Published : 23 Oct 2022 00:47 IST

గోదావరి రుచులు.. తొంభై రూపాయలకే!

గోదావరి జిల్లాల రుచుల్ని ఆస్వాదించాలంటే.. గోదావరి మొత్తం చుట్టేయాల్సిన పనిలేదు. రావులపాలెంలోని ఆర్కే టిఫిన్స్‌కి వెళ్తే చాలు..

చిట్టి పెసరట్టు నుంచి పొట్టిక్కల వరకూ పదకొండు రకాల టిఫిన్‌లను వాటి రుచిని పెంచే ఆరు రకాల చట్నీలతో కలిసి హాయిగా ఆరగించేయొచ్చు. అమ్మో బోలెడు ఖర్చు కదా అంటారా! ఆ భయమే అక్కర్లేదు. తొంభై రూపాయల్లోనే మీరు మెచ్చిన రకాల్ని నచ్చినన్ని తినేయొచ్చు మరింకెందుకాలస్యం ఓ పట్టు పట్టేద్దాం.

కాకినాడ చిట్టి పెసరట్టూ, పాలకొల్లు దిబ్బరొట్టె, అంబాజీపేట పొట్టిక్కలూ...మినప గారెలూ, ఆవిరి కుడుములూ, పెసర పునుగులూ, విటమిన్‌ ఇడ్లీలూ...ఇలా ఒక్కో పేరూ చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా! నిజమే...గోదావరి రుచులు వేటికవే భిన్నం. ప్రాంతానికో ప్రత్యేకతతో చవులూరిస్తాయి. అలాగని ఒక్కో చోటుకీ వెళ్లి రుచి చూసే వీలు అందరికీ కుదరక పోవచ్చు. ఇంకెక్కడైనా దొరికినా... ఒకటో రెండో రకాలు తిని సరిపెట్టుకోవాలి. అలాకాకుండా, అన్నీ కలిపి ఒకే ప్లేటులో వడ్డిస్తే... ఆలోచన అదిరిపోయింది కదూ! అదే అమలు చేశారు దాని యజమాని గొలుగూరి వెంకటరెడ్డి. ఆర్కే టిఫిన్స్‌ 2014లో ప్రారంభమైంది. స్వతహాగా ఆహార ప్రియుడైన ఆయన గోదావరి జిల్లా వారి రుచులతో పాటూ...మన్ననలూ, మర్యాదలూ పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పరిచయం చేయాలని భావించారు. అలా వచ్చిందే ఈ అన్‌లిమిటెడ్‌ టిఫిన్ల ఐడియా. తొంభై రూపాయిలిస్తే చాలు... చెరుకు పానకంతో దిబ్బరొట్టె, చిట్టిగారెలూ- అల్లం పచ్చడీ, ఇడ్లీ- చింతామణి చట్నీ...ఇలా మీకు నచ్చిన కాంబినేషన్‌లో లాగించేయచ్చు. రుచితోపాటు ప్రజా రోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రాగులూ, పెసలూ,  బీట్‌రూట్‌, మినప్పప్పు... వంటి వాటితో చేసిన వేడివేడి ఇడ్లీలను అందిస్తున్నారు. మొలకలతో చేసిన వడలూ...జిహ్వ చాపల్యాన్ని రెట్టింపు చేసే పొట్టిక్కలు ఏది తిన్నా రుచి మాత్రం అదుర్స్‌.

-స్వాతి, రావులపాలెం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు