Updated : 06 Nov 2022 01:03 IST

రుచిలో మేటీ ఇమ్యూనిటీ

చలిగాలులు ఒంటిని చుట్టేస్తుంటే పొగలు కక్కే చాయ్‌ గొంతులో పడితే ఆ స్వర్గమే వేరు. అందుకే టీకి మరేదీ సా‘టి’రాదు. నిద్రలేవగానే ఓ టీ... టిఫిన్‌ తిన్నాక మరో టీ.. ఇలా ఒకటేంటి? గంట గంటకీ ఓ టీ తాగేస్తుంటారు. తేయాకుతో చేసిన టీని పదే పదే తాగే బదులు వ్యాధినిరోధక శక్తిని పెంచే వీటిని ప్రయత్నించి చూడండి..


ఉసిరి టీ

కావాల్సినవి: నీళ్లు- మూడు కప్పులు, ఎండు ఉసిరిపొడి- చెంచా, అల్లం చూర్ణం- పావు చెంచా, పుదీనా ఆకులు- గుప్పెడు

తయారీ: ఓ గిన్నెలోకి నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో ఉసిరిపొడి, అల్లం చూర్ణం వేసి మరిగించాలి. కాసేపయ్యాక శుభ్రంగా కడిగిపెట్టుకున్న పుదీనా ఆకుల్నీ చేర్చి మరిగించాలి. తర్వాత దీన్ని గ్లాసులోకి వడకట్టుకుంటే సరి.

ప్రయోజనం: ఆయుర్వేద శాస్త్రంలో సూపర్‌ ఫుడ్‌గా పిలిచే వాటిల్లో ఉసిరి కూడా ఒకటి. ఇందులో ఐరన్‌, విటమిన్‌ సి, కార్బొహైడ్రేట్‌లు, ఫాస్పరస్‌, ఫైబర్‌, క్యాల్షియం, ప్రొటీన్‌ వంటి ముఖ్యమైన పోషకాలెన్నో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలను నియంత్రించడమే కాకుండా శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.


కాశ్మీరీ కావా

కావాల్సినవి: కశ్మీరీ గ్రీన్‌ టీ - చెంచా, నీళ్లు- మూడు కప్పులు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, యాలకులు- ఐదారు, ఎండు గులాబీ రేకలు- చెంచా, బాదం పలుకులు- కొద్దిగా, కుంకుమపువ్వు- చిటికెడు

తయారీ: పాన్‌ వేడి చేసి యాలకులు నలిపి వేయాలి. అందులోనే నీళ్లు పోసి దాల్చిన చెక్క, కశ్మీరీ గ్రీన్‌ టీ ఆకులూ, ఎండు గులాబీ రేకలూ వేసి మరిగించాలి. చివరగా బాదం పలుకులూ, కుంకుమపువ్వు రేకలూ చేర్చి వేడి వేడిగా తాగితే..ఆ రుచి చెప్పనలవి కాదు.

ప్రయోజనం: శరీరానికి వెచ్చదనాన్ని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచే అద్భుతమైన టీ ఇది. ఇందులోని పోషకాలకు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఎక్కువ. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి జీవక్రియా రేటుని మెరుగుపరుస్తాయి. అలానే ఒత్తిడిని తగ్గించి, శరీరానికి చురుకుదనం పెంచుతాయి. బరువు అదుపులో ఉండాలన్నా, జలుబు తగ్గాలన్నా ఈ చాయ్‌ తాగాల్సిందే. ఈ టీ నుంచి వచ్చే ఘాటైన పరిమళం ఒత్తిడిని తగ్గించి మెదడుని తేలికపరుస్తుంది.


అల్లం గులాబీతో

కావాల్సినవి: ఎండు గులాబీ మొగ్గలు- ఓ ఆరేడు,  అల్లం- చిన్న ముక్క,  దాల్చిన చెక్క- చిన్న ముక్క, నీళ్లు- లీటరు, తులసి ఆకులు- గుప్పెడు, తేనె- చెంచా

తయారీ: గులాబీ మొగ్గలూ, అల్లం, దాల్చిన చెక్క, తులసి ఆకుల్ని నీళ్లల్లో వేసి సన్నటి మంట మీద ఓ పావుగంట మరిగించాలి. అవి మసులుతున్నప్పుడు దించి వడకట్టి తేనె కలిపి గోరువెచ్చగా తాగాలి.

ప్రయోజనం: ఈ అల్లం గులాబీ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి చురుకు పుట్టించే సుగుణాలూ ఎక్కువే. ఈ టీ నెలసరి నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్‌, ఎ, సీలు వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.


అశ్వగంధ టీ

కావాల్సినవి: అశ్వగంధ- మూడు ఇంచుల వేరు లేదా చూర్ణం(చెంచా), తులసి ఆకులు- గుప్పెడు, నీళ్లు- లీటరు, మిరియాలు-చెంచా, తేనె- చెంచా, నిమ్మకాయ- అరచెక్క,

తయారీ విధానం: నీళ్లను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో అశ్వగంధ చూర్ణం, తులసి ఆకులూ, మిరియాలూ వేసి  మరిగించాలి. ఆ నీళ్లు సగానికి అయ్యాక వడకట్టి మిరియాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి వేడివేడిగా తాగితే బాగుంటుంది.

ప్రయోజనం: అశ్వగంధ వేరులో ఉండే ఔషధ గుణాలు ఒత్తిడినీ, వాపుల్నీ తగ్గిస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్‌తో బాధపడేవారు రోజుకో చిన్న కప్పు టీని తాగినా మేలు. వ్యాధినిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది.


జామ ఆకుల టీ!

కావాల్సినవి:  నీళ్లు- అరలీటరు, జామ ఆకులు- ఆరు, మిరియాలపొడి- అరచెంచా, తేనె- చెంచా

తయారీ: ముందుగా జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీళ్లను గిన్నెలోకి తీసుకుని జామ ఆకులూ, మిరియాలు వేసి పొయ్యిమీద పెట్టి చిన్నమంట మీద మరిగించాలి. అవి మెత్తగా అయ్యాక ఆ నీళ్లను గ్లాసులోకి వడకట్టి తేనె కలిపి తాగితే మేలు.

ప్రయోజనం: జామ ఆకుల్లో యాంటీ ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ. దీన్ని టీగా తీసుకోవడం వల్ల నోరు, గొంతు శుభ్రపడతాయి. ఇందులో ఉండే విటమిన్‌ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.  జలుబూ, దగ్గూ వంటి సమస్యలు తగ్గుతాయి.అనారోగ్యాలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts