నిమ్మళంగా తాగండి!

ఎండలు మండుతున్నాయి. నీళ్లు తాగిన కొద్దిసేపటికే నాలుక తడారిపోతుంది.  ఈ సమయంలో నీళ్లతోపాటు పోషకాలుండే ఏదైనా డ్రింక్‌ తాగితే బాగుంటుంది కదూ. నిమ్మకాయ నీళ్లు చక్కటి ఎంపిక. దీంట్లో పోషకాలు, రోగనిరోధకతను పెంచే

Updated : 03 Apr 2022 06:43 IST

ఎండలు మండుతున్నాయి. నీళ్లు తాగిన కొద్దిసేపటికే నాలుక తడారిపోతుంది.  ఈ సమయంలో నీళ్లతోపాటు పోషకాలుండే ఏదైనా డ్రింక్‌ తాగితే బాగుంటుంది కదూ. నిమ్మకాయ నీళ్లు చక్కటి ఎంపిక. దీంట్లో పోషకాలు, రోగనిరోధకతను పెంచే విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే నిమ్మ ఏడాది పొడవునా దొరుకుతుంది. ప్రతిసారి చక్కెరో, ఉప్పో వేసుకుని తాగే బదులుగా.... మరికొన్ని పండ్లు, పదార్థాలను కలిపి నిమ్మనీళ్లను ఆస్వాదించండి. దాహం తీరడంతోపాటు  కొత్త రుచులూ తెలుస్తాయి.


కులుక్కి షర్బత్‌...

కావాల్సినవి: నిమ్మకాయ- ఒకటి, ఉప్పు- చిటికెడు, చక్కెర, నానబెట్టిన సబ్జా గింజలు- రెండు చెంచాల చొప్పున; నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- ఒకటి, పుదీనా ఆకులు- నాలుగైదు, ఐస్‌ క్యూబ్స్‌- కొన్ని, నీళ్లు- తగినన్ని.

తయారీ: గిన్నెలో సబ్జా గింజలు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. నిమ్మకాయను మూడు స్లైస్‌లుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. గ్లాసులో సన్నటి నిమ్మకాయ చక్రం, ఉప్పు, చక్కెర వేసుకోవాలి. కావాలనుకుంటే తేనెను కలపొచ్చు. గ్లాసు షర్బత్‌కి ఒక నిమ్మకాయ రసం సరిపోతుంది. నిమ్మరసాన్ని గ్లాసులో పిండాలి. దీంట్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు, పచ్చిమిర్చి, ఐస్‌ క్యూబ్స్‌, పుదీనా ఆకులు వేసి కొన్ని నీళ్లు పోయాలి. ఇప్పుడొక గ్లాసు తీసుకుని ఈ గ్లాసుపై పెట్టి బాగా కలపాలి. (షేక్‌ చేయాలి) అంతే కేరళీయులు మెచ్చే చల్లచల్లని కులుక్కి షర్బత్‌ సిద్ధం. తాగేయండి మరి.


జింజర్‌ ఆలె...

కావాల్సినవి: జింజర్‌ సిరప్‌- రెండు పెద్ద చెంచాలు, నిమ్మకాయ- ఒకటి (రసం తీసుకోవాలి), పుదీనా ఆకులు- నాలుగైదు, ఐస్‌ క్యూబ్స్‌- కొన్ని, సోడా (ఇష్టమైతే)- గ్లాసు, నిమ్మకాయ చక్రాలు- రెండు.

తయారీ: గ్లాసులో జింజర్‌ సిరప్‌, నిమ్మరసం, నిమ్మకాయ చక్రాలు, పుదీనా ఆకులు, మంచు ముక్కలను ఒకదాని తర్వాత మరొకటి వేసి, చివరగా సోడా/చల్లని నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే నిమిషాల్లో సిద్ధమయ్యే ఇది రుచితోపాటు తక్షణ శక్తినీ ఇస్తుంది.

(జింజర్‌ సిరప్‌ తయారీ: అల్లాన్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి నిలువుగా సన్నని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఈ ముక్కలను వేసి దాదాపు పదిహేను నిమిషాలు మరిగించాలి. ముదురు గోధుమ రంగు వచ్చాక పొయ్యి కట్టేయాలి. ఈ నీటిని వడకట్టుకోవాలి. పెద్ద పాత్రలోకి తీసుకుని చక్కెర వేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చి సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. ఇది దాదాపు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.)


జీరా లెమన్‌ జ్యూస్‌...

కావాల్సినవి: నిమ్మకాయ- ఒకటి (రసం తీసుకోవాలి), ఐస్‌ క్యూబ్స్‌- కొన్ని, జీలకర్ర పొడి- అర చెంచా, నల్లుప్పు/ఉప్పు- తగినంత, చక్కెర- రెండు చెంచాలు, పుదీనా ఆకులు- నాలుగైదు.

తయారీ: గ్లాసులో ఐసు ముక్కలు, జీలకర్ర పొడి, నల్లుప్పు/ఉప్పు, చక్కెర, నిమ్మరసం, పుదీనా ఆకులు, చల్లని నీళ్లు... ఇలా అన్నీ వేసి బాగా కలపాలి. దీన్ని చిటికెలో తయారు చేసుకోవచ్చు. మండే ఎండల్లో తాగితే చల్లదనంతోపాటు పోషకాలూ అందుతాయి.


లెమన్‌ మింట్‌...

కావాల్సినవి: నిమ్మకాయలు- నాలుగు (రసం తీసుకోవాలి), పుదీనా ఆకులు- రెండు కప్పులు, షుగర్‌ సిరప్‌- కప్పు, నీళ్లు, ఐస్‌ క్యూబ్స్‌- తగినన్ని.

తయారీ: నిమ్మకాయల నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో పుదీనా ఆకులు వేసి, అర కప్పు నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకోవాలి. ఇందులో నిమ్మరసం, షుగర్‌ సిరప్‌ వేసుకోవాలి. కొన్ని ఐస్‌ ముక్కలనూ జత చేసి మిక్సీ పట్టాలి. ఈ రసాన్ని గ్లాసులో పోసుకుని తాగడమే తరువాయి.


రూఅఫ్‌జా లెమన్‌ డ్రింక్‌...

కావాల్సినవి: నిమ్మకాయ- ఒకటి (రసం తీసుకోవాలి) ఉప్పు, నల్లుప్పు, మిరియాల పొడి- చిటికెడు చొప్పున, గులాబ్‌ రూఅఫ్‌జా సిరప్‌- నాలుగైదు పెద్ద చెంచాలు, ఐస్‌ క్యూబ్స్‌- మూడు, నానబెట్టిన చియా గింజలు- రెండు చెంచాలు. సోడా/నీళ్లు- తగినన్ని.

తయారీ: గ్లాసులో నిమ్మరసం పిండాలి. ఇందులో చిటికెడు చొప్పున ఉప్పు, నల్లుప్పు, మిరియాల పొడి, రూఅఫ్‌జా సిరప్‌, పుదీనా ఆకులు, ఐస్‌ ముక్కలు, నానబెట్టిన చియా గింజలు వేసి, తగినన్ని నీళ్లు/సోడా పోసి బాగా కలపాలి. అంతే రుచికరమైన చల్లచల్లని రూఅఫ్‌జా లెమన్‌ డ్రింక్‌ రెడీ.


బ్లూ క్యూరసావ్‌ లెమనాయిడ్‌...

కావాల్సినవి: నిమ్మకాయ- ఒకటి (చిన్న ముక్కలుగా చేసుకోవాలి), చక్కెర సిరప్‌- పెద్ద చెంచాన్నర, ఐస్‌ క్యూబ్స్‌- కొన్ని, బ్లూ క్యూరసావ్‌ సిరప్‌- అర చెంచా, సోడా- గ్లాసు.

తయారీ: గ్లాసులో నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. దీనికి చక్కెర సిరప్‌ను జత చేసి గరిటెతో బాగా కలియబెట్టాలి. ఇలా చేస్తే పులుపు, తీపి రెండూ కలిసిపోతాయి. ఇందులో ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవాలి. చివరగా అర చెంచా బ్లూ క్యూరసావ్‌ సిరప్‌ జత చేయాలి. (ఇది సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది) ఆ తర్వాత సోడా నీళ్లు పోసి బాగా కలపాలి. సముద్ర నీలం రంగులో కడలే మీ గ్లాసులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. స్ట్రా వేసుకుని తాగేయండి మరి.


లాభాలు...

నిమ్మరసంలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో తోడ్పడుతుంది. దీనిలోని పీచు వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. కళ్లు, చర్మం, జుట్టు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో దీనిలోని థైమిన్‌ ముందుంటుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నిమ్మరసంలో ఫ్లేవనాయిడ్స్‌ కూడా మెండుగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

* దీంట్లోని సిట్రిక్‌ ఆమ్లం యాంటీఆక్సిడెంట్లను కలిగి కొవ్వులను కరిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి చక్కని ఎంపిక.

* గొంతులో గరగరమనిపిస్తోందా.. వేడి నీళ్లలో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

* ఆరోగ్యాన్నే కాదు అందం మెరుగుదలలోనూ ముందుంటుంది.

* గ్లాసు నిమ్మరసం నీళ్లను తాగితే కావాల్సినన్ని ఎలక్ట్రోలైట్స్‌ అందుతాయి. ఇవి తక్షణ శక్తిని అందించి మెదడును చురుకుగా మారుస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని