ఆరోగ్యాన్ని వండేద్దాం!

చల్లగా చినుకులు పడుతుంటే వేడిగా తినాలనుంటుంది ఎవరికైనా.  కానీ ఆ తినేవేవో వ్యాధినిరోధక శక్తిని పెంచేవయితే మంచిది కదా! అల్లం, పసుపు, మిరియాలపొడి వంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. వాటితో చేసిన రుచికరమైన వంటకాలే ఇవన్నీ... అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. జింజరాల్‌ అనే రసాయనంవల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పూట నెయ్యితో కలిపి పచ్చిపసుపుని రంగరించి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమం కలుగుతుంది.

Updated : 10 Jul 2022 10:40 IST

చల్లగా చినుకులు పడుతుంటే వేడిగా తినాలనుంటుంది ఎవరికైనా.  కానీ ఆ తినేవేవో వ్యాధినిరోధక శక్తిని పెంచేవయితే మంచిది కదా! అల్లం, పసుపు, మిరియాలపొడి వంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. వాటితో చేసిన రుచికరమైన వంటకాలే ఇవన్నీ...

అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. జింజరాల్‌ అనే రసాయనంవల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 

ఉదయం పూట నెయ్యితో కలిపి పచ్చిపసుపుని రంగరించి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమం కలుగుతుంది.


గోల్డెన్‌ మిల్క్‌

కావాల్సినవి: పాలు- రెండున్నర కప్పులు, పచ్చిపసుపు కొమ్ము చిన్నది- ఒకటి, అల్లంముక్క -అంగుళంది, నెయ్యి- చెంచా, మిరియాలపొడి- చిటికెడు, తేనె- చెంచా, దాల్చినచెక్క పొడి- పావుచెంచా

తయారీ: స్టౌ వెలిగించి.. ఒక పాన్‌లో పాలు, దంచిన పసుపు, అల్లం, మిరియాలపొడి, నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. మరీ మరగాల్సిన అవసరం లేదు. బాగా వేడిక్కితే చాలు. దించి వడకట్టుకుని అందులో తేనె, దాల్చిన చెక్క పొడి చల్లితే గోల్డెన్‌మిల్క్‌ సిద్ధం. ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం ఇస్తుంది.


డ్రై ఫ్రూట్‌ లడ్డు కావాల్సినవి

కావాల్సినవి: చాక్లెట్‌ సిరప్‌-  20ఎమ్‌.ఎల్‌, పంచదారపొడి- 40గ్రా, బటర్‌- చెంచా, పిస్తా పలుకులు- 20గ్రా, బాదం పలుకులు- 20గ్రా, జీడిపప్పు పలుకులు- 20గ్రా, బేకింగ్‌సోడా- పావుచెంచా, నాన్‌స్టిక్‌పాన్‌, నీళ్లు- పెద్దచెంచా
తయారీ: పాన్‌ని వేడి చేసి అందులో ముందుగా కరిగించిన బటర్‌, తర్వాత పంచదార, నీళ్లు వేసి.. అవన్నీ బాగా కరిగి ముదురు గోధుమవర్ణంలోకి వచ్చేంతవరకూ గరిటెతో తిప్పుకోవాలి. ఇందులో డ్రైఫ్రూట్స్‌ పలుకులు, బేకింగ్‌సోడా, చాక్లెట్‌ సిరప్‌ కూడా వేసి కలుపుకోవాలి. అవన్నీ  కలిసిన తర్వాత... ఒక పాత్రలోకి తీసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి.


కాబూలీ చనా సలాడ్‌

కావాల్సినవి: కాబూలీ సెనగలు- కప్పు, చాట్‌మసాలా- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, పెరుగు- కప్పు, మసాలా కారప్పూస- పావుకప్పు, స్వీట్‌చట్నీ- అరకప్పు
తయారీ: సెనగలని రాత్రంతా నానబెట్టుకుని కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి. ఈ సెనగల్లో చాట్‌మసాలా, ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. చివరిగా స్వీట్‌చట్నీ, పైన కారప్పూస, కొద్దిగా పెరుగు వేసుకుంటే చనా సలాడ్‌ సిద్ధం. (చింతపండు, బెల్లం సమానంగా తీసుకుని కొద్దిగా జీలకర్ర చేర్చి ఉడికించుకుంటే స్వీట్‌చట్నీ సిద్ధమవుతుంది.)


అద్రక్‌ హల్వా

కావాల్సినవి: అల్లం పొడి లేదా తురుము- 200గ్రా, పొడిచేసి పెట్టుకున్న బెల్లం- రెండుకప్పులు, పంచదార- కప్పు, యాలకులపొడి- రెండు చెంచాలు, నెయ్యి- ఐదు చెంచాలు, పిస్తాపప్పులు- పది(పలుకుల్లా చేసుకోవాలి), గోధుమపిండి- రెండు కప్పులు, గింజలు తీసేసిన కర్జూరాలు- అరకప్పు, కొబ్బరి పొడి- రెండు కప్పులు
తయారీ: అడుగు మందంగా ఉండే నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని ఐదు కప్పుల నీళ్లు తీసుకుని మరిగించుకోవాలి. ఇందులో అల్లం పొడి, యాలకులపొడి, పంచదార వేసి ఉండకట్టకుండా గరిటెతో తిప్పుకోవాలి. ఈ మిశ్రమం మరిగి దగ్గరకొచ్చాక స్టౌ కట్టేయాలి. మరొక నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక కొబ్బరిపొడి, సిద్ధం చేసుకున్న అల్లం మిశ్రమం కూడా వేసి ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో పిస్తా పలుకులు, గోధుమ పిండి వేసుకుని మంచి వాసన వచ్చేంతవరకూ కలియతిప్పుకోవాలి. ఇప్పుడు కర్జూరం పలుకులు కూడా వేసి నెయ్యి వేరవుతున్నప్పుడు స్టౌ కట్టేయాలి. చివరిగా మరికొన్ని పిస్తా పలుకులు వేస్తే అద్రక్‌ హల్వా సిద్ధమయినట్టే.


మూంగ్‌దాల్‌ సూప్‌

కావాల్సినవి: నూనె- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు- చెంచా, సన్నగా తరిగిన అల్లం- అరచెంచా, పసుపు- పావుచెంచా, పెసరపప్పు- అరకప్పు, నీళ్లు-  రెండు కప్పులు, పచ్చిమిర్చి- నాలుగు, బటర్‌- చెంచా, జీలకర్ర- చెంచా, ఉప్పు- తగినంత, నిమ్మరసం- చెంచా, కొత్తిమీర- కొద్దిగా
తయారీ: పెసరపప్పుని కడిగి సిద్ధంగా పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టుకుని నూనె వేసి వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి పలుకులు కూడా వేసి వాటినీ దోరగా వేయించుకోవాలి. తర్వాత పసుపు, పెసరపప్పు, నీళ్లు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మూతపెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పలుకులు మిగిలిపోతే మాషర్‌తో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడొక కడాయి తీసుకుని అందులో బటర్‌ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసి చిటపటమన్నాక ఉడికించిన పప్పుని వేసి చివరిగా కొత్తమీర, నిమ్మరసం వేసుకుంటే వేడివేడి పెసరపప్పు సూప్‌ సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని