ఇడ్లీ ఏటీఎమ్‌!

వేడివేడి ఇడ్లీలు తిన్నప్పుడు ఉండే మజానే వేరు. ఇంట్లో చేసుకుంటే తప్ప బయట వేడివేడిగా తినడం కొద్దిగా కష్టమే. అందులోనూ ఏ రాత్రిపూటో తినాలనుకుంటే మరీ కష్టం.

Published : 16 Oct 2022 00:19 IST

వేడివేడి ఇడ్లీలు తిన్నప్పుడు ఉండే మజానే వేరు. ఇంట్లో చేసుకుంటే తప్ప బయట వేడివేడిగా తినడం కొద్దిగా కష్టమే. అందులోనూ ఏ రాత్రిపూటో తినాలనుకుంటే మరీ కష్టం. ఆ ఇబ్బంది లేకుండా ఇక నుంచి అర్ధరాత్రి కూడా వేడివేడి పొగలు కక్కే ఇడ్లీలను తినొచ్చు. అదెలా అంటారా? ఇడ్లీ ఏటీఎమ్‌కెళ్లి బటన్‌ నొక్కితే చాలు. మీరెన్ని కోరుకుంటే అన్ని అప్పటికప్పుడు వండిన రుచికరమైన వేడి ఇడ్లీలు.. చట్నీతో కలిసి అందుతాయి. బాగుంది కదా! ఈ ఏర్పాటు. బెంగళూరుకు చెందిన ఫ్రెష్‌హాట్‌ రోబోటిక్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ ఈ ఇడ్లీ ఏటీఎమ్‌ని లేదా ఇడ్లీ బాట్‌ని  ప్రారంభించింది. 2016లో శరణ్‌హితమత్‌ అనే ఆయన ఆరోగ్యం బాగోలేని తన కూతురుకి తినిపించడం కోసం ఇడ్లీలు కొందామని ఊరంతా తిరిగినా ఎక్కడా దొరకలేదట. మరో సారి స్నేహితుడు సరేష్‌ చంద్రశేఖరన్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు చల్లారిపోయి గట్టిగా రాళ్లలా మారిన ఇడ్లీలు పలకరించాయట. దీనికి అప్పటికప్పుడు తయారు చేసే మెషీన్‌ ఇడ్లీలే మార్గమని చెప్పి ఇద్దరూ కలిసి ఈ ఇడ్లీ బాట్‌ని తయారుచేశారు. మెనూలో ఆర్డర్‌ఇస్తే ఒక నిమిషంలో ఇడ్లీలని ఇచ్చేస్తుంది. ఒకేసారి 72 ఇడ్లీలను పన్నెండు నిమిషాల్లో తయారుచేయగలదు. త్వరలో దోసబాట్‌, రైస్‌ బాట్‌ కూడా చేయాలనుకుంటున్నారు వీళ్లు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని