ఉద్యోగులకు ఉసిరి సవాల్‌!

దిల్లీలోని ఓ కార్యాలయం... ఉద్యోగులందరూ ఒకే సమయంలో తింటున్నారు. ఇందులో వింతేముంది? అంటారా... వాళ్లందరూ నములుతుంది ఉసిరికాయను మరి. సిబ్బంది అందరూ రోజూ ఓ ఉసిరి తినాలని ఆ సంస్థ యజమాని నియమం పెట్టారట. ఇంతకీ అసలు కారణం ఏమిటంటే...

Published : 13 Feb 2022 01:38 IST

దిల్లీలోని ఓ కార్యాలయం... ఉద్యోగులందరూ ఒకే సమయంలో తింటున్నారు. ఇందులో వింతేముంది? అంటారా... వాళ్లందరూ నములుతుంది ఉసిరికాయను మరి. సిబ్బంది అందరూ రోజూ ఓ ఉసిరి తినాలని ఆ సంస్థ యజమాని నియమం పెట్టారట. ఇంతకీ అసలు కారణం ఏమిటంటే...

‘అజంతా బాటిల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ డైరెక్టర్‌ దీపాంకర్‌ అగర్వాల్‌ ఆలోచన ఇది. విటమిన్‌ సి మెండుగా ఉండే ఉసిరి తింటే రోగనిరోధకత పెరుగుతుందని తెలుసుగా. తమ సిబ్బంది అంతా ఆరోగ్యంగా ఉండేందుకు ఆ సంస్థ యజమాని ఈ నిర్ణయం తీసుకున్నారట. దాంతో గత ఏడాది డిసెంబరు 20 నుంచి ఉద్యోగులందరూ ఈ ఆమ్లా సవాల్‌కి సై అన్నారు. దీపాంకర్‌ గత నవంబరులో జలుబు, రొంపతో బాధపడ్డారట. ఆయనకెవరో నిమ్మరసం నీళ్లు తాగితే జలుబు నియంత్రలో ఉంటుందని చెబితే దాన్ని ఆచరించారట. ఆ తర్వాత ఓ ఆయుర్వేద నిపుణుడి సలహాతో నిమ్మకాయ స్థానంలో ఉసిరిని తీసుకోవడం మొదలుపెట్టార[ట. దాంతో కొద్దిరోజుల్లో ఆరోగ్యం కుదురుకుంది. ‘గత డిసెంబరులో సంస్థలోని ఉద్యోగులు ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడసాగారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని.. అందుకోసం నాలాగే ఉసిరిని ప్రతి ఒక్కరూ రోజూ తీసుకోవాలని సూచించా’ అని చెబుతారాయన. పుల్లపుల్లగా, వగరుగా ఉండే ఉసిరిని తినడానికి మొదట్లో కొందరు ఉద్యోగులు ఇబ్బంది పడినా దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలియడంతో క్రమంగా అందరూ తినడం మొదలుపెట్టారు. అంతేకాదు వాళ్లలా మరెందరో ఆరోగ్యంగా ఉండటానికి ఇతరులను మోటివేట్‌ చేయడానికి ఓ వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ ఏడాది మార్చి వరకు ఇలా ఉద్యోగులందరితో ఉసిరి తినిపించనున్నారు. ఆ తర్వాత కూడా వారి ఆరోగ్యం కోసం ఉసిరిపొడిని అందిస్తామని చెబుతున్నారాయన. సవాల్‌ బాగుంది కదూ... మీరూ సిద్ధమేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని