ఇడ్లీ మిక్స్‌ ఇలా చేయాలి!

ఇడ్లీ చేయాలంటే.. ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టి, మర్నాడు ఉదయం రుబ్బి, దానికి రవ్వ జతచేసి.. కొన్ని గంటలు పులియబెట్టాలి. ఇంత ప్రహసనం లేకుండా ఇడ్లీ మిక్స్‌ తయారుగా ఉందనుకోండి..

Published : 16 Jun 2024 00:33 IST

డ్లీ చేయాలంటే.. ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టి, మర్నాడు ఉదయం రుబ్బి, దానికి రవ్వ జతచేసి.. కొన్ని గంటలు పులియబెట్టాలి. ఇంత ప్రహసనం లేకుండా ఇడ్లీ మిక్స్‌ తయారుగా ఉందనుకోండి.. నిమిషాల్లో ఇడ్లీలు చేసుకోవచ్చు. ఆ ఇడ్లీ మిక్స్‌ను కొనకుండా ఇంట్లోనే చేసేయొచ్చు. అందుకోసం బియ్యప్పిండి 4 కప్పులు, మినప్పప్పు 2 కప్పులు, అటుకులు కప్పు, రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా బేకింగ్‌ సోడా సిద్ధం చేసుకోవాలి. ఎలా చేయాలంటే.. మినప్పప్పును మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. దాన్ని పళ్లెంలోకి తీసి.. అదే కడాయిలో అటుకులను కొద్దిగా వేయించాలి. రెండింటినీ చల్లారనిచ్చి  మెత్తగా పొడి చేసుకోవాలి. ఒకసారి జల్లించి, మళ్లీ పొడి చేయాలి. అప్పుడే చాలా మెత్తగా ఉంటుంది. అందులో బియ్యప్పిండి, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి.. బాగా కలపాలి. దీన్ని తడి లేని, గాలి చొరబడని సీసాలో ఉంచితే చాన్నాళ్లు నిలవుంటుంది.

ఇడ్లీ చేయాలనుకున్నప్పుడు.. రెండు కప్పుల ఇడ్లీ మిక్స్‌లో ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు పెరుగు వేసి.. ఒకటికి నాలుగుసార్లు కలిపితే.. మెత్తటి పిండి తయారవుతుంది. ఇడ్లీ ప్లేట్లలో నెయ్యి లేదా నూనె రాసి, తగినంత పిండి వేసి.. సుమారు పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది. నానబెట్టడం, రుబ్బడం లాంటి హంగామా లేకుండా.. అనుకోని అతిథులొచ్చినా ఆదుకుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని