కొవ్వును కరిగించే మామిడికాయ!

ఉగాది పచ్చడిలో మామిడికాయ తప్పకుండా ఉండాల్సిందే. రాబోయే రెండు మూడు నెలలు మామిడికాయలతో పచ్చిపులుసు మొదలుకుని ఆవకాయ వరకు ఎన్నో రకాలను చేసుకోవచ్చు. పచ్చిముక్కలకే

Updated : 27 Mar 2022 06:18 IST

ఉగాది పచ్చడిలో మామిడికాయ తప్పకుండా ఉండాల్సిందే. రాబోయే రెండు మూడు నెలలు మామిడికాయలతో పచ్చిపులుసు మొదలుకుని ఆవకాయ వరకు ఎన్నో రకాలను చేసుకోవచ్చు. పచ్చిముక్కలకే కారం, ఉప్పు కలిపి తింటామంటారా... మరెందుకాలస్యం కానీయండి. ఈ కాయ పులుపుతోపాటు బోలెడు పోషకాలనూ అందిస్తుంది.

* వంద గ్రాముల మామిడికాయలో పిండిపదార్థాలు 15 గ్రా., కొవ్వు 0.4 గ్రా., పీచు 1.6 గ్రా., 0.8 గ్రా., ప్రొటీన్లు ఉంటాయి. లభించే కెలొరీలేమో 60.  

* విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రోగనిరోధకత పెరుగుతుంది. సాధారణంగా ఈ కాయలు చలవ చేస్తాయి. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూస్తాయి.

* మామిడి పండుతో పోలిస్తే కాయ నుంచి వచ్చే కెలొరీలు చాలా చాలా తక్కువ. చక్కెరలు కూడా. ఇది జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

* జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం, అజీర్తితో బాధపడేవారు దీన్ని తీసుకుంటే ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

* కొందరు గర్భిణుల్లో వాంతులు, వికారం చూస్తుంటాం. ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు మామిడి ముక్కలను తింటే ఫలితం ఉంటుంది.

* మామిడికాయలో విటమిన్‌-ఎ, సిలతోపాటు మెగ్నీషియమూ ఎక్కువే. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి చర్మం, జుట్టును మెరిపిస్తుంది.  

* పచ్చికాయలు శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను నియంత్రిస్తాయి. ఈ కాయలో విటమిన్‌-బి3 పుష్కలంగా ఉంటుంది. నియాసిన్‌గా పిలిచే ఈ పోషకం గుండె జబ్బుల నుంచి దూరం చేస్తుంది.

* కచ్చా ఆమ్‌లో క్యాల్షియమూ ఎక్కువే. ఇది దంతాలకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. మామిడి కాయ ముక్కలను తరచూ తింటుంటే చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా మారతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని