Updated : 20 Nov 2022 06:38 IST

షడ్రుచుల పానీపూరీ

పానీ పూరీ బండి కనిపించిందంటే చాలు.. ఆగిపోయేవాళ్లలో మీరూ ఒకరా? అయితే ఈ రాజస్థానీ పానీపూరీ గురించి తెలుసుకోవాల్సిందే. వరంగల్‌ నగరంలో ఇప్పుడు అనేక కూడళ్లలో రాజస్థానీ పానీపూరీకి భలే గిరాకీ. మామూలు పానీ పూరీతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ పానీ ఆరు రుచుల్లో దొరుకుతోంది. ఈ బండిపై ఆరు జాడీలు పెట్టుకుంటారు. ఒక్కో జాడీలో ఒక్కో రుచిగల నీళ్లు ఉంటాయి. జల్‌ జీరా, రాజ్వాడా, వెల్లుల్లి, తీపి (స్వీట్), పుదీనా, రెగ్యులర్‌. ఒకటి తియ్యగా, ఒకటి జీలకర్రతో, మరోటి పుదీనాతో, వెల్లుల్లి నీరు కాస్త కారంగా.. ఇలా ప్లేటు పానీ పూరీ ఆరగించేంతలో నాలుకకు ఆరు రుచులు తగులుతాయి. పానీ వేయడానికి వాడే గరిటెలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ గరిటెలకు కింది వైపు చిల్లు ఉండడంతో జాడీలో నుంచి గరిటెతో నీరు తీసి నేరుగా పూరీలో వేయొచ్చు. దాంతో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉండదు. రాజస్థాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ పానీ పూరీని విక్రయించేందుకు తాను వరంగల్‌ నగరానికి వచ్చానని, అనేక ఔషధ గుణాలున్న నీరు పానీ పూరీలో వేయడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా మంచిదేనని అదాలత్‌ కూడలి వద్ద బండి నడిపిస్తున్న యశ్వంత్‌ చెబుతున్నాడు

- పాండురంగశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts