Published : 06 Feb 2022 00:50 IST

కాచిగూడ కాక్రాలు కావాలా?


పప్పుచారుకు జతగా అప్పడం ఉంటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేం. మరో ముద్ద ఎక్కువ తినేస్తాం. అలాంటి రుచి అప్పడాల సొంతం. ఆ రుచినే వ్యాపారంగా మలుచుకుని 30 ఏళ్లుగా గుజరాతీ ప్రత్యేక అప్పడం కాక్రాలను తయారు చేస్తున్నారు కాచిగూడకు చెందిన గీతా హంస్‌కుమార్‌ షా.
గీత రుచికరమైన కాక్రాల తయారీకి పేరుగాంచారు. పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, మసాలాలతో తయారుచేసే వీటికి దేశ, విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆధునికతను జోడించి సరికొత్త రుచులను అందిస్తుండటంతో వీటికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. అల్పాహారంగా, ప్రయాణ సమయాల్లో  కాక్రాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి గుజరాతీలతోపాటు సింధీÅ, మార్వాడీలు, స్థానికులకూ చాలా ఇష్టమైన స్నాక్స్‌.

30 ఏళ్లుగా...
గుజరాత్‌ కచ్‌కు చెందిన గీత 40 ఏళ్ల కిందట కాచిగూడకు వచ్చి స్థిరపడ్డారు. 30 ఏళ్ల క్రితం ఆమె కాక్రాల తయారీని ప్రారంభించారు. మొదట్లో తెలిసినవారికి అమ్మేవారు. క్రమంగా వీటికి ఆదరణ పెరగడంతో మహిళలతో చేయించడం మొదలు పెట్టారు. వీటి రుచి నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించింది. దీంతో ఆమె ‘గీతా మహిళా గృహ్‌ ఉద్యోగ్‌’ సంస్థను స్థాపించి పేద మహిళలు, వితంతువులకు వీటి తయారీ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు.

35 రకాల రుచులతో...
గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, మక్కలు తదితర చిరు ధాన్యాల పిండికి మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇతర మసాలాలను జోడించి 35 రకాల కాక్రాలను తయారు చేస్తున్నారు. మేథీÇ, జీరా, మసాలా, సాదా, బాజీపావ్‌, మంచూరియా మసాలా, మ్యాగీ మసాలా, కొత్తిమీర మిర్చీ, పానీపూరీ, ఛాట్‌ మసాలా, అచార్‌ మసాలా, పిజ్జా, చాక్లెట్‌, రత్లామి, డబేలీ, సజ్జలు మెంతి అల్లం, శనగలు-పల్లీ, పాలకూర, మతియా, పెసర, మోత్‌, రాగి, నాచోస్‌, ఓరియో, ఛీజ్‌, మెక్సికన్‌, పిరి-పిరి, క్రీమ్‌ ఆనియన్‌, షెజ్‌వాన్‌, ఇటాలియన్‌, బార్బిక్యూ, ట్యాంగీ టొమాటో, పంజాబీ తడ్కా, నూడుల్స్‌ తదితర రకాల కాక్రాలను రూపొందిస్తున్నారు. వీటిని తడి లేకుండా నిల్వ చేస్తే మూడు నెలలు తాజాగా ఉంటాయని చెబుతారామె. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఆర్డర్‌తో నగరంతోపాటు ఇతర రాష్ట్రాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు పంపిస్తున్నారు. కాక్రాల్లో కొన్ని రకాలను జైనుల కోసం ప్రత్యేకంగా చేస్తుండటం విశేషం.

-వినోద్‌, కాచిగూడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు