ముంజలతో.. మజా మజా!

మండే ఎండల్లో ముంజలు తింటే ఆ మజాయే వేరు. నీటితో తొణికిసలాడుతూ... దాహం తీరుస్తూ... రుచిని అందిస్తూ... అబ్బో చెప్పడానికి మాటల్లేవు... వేసవిలో మాత్రమే లభ్యమయ్యే ఈ ఐస్‌ యాపిల్‌తో రకరకాల వంటకాలూ చేసేయొచ్చు. 

Published : 24 Apr 2022 00:56 IST

మండే ఎండల్లో ముంజలు తింటే ఆ మజాయే వేరు. నీటితో తొణికిసలాడుతూ... దాహం తీరుస్తూ... రుచిని అందిస్తూ... అబ్బో చెప్పడానికి మాటల్లేవు... వేసవిలో మాత్రమే లభ్యమయ్యే ఈ ఐస్‌ యాపిల్‌తో రకరకాల వంటకాలూ చేసేయొచ్చు. అవేంటో చూద్దామా మరి.

మిల్క్‌షేక్‌..

కావాల్సినవి: లేత ముంజలు- నాలుగు, కాచి, చల్లార్చిన పాలు- గ్లాసు, చక్కెర- పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, సబ్జా గింజలు- రెండు పెద్ద చెంచాలు, డ్రై ఫ్రూట్స్‌ తరుగు- చెంచా.

తయారీ: సబ్జా గింజలను అరగంట నీళ్లలో నానబెట్టాలి. ముంజలను కూడా చల్లని నీళ్లలో కాసేపు ఉంచి, శుభ్రంగా పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలి. దీంట్లో కాచి, చల్లార్చిన పాలను పోసి, చక్కెర, యాలకుల పొడి వేేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలో పోసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తర్వాత గ్లాసుల్లో పోసి, సబ్జా గింజలు వేసి కలపాలి. అలాగే డ్రైఫ్రూట్స్‌ తరుగుతో గార్నిష్‌ చేసుకుని చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.


సలాడ్‌..

కావాల్సినవి: చల్లని ముంజలు- నాలుగు (చిన్న ముక్కలుగా), పుచ్చకాయ ముక్కలు- ఒకటిన్నర కప్పు, బీట్‌రూట్‌ తరుగు- రెండు చెంచాలు, వేయించిన నల్ల నువ్వులు- ఒకటిన్నర చెంచా, పుదీనా ఆకులు- రెండు పెద్ద చెంచాలు.

డ్రెసింగ్‌ కోసం.. చెరకు రసం- కప్పు, మిరియాల పొడి- కొద్దిగా, చిల్లీ గింజలు- కొన్ని, నిమ్మరసం, నువ్వుల నూనె- చెంచా చొప్పున, నల్లుప్పు- రుచికి సరిపడా.

తయారీ: నిమ్మరసం తప్ప డ్రెస్సింగ్‌ కోసం ఉపయోగించే అన్ని పదార్థాలను కలిపి మూడో వంతు అయ్యేలా బాగా మరిగించాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి పక్కన పెట్టాలి. పెద్ద గిన్నెలో ముంజలు, పుచ్చకాయ ముక్కలు, సన్నగా తరిగిన బీట్‌రూట్‌, నల్ల నువ్వులు, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తయారు చేసి పెట్టుకున్న ద్రవం పోసి చక్కగా కలిపి చల్లచల్లగా అందించాలి. 


కూర..

కావాల్సినవి: కాస్త ముదురు ముంజలు- ఆరేడు, పచ్చికొబ్బరి తురుము- అర కప్పు, పల్లీలు, నూనె- రెండు పెద్ద చెంచాల చొప్పున; గసాలు- రెండు చెంచాలు, జీలకర్ర, మినప్పప్పు- చెంచా చొప్పున; ఆవాలు- అర చెంచా, పచ్చిమిర్చి- నాలుగు (నిలువుగా చీల్చాలి), ఉల్లిపాయ ముక్కలు- కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, పసుపు- పావు చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, టొమాటోలు- రెండు, కొత్తిమీర తురుము, కసూరీమేథీ- కొద్దిగా.

తయారీ: ముంజలను పొట్టుతీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. పల్లీలు, గసాలను కాస్త వేయించి, చల్లార్చి, పచ్చికొబ్బరి తురుముతో కలిపి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వేయాలి. అవి కాస్త చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద... ఇలా ఒకదాని తర్వాత మరొకటి వేస్తూ వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక టొమాటో ముక్కలు వేయాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ముంజలను చేర్చాలి. ఉప్పు, కారం వేసి మరికాసేపు ఉడికించాలి. కొబ్బరి, పల్లీల మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి. ఇష్టమైతే కసూరీ మేథీ వేసుకోవచ్చు. కాసిన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికిస్తే ముంజలు మెత్తబడతాయి. కూర నుంచి నూనె పైకి తేలే వరకూ ఉడికించాలి. కొత్తిమీర వేసుకుంటే చాలు.


బజ్జీ..

కావాల్సినవి: ముంజలు- నాలుగు, శనగపిండి- కప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా చొప్పున; ఉప్పు- తగినంత, వంటసోడా- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: ముంజలను పొట్టు తీసి శుభ్రం చేయాలి. ఆ తర్వాత పొడవాటి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, వంటసోడా, ధనియాల పొడి, జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ బజ్జీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి. అది బాగా కాగిన తర్వాత ముంజ ముక్కలను పిండిలో ముంచి బజ్జీల్లా చేసి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.


ఐస్‌క్రీమ్‌..

కావాల్సినవి: ముంజలు- నాలుగు, చిక్కటి పాలు- 200 ఎం.ఎల్‌., కార్న్‌ఫ్లోర్‌- చెంచా, పాల పొడి- పెద్ద చెంచా, చక్కెర- నాలుగు పెద్ద చెంచాలు, క్రీమ్‌- రెండు పెద్ద చెంచాలు.

తయారీ: అర కప్పు పాలను పక్కన పెట్టి మిగతా పాలను చిన్న మంటపై కాసేపు వేడి చేయాలి. మరుగుతున్న పాలలో చక్కెరను వేసి కలపాలి. అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్‌, పాల పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరిగే పాలలో వేసి చిన్న మంటపై మరికాసేపు మరిగించాలి. పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో నాలుగు గంటలు భద్రపరచాలి. ముంజలను చిన్న ముక్కలుగా కోసి గంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లో నుంచి పాలు, ముంజలను బయటకు తీసి పెద్ద గిన్నెలో పాలు పోసి ముంజలను వేసి... వీటిపై నుంచి క్రీమ్‌ వేయాలి. వీటిని బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని మరోసారి గాలి చొరబడని డబ్బాలో పెట్టి దాదాపు నాలుగు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత రోజ్‌ సిరప్‌తో ఎంచక్కా తినేస్తే సరి.


ఖీర్‌..

కావాల్సినవి: ముంజలు- మూడు, చిక్కటి పాలు- అర లీటరు, చక్కెర- నాలుగు పెద్ద చెంచాలు, కండెన్స్‌డ్‌ పాలు- అర కప్పు, కాజూ, కిస్‌మిస్‌, పిస్తా, టూటీఫ్రూటీ- రెండు పెద్ద చెంచాల చొప్పున; యాలకుల పొడి- పావు చెంచా, కుంకుమపువ్వు- కొద్దిగా, నెయ్యి- చెంచా.

తయారీ: పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి పాలు పోయాలి. ఇందులో కుంకుమపువ్వు వేయాలి. పాలు ఒక పొంగు వచ్చాక చిన్న మంటపై పది నిమిషాలు మరిగించాలి. ఈలోపు ముంజల పొట్టు తీసి రెండింటిని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒకదాన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. మరిగే పాలు రంగు మారి, కాస్త చిక్కబడ్డాక చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి పాల గిన్నెను పక్కన పెట్టి చల్లార్చాలి. పాలు పూర్తిగా చల్లగా అయ్యాక కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. మరోసారి పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక కిస్‌మిస్‌, కాజూలను వేర్వేరుగా వేయించాలి. ఫ్రిజ్‌లో నుంచి పాలను తీసి అందులో ముంజ ముక్కలు, తరుగు, డ్రై ఫ్రూట్స్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలపాలి. ఈ మిల్క్‌ వల్ల ఖీర్‌ రుచి మరింత పెరుగుతుంది. కావాలనుకుంటే పిస్తా తరుగునూ వేసుకోవచ్చు. యాలకుల పొడినీ వేయాలి. సర్వింగ్‌ బౌల్స్‌లోకి తీసుకుని టూటీ ఫ్రూటీలతో గార్నిష్‌ చేసుకుంటే సరి.  


ప్రయోజనాలు..

ముంజలు వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి మేనుకు చలువ చేస్తాయి. దాహార్తిని తీర్చడంతోపాటు తక్షణ శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
ఐస్‌ యాపిల్స్‌గా పిలిచే  వీటిలో సోడియం, పొటాషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను సమన్వయపరుస్తాయి. మండే ఎండల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడతాయి.
చాలా రకాల జీర్ణ సమస్యలకు చెక్‌ పెడతాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. కడుపులో మంట, అల్సర్లను అడ్డుకుంటాయి. గర్భిణుల్లో కనిపించే వాంతులు, వికారాన్ని తగ్గిస్తాయి.
వీటిలోని ఫైటో కెమికల్స్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలుగా పనిచేసి వృద్ధాప్య ఛాయలను త్వరగా రానీయకుండా చూడటంతోపాటు గుండె జబ్బుల వంటి సమస్యలకు చెక్‌ పెడతాయి.
ఈ కాలంలో ఇబ్బంది పెట్టే చర్మ సమస్యలైన చెమట కాయలు, దద్దుర్లపై వీటితో రాస్తే ఉపశమనం కలుగుతుంది.
వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలు, విషాలను బయటకు పంపి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పూర్తిగా నీరే ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి ఎంపిక. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని