలా భలే ఉంటాయి కదా... ఆరోగ్యానికి ఎంత మంచివైనా.. చప్పగా ఉండే వీటినే ఎప్పుడూ తినాలంటే కాస్త కష్టమే అనుకుంటున్నారా... అయితే మసాలాలు అద్దిన ఈ గరంగరం ఇడ్లీలు మీ కోసమే.

Updated : 15 Jun 2021 12:49 IST

ఆవిరి మీద ఉడికే తెల్లని ఇడ్లీలు... తాకితేచాలు మాసిపోయేలా భలే ఉంటాయి కదా... ఆరోగ్యానికి ఎంత మంచివైనా.. చప్పగా ఉండే వీటినే ఎప్పుడూ తినాలంటే కాస్త కష్టమే అనుకుంటున్నారా... అయితే మసాలాలు అద్దిన ఈ గరంగరం ఇడ్లీలు మీ కోసమే.

తడ్కా ఇడ్లీ

కావాల్సినవి: చిన్నసైజు ఇడ్లీలు- ఆరు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు- పావుకప్పు చొప్పున, ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, అల్లంవెల్లుల్లి- టీస్పూన్‌ చొప్పున,  కరివేపాకు రెమ్మ- ఒకటి, కొత్తిమీర తరుగు- రెండు టీస్పూన్లు, కారం, ఆమ్‌చూర్‌ పొడి- టీస్పూన్‌ చొప్పున, పసుపు- పావు టీస్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- సరిపడా, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: కడాయిలో నూనె  వేడిచేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు వేయాలి. ఇవి కాస్త వేగాక ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి బాగా కలుపుతూ వేయించాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇడ్లీలను వేసి మసాలా అంతా వీటికి పట్టేలా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి దించేయాలి.

ఇడ్లీ టిక్కా

కావాల్సినవి: ఇడ్లీలు- నాలుగు, టొమాటో, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, పెరుగు- 100 గ్రా., పాల మీగడ- 100 గ్రా., సెనగపిండి- 100 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, కారం, ఆమ్‌చూర్‌, ధనియాలు, గరంమసాల పొడి- టీస్పూన్‌ చొప్పున, ఉప్పు- సరిపడా.
తయారీ: ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కోయాలి. గిన్నెలో పెరుగు, మీగడ, సెనగపిండి మిగతా పదార్థాలు వేసి కలపాలి. టొమాటో, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమంలో ఇడ్లీ ముక్కలు వేసి వాటికి మసాలా పట్టేలా  కలపాలి. స్టిక్‌ తీసుకుని ఇడ్లీ, టొమాటో, క్యాప్సికమ్‌ ముక్కలను ఒకదాని తర్వాత మరోటి గుచ్చాలి. 350 డిగ్రీల వద్ద పావుగంటపాటు అవెన్‌లో పెట్టి బేక్‌ చేయాలి. చిన్న ఇడ్లీలతోనూ ఇలా చేయొచ్చు.

ఇడ్లీ మంచూరియా

కావాల్సినవి: ఇడ్లీలు- నాలుగు, సన్నగా తురుమిన క్యాబేజీ- కప్పు, ఉల్లిపాయ, ఉల్లికాడలు, క్యాప్సికమ్‌ ముక్కలు- అరకప్పు చొప్పున, మిరియాల పొడి- పావుటీస్పూన్‌, సన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి ముక్కలు- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌- టేబుల్‌స్పూన్‌, సోయాసాస్‌- టీస్పూన్‌, ఉప్పు- తగినంత.
తయారీ: ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి  వీటిని వేసి రెండు వైపులా ఎర్రగా వేయించి తీయాలి. ఇదే కడాయిలో వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయాలి. తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్‌, క్యాబేజీ తురుము వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత సోయా, చిల్లీ, టొమాటో సాస్‌, మిరియాలపొడి, ఉప్పు వేయాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్‌లో కొన్నినీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని కడాయిలో వేయాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోయాలి. ఐదు నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత ఇడ్లీ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేయాలి. ఈ ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలపాలి.

చిల్లీ ఇడ్లీ

కావాల్సినవి: ఇడ్లీలు- పది, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లంముక్కలు- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, నిలువుగా చీరిన పచ్చిమిర్చి- రెండు, క్యాప్పికమ్‌ ముక్కలు- పావు కప్పు, టొమాటో, చిల్లీసాస్‌- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, సోయాసాస్‌- టేబుల్‌స్పూన్‌, వెనిగర్‌- టేబుల్‌స్పూన్‌, పంచదార- టేబుల్‌స్పూన్‌, కారం- అర టేబుల్‌స్పూన్‌, ఉప్పు- కొద్దిగా, ఉల్లికాడల ముక్కలు- పావుకప్పు.    
తయారీ: ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఈ ముక్కలను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌ ముక్కలు టొమాటో, చిల్లీసాస్‌, వెనిగర్‌ వేయాలి. ఇప్పుడు పంచదార, కారం వేసి బాగా కలుపుతూ వేయించాలి. చివరగా వేయించిన ఇడ్లీను వేసి అరకప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు పైన ఉల్లికాడల ముక్కలు, ఉప్పు వేసుకోవాలి. మిశ్రమం దగ్గర పడిన తర్వాత దించేయాలి. ఇలా చిన్న ఇడ్లీలతో కూడా చేసుకోవచ్చు.

ఇడ్లీ 65

కావాల్సినవి: ఇడ్లీలు- నాలుగు, కార్న్‌ఫ్లోర్‌- నాలుగు టేబుల్‌స్పూన్లు, కారం- అర టీస్పూన్‌, పసుపు- చిటికెడు, బ్రెడ్‌పొడి- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత.  
తయారీ: ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, కారం, పసుపు, ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఇడ్లీ ముక్కలు ముంచి, బ్రెడ్‌పొడిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఈ ముక్కలు వేసి రెండు వైపులా వేయించాలి. తక్కువ మంట మీద బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని