గజగజ.. కరకర
వణికించే చలికి తోడుగా.. వేడివేడి పకోడీలు ఉంటే? ఆహా ఇంతకు మించిన కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి! అలాగని ఎప్పుడూ ఒకేరకం తినలేం కదా. అందుకే కాస్త భిన్నంగా ఆలోచించి, ఇలాంటి వెరైటీ పకోడీలని ప్రయత్నించి చూడండి. రుచి, పోషకాలని సొంతం చేసుకోండి..
హక్కా చైనీస్ పకోడా
కావాల్సినవి: బోన్‌లెస్ చికెన్- 900గ్రా, షెజువాన్ సాస్- 3 చెంచాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- చెంచా, వెల్లుల్లి పలుకులు- రెండు చెంచాలు, తరిగిన ఉల్లికాడలు- రెండు చెంచాలు, సోయాసాస్- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, కొత్తిమీర తరుగు- పావుకప్పు, మొక్కజొన్న పిండి- అర కప్పు, మైదా- అర కప్పు, నీళ్లు- కప్పు, బేకింగ్‌సోడా- చెంచా, నూనె- తగినంత
తయారీ: శుభ్రం చేసిన చికెన్‌ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇలా అయితే త్వరగా వేగుతాయి. వీటికి షెజువాన్ సాస్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పలుకులు, ఉల్లికాడల తరుగు, సోయాసాస్, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. సమయం ఉంటే రాత్రంతా మారినేట్ చేసి పెట్టుకోవచ్చు. వేయించడానికి ముందు మొక్కజొన్నపిండి, మైదా తగినన్ని నీళ్లు వేసి కలపాలి. పకోడీలు వేయడానికి ముందు మాత్రమే బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో చిన్నచిన్న పకోడీల్లా వేయించుకోవడమే. ఎంత ఎక్కువ సేపు మారినేట్ చేసి ఉంచితే ముక్కకి ఉప్పు, కారం అంతబాగా పట్టి రుచిగా ఉంటాయి.
కార్న్‌పకోడీ
కావాల్సినవి: స్వీట్‌కార్న్- రెండు కప్పులు, ఉల్లిపాయ- ఒకటి, సెనగపిండి- కప్పు, బియ్యప్పిండి- రెండు చెంచాలు, పసుపు- పావు చెంచా, కారం- అర చెంచా, అల్లం, వెల్లుల్లి పేస్ట్- అర చెంచా, చాట్ మసాలా- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెబ్బ, ఉప్పు- తగినంత, నూనె- సరిపడ
తయారీ: ఉడికించిన మొక్కజొన్న గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు.. వీటిని మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. దీనికి సెనగపిండి, బియ్యప్పిండి, పసుపు, కారం, చాట్‌మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఉప్పు, కరివేపాకు వేసి నీళ్లు వేయకుండా ఈ మిశ్రమాన్ని కలపాలి. పల్చగా అనిపిస్తే కాస్త సెనగపిండి కలపొచ్చు. తగినంత నూనెలో పకోడీలు వేయించుకోవడమే. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.
మొలకల పకోడి
కావాల్సినవి: మొలకొచ్చిన పెసలు- ఒకటింపావు కప్పు, బియ్యప్పిండి- రెండు చెంచాలు, పుదీనా తరుగు- రెండు చెంచాలు, వెల్లుల్లిపేస్ట్- పావుచెంచా, అల్లంముద్ద- పావుచెంచా, పచ్చిమిర్చి పేస్ట్- అరచెంచా, ఉప్పు, నూనె- తగినంత, కొత్తిమీర తరుగు- చెంచా, ఉల్లిపాయముక్కలు- పావుకప్పు
తయారీ: పెసలని రాత్రంతా నానబెట్టి... వస్త్రంలో మూటకడితే సాయంత్రానికి మొలకలొస్తాయి. వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నీళ్లు ఎక్కువ వేయకుండా కలపాలి. తగినంత నూనెలో వేయించుకుంటే కరకరలాడే మొలకల పకోడీలు సిద్ధం.
సోయా పకోడా
కావాల్సినవి: సోయాచంక్స్- రెండు కప్పులు, నీళ్లు- 2 కప్పులు, పచ్చిమిర్చి- మూడు, అల్లం- అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు- ఐదు, కారం- 2 చెంచాలు, ధనియాల పొడి- చెంచా, పసుపు- అర చెంచా, గరంమసాలా- అర చెంచా, ఉప్పు- తగినంత, చాట్‌మసాలా- చెంచా, పెరుగు- మూడు చెంచాల, మొక్కజొన్నపిండి- మూడు చెంచాలు, మైదా- మూడు చెంచాలు, తరిగిన కొత్తిమీర- చెంచా, నూనె- వేయించడానికి సరిపడా
తయారీ: ఒక పాన్‌లో రెండు కప్పుల నీళ్లు తీసుకుని సోయాచంక్స్ వేసి రెండు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. చల్లారాక వడకట్టి సోయాచంక్స్‌లోని ఎక్కువగా నీళ్లని పిండేయాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లులను వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సోయాచంక్స్‌లో వేసి, కారం, ధనియాలపొడి, పసుపు, గరంమసాలా, ఉప్పు, చాట్‌మసాలా, పెరుగు, మొక్కజొన్నపిండి, మైదా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. చివరిగా కొద్దిగా ఫుడ్‌కలర్ వేసుకోవాలి. స్టౌ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడెక్కాక సోయా మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లా వేసుకోవడమే. టొమాటోసాస్‌తో తింటే చాలా బాగుంటాయి.
మెంతి పకోడీ
కావాల్సినవి: మెంతాకు- ముప్పావుకప్పు, సెనగపిండి- కప్పు, కొత్తిమీర తరుగు- పావుకప్పు, పచ్చిమిర్చి- మూడు, నిలువునా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు- పావుకప్పు, పసుపు- పావు చెంచా, ఇంగువ- పావుచెంచా, ఉప్పు- రుచికి తగినంత, నూనె- వేయించడానికి సరిపడ
తయారీ: ఒక పాత్రలో కాడల్లేకుండా తరిగిన మెంతికూర, సెనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ, ఉప్పు అవసరమైతే కొద్దిగా కారం వేసుకుని ఈ మిశ్రమాన్ని నీళ్లు పోసుకుంటూ మరీ జారు కాకుండా కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసుకుని, వేడెక్కాక అందులో పిండిని కావాల్సిన సైజులో పకోడీల్లా వేసుకోవాలి. వీటిని గ్రీన్ చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Nikhat Zareen: చాలా హ్యాపీగా ఉంది.. తర్వాతి టార్గెట్ అదే..!
-
Politics News
Akhilesh: దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపైనే ఆందోళన : అఖిలేష్
-
India News
Anand Mahindra: ‘సండే సరదా.. నేను ఆ విషయాన్ని నేను మర్చిపోతా’
-
World News
USA: భారత సంతతి చిన్నారి మరణం.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
-
Movies News
Social Look: రకుల్‌ప్రీత్ ‘23 మిలియన్ల’ హ్యాపీ.. నిజం కాదంటోన్న నేహాశర్మ!
-
World News
Taiwan: తైవాన్ చైనాలో భాగమే.. హోండురాస్ ప్రకటన..!