ముంజెలతో మస్త్‌ రుచులు!

మండే ఎండల్లో లేత ముంజెల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? ఏడాదంతా ఎదురుచూసే ఆ రుచికి కాసిని  మామిడిపండు ముక్కలో, పాలో కలిపి జ్యూస్‌ చేయండి.

Updated : 30 Apr 2023 00:55 IST

మండే ఎండల్లో లేత ముంజెల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? ఏడాదంతా ఎదురుచూసే ఆ రుచికి కాసిని  మామిడిపండు ముక్కలో, పాలో కలిపి జ్యూస్‌ చేయండి. దాని ముందు ఏ రుచైనా బలాదూరే. అలాంటి పానీయాలే ఇవన్నీ..


స్ట్రాబెర్రీతో..

కావల్సినవి: ముంజెలు- మూడు, స్ట్రాబెర్రీ గుజ్జు- చెంచా, చల్లటి పాలు- కప్పు, పంచదార- రెండు టేబుల్‌ స్పూన్లు, ఐస్‌క్రీం- రెండు స్కూపులు, బాదం- ముక్కలుగా దంచిన పొడి చెంచా, ఐస్‌ ముక్కలు- ఎనిమిది.

తయారీ: ముంజెలపై ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో స్ట్రాబెర్రీ గుజ్జు, ముంజెలు, పాలు, పంచదార వేసి స్మూతీలాగా  మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఐస్‌క్రీం వేసుకొని మరోసారి తిప్పాలి. తర్వాత గ్లాసులోకి తీసుకొని దానిపై బాదం పొడి, ఐస్‌క్రీం, ఐస్‌ ముక్కలు వేసుకొని సర్వ్‌ చేసుకోవటమే. చల్లచల్లటి స్ట్రాబెర్రీ ముంజెల మిల్క్‌షేక్‌ రెడీ!


మామిడి పండుతో..

కావల్సినవి: ముంజెలు- నాలుగు, మామిడిపండు- ఒకటి, పాలు- కప్పు, పంచదార- రెండు చెంచాలు, ఐస్‌క్రీం- రెండు స్కూపులు, ఐస్‌ముక్కలు- ఎనిమిది.

తయారీ: ముంజెలపై ఉన్న పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. మామిడి పండుని కూడా చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీజార్‌ తీసుకొని దాంట్లో మామిడి పండు ముక్కలు, ముంజెలు సగం, పాలు, పంచదార, ఐస్‌క్రీం వేసుకొని బ్లెండ్‌ చేసుకోవాలి. గ్లాసులోకి తీసుకొని మిగిలిన ముంజెల ముక్కలు, కొద్దిగా ఐస్‌క్రీం, ఐస్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేసుకోవటమే.


మిల్క్‌ షేక్‌..

కావల్సినవి: ముంజెలు- అయిదు, పాలు- కప్పు, వెనిల్లా ఐస్‌క్రీం- రెండు స్కూపులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- మూడు చెంచాలు, డ్రైఫ్రూట్స్‌- రెండు చెంచాలు.

తయారీ: ముంజెలను పొట్టు తీసి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. వీటికి పాలు, పంచదార, కండెన్స్‌డ్‌ మిల్క్‌, ఐస్‌క్రీం, ఓ చెంచా డ్రైఫ్రూట్స్‌ వేసి మిక్సీ తిప్పాలి. తర్వాత గ్లాసులో పోసుకొని సన్నగా తరిగిన ముంజెల ముక్కలు, డ్రైఫ్రూట్‌్్స తరుగు, ఐస్‌ ముక్కలు వేసుకొని సర్వ్‌ చేసుకోవటమే.


ముంజెల ఖీర్‌..

కావల్సినవి: ముంజెలు- పది, బాదం- పావు కప్పు, జీడిపప్పు- పావు కప్పు, యాలకులు- నాలుగు, తరిగిన డ్రైఫ్రూట్స్‌- రెండు చెంచాలు, కుంకుమ పువ్వు- చిటికెడు, పచ్చి కొబ్బరి- కప్పు, బెల్లం- అరకప్పు.

తయారీ: ముంజెలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిలో కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ వేసుకోవాలి. దాన్ని వడ పోసుకొని పాలు మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బాదం, జీడిపప్పు డ్రైరోస్ట్‌ చేసుకోవాలి. మిక్సీగిన్నెలో ముంజెలు, బాదం, జీడిపప్పు, బెల్లం వేసి తిప్పుకోవాలి. కొబ్బరిపాల గిన్నెలో ఈ పేస్టు కలపాలి. దాంట్లో కొన్ని ముంజెల ముక్కలు, డ్రైఫ్రూట్‌ తరుగు వేసుకొని ఓ గంట ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేసుకోవాలి.


షరబత్‌..

కావల్సినవి: ముంజెలు- నాలుగు, నన్నారి సిరప్‌- అరకప్పు, నిమ్మకాయ- ఒకటి, నానబెట్టిన సబ్జా గింజలు- రెండు చెంచాలు, ఐస్‌ముక్కలు- ఎనిమిది.

తయారీ: ముంజెల్ని శుభ్రం చేసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా మెదపాలి. దాంట్లో నిమ్మకాయ రసం, నన్నారి సిరప్‌, కొద్దిగా నీళ్లు, ఐస్‌ ముక్కలు, సబ్జా గింజలు వేసి కలుపుకోవాలి. ఓ గ్లాసులోకి ఈ పానీయం తీసుకొని దాంట్లో ఐస్‌ ముక్కలు వేసుకొని సర్వ్‌ చేసుకోవటమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని