సలాం ఫాలూదా!

ఎండవేడి విసిగించే మాట నిజమే కానీ.. దాన్నుంచి సేదతీరడానికి బోలెడన్ని మార్గాలున్నాయి. వాటిల్లో ఒకటి చల్లచల్లని ఫాలూదా. ఇది రంగురంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తూ పిల్లలకీ పెద్దలకీ కూడా నచ్చేస్తుంది.

Published : 02 Jun 2024 00:56 IST

ఎండవేడి విసిగించే మాట నిజమే కానీ.. దాన్నుంచి సేదతీరడానికి బోలెడన్ని మార్గాలున్నాయి. వాటిల్లో ఒకటి చల్లచల్లని ఫాలూదా. ఇది రంగురంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తూ పిల్లలకీ పెద్దలకీ కూడా నచ్చేస్తుంది. ఇక రుచి గురించి చెప్పడానికి మాటలే చాలవు. ఆస్వాదించి, ఆనందించాల్సిందే!

మామిడితో.. 

కావలసినవి: మామిడిపండు ముక్కలు - పావు కప్పు, మామిడి గుజ్జు - అర కప్పు, రోజ్‌ సిరప్‌ - రెండు చెంచాలు, మ్యాంగో ఐస్‌క్రీమ్‌ - 2 స్కూప్‌లు, సబ్జా గింజలు - రెండు చెంచాలు, ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ - కప్పున్నర, ఫలూదా సేవ్‌ - అర కప్పు, పంచదార - రెండు చెంచాలు, జీడిపప్పు పలుకులు - టేబుల్‌ స్పూన్, టూటీ ఫ్రూటీ - 3 చెంచాలు

తయారీ: అర గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను నానబెట్టాలి. కప్పు నీళ్లను మరిగించి.. ఫలూదా సేవ్‌ వేసి, దించేయాలి. పొడవాటి గాజుగ్లాసులో నానబెట్టిన సబ్జాగింజలు, వాటి మీద ఫలూదా సేవ్, మామిడిపండు ముక్కలు వేయాలి. దాని మీద రోజ్‌ సిరప్, తర్వాత మామిడి గుజ్జు, ఆపైన చల్లటి పాలు, మ్యాంగో ఐస్‌క్రీమ్‌ ఒక్కొక్కటిగా వేయాలి. చివరిగా జీడిపప్పు పలుకులు, టూటీ ఫ్రూటీలు చల్లాలి. ఒక దానిమీద ఒకటి పేర్చినట్లు వేయడంతో రంగురంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఐస్‌క్రీమ్‌ కరగకముందే ఆస్వాదించండి. ఈ కొలతల ప్రకారం మనకు అవసరమైనంత పరిమాణంలో చేసుకోవచ్చు.


బాదం పిస్తాలతో..

కావలసినవి: పాలు - ఒకటిన్నర కప్పులు, పంచదార, వెర్మిసెల్లి - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, సబ్జా గింజలు - 2 చెంచాలు, పిస్తా, బాదంగింజలు - 12 చొప్పున, యాలకుల పొడి - పావు చెంచా, ఐస్‌ క్రీమ్‌ - 2 స్కూప్‌లు

తయారీ: వెర్మిసెల్లి ఉడికించి, దించేసి నీళ్లు తీసేయాలి. సబ్జా గింజలను నానబెట్టాలి. పిస్తా, బాదంపప్పులను కాస్త బరకగా ఉండేలా దంచాలి. పాలను ఐదు నిమిషాలు మరిగించాలి. అందులో పంచదార, దంచిన పిస్తా, బాదం పప్పులు, యాలకుల పొడి వేసి సన్న సెగ మీద ఇంకో ఐదు నిమిషాలుంచాలి. దించేసి, చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. గంట తర్వాత బయటకు తీసి.. వెర్మిసెల్లి, సబ్జా గింజలు, ఐస్‌క్రీమ్‌ జోడిస్తే సరి.. ‘బాదం పిస్తా ఫాలూదా’ వహ్వా అనిపిస్తుంది.


రోజ్‌మలై

కావలసినవి: పాలు - ఒకటిన్నర లీటర్, కండెన్స్‌డ్‌ పాలు - అర కప్పు, యాలకులు - ఏడు, రోజ్‌ సిరప్‌ - ముప్పావు కప్పు + పావు చెంచా, కుంకుమ పువ్వు - పావు చెంచా, వెర్మిసెల్లి - అర కప్పు, బాదం, పిస్తా పలుకులు - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఎండు గులాబీరేకలు - టేబుల్‌ స్పూన్, జీడిపప్పు పలుకులు - 3 చెంచాలు, సబ్జా గింజలు - అర కప్పు, మిల్క్‌ పౌడర్‌ - కప్పు, మైదాపిండి - టేబుల్‌ స్పూన్, బేకింగ్‌ పౌడర్‌ - చెంచా, యాలకుల పొడి - పావు చెంచా, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఫుడ్‌ కలర్‌ - పావు చెంచా 

తయారీ: సబ్జా గింజలను నానబెట్టాలి. రెండు రకాల పాలనూ కలిపేసి.. యాలకులు, రోజ్‌ సిరప్‌ వేసి మరిగించాలి. తర్వాత యాలకులను తీసేసి.. వెర్మిసెల్లి, బాదం, పిస్తా పలుకులు, ఎండు గులాబీరేకలు, కుంకుమ పువ్వు, నానిన సబ్జా గింజలు వేసి, కలియ తిప్పి.. సన్న సెగ మీద ఉంచాలి. ఒక పాత్రలో మిల్క్‌ పౌడర్, మైదాపిండి, బేకింగ్‌ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి, పావు చెంచా రోజ్‌ సిరప్, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. దాంతో పేడాలు చేసి.. వెర్మిసెల్లి పాలలో వేసి ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత వాటిని తిరగేయాలి. ఇంకో మూడు నిమిషాల తర్వాత దించేయాలి. చల్లారేసరికి పేడాలు పాలను పీల్చుకుని రెట్టింపు పరిమాణంలో కనిపిస్తాయి. అందులో జీడిపప్పు పలుకులు వేసి, గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. నోరూరించే ‘రోజ్‌మలై ఫాలూదా’ సిద్ధమైపోతుంది.


ఆరెంజ్‌ స్ట్రాబెర్రీలతో.. 

కావలసినవి: కమలా తొనలు - కప్పు, స్ట్రాబెర్రీస్‌ - 200 గ్రాములు, పంచదార - 3 టేబుల్‌స్పూన్లు, సబ్జాగింజలు - 4 చెంచాలు, సేమ్యా - అర కప్పు, ఆరెంజ్‌ ఫ్లేవర్‌ జిలెటిన్‌ పౌడర్‌ - 85 గ్రాములు, పాలు - 3 కప్పులు, వెనీలా ఐస్‌క్రీమ్‌ - 4 చెంచాలు, పుదీనా ఆకులు - గార్నిష్‌ చేసేందుకు, వేడినీళ్లు - కప్పు, చల్లటి నీళ్లు - అర కప్పు, ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని

తయారీ: కమలా తొనలను విడదీసి మెత్తగా చేయాలి. వేడినీళ్లలో ఆరెంజ్‌ ఫ్లేవర్‌ జిలెటిన్‌ పౌడర్‌ వేసి కలపాలి. సాస్‌పాన్‌లో స్ట్రాబెర్రీస్, పంచదార వేసి ఉడికించి సిరప్‌ తయారుచేయాలి. చల్లారనిచ్చి జార్‌లోకి తీయాలి. సబ్జాగింజలను నీళ్లలో వేసి పావుగంట నానబెట్టాలి. సేమ్యాలో కప్పు పాలు, టేబుల్‌స్పూన్‌ పంచదార వేసి ఉడికించాలి. మెత్తగా అయ్యాక దించేయాలి. పొడవాటి గాజుగ్లాసులో అడుగున సబ్జాగింజలు, వాటి మీద కమలా తొనల జెల్లీ, తర్వాత రెండు టేబుల్‌ స్పూన్ల వెర్మిసెల్లీ, ఆపైన 2 టేబుల్‌ స్పూన్ల స్ట్రాబెర్రీ సిరప్‌ వేయాలి. వాటి మీద కింది పొరలు కదలకుండా అర కప్పు చల్లటి పాలు మెల్లగా పోయాలి. పాల మీద జాగ్రత్తగా ఐస్‌క్రీమ్‌ను వేయాలి. పైన మళ్లీ కమలా తొనల పల్ప్, మిగిలిన స్ట్రాబెర్రీ సిరప్‌ వేసి.. పుదీనా ఆకులు, ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్‌ వేస్తే సరి.


చాక్లెట్‌తో..

కావలసినవి: కాచి చల్లార్చిన పాలు - అర లీటర్, కార్న్‌ఫ్లేక్స్, జీడిపప్పు, పంచదార, టూటీ ఫ్రూటీ, చాక్లెట్‌ పౌడర్‌ - 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఫాలూదా సేవ్‌ - అర కప్పు, సబ్జా గింజలు - టేబుల్‌ స్పూన్, నచ్చిన పండ్ల ముక్కలు - చారెడు 

తయారీ: సబ్జా గింజలను నానబెట్టాలి. ఫాలూదా సేవ్‌ను ఉడికించి, నీళ్లు తీసేసి.. చల్లారనివ్వాలి. పాలలో పంచదార, చాక్లెట్‌ పౌడర్‌ వేసి కలపాలి. నాలుగు గ్లాసుల్లో ఫాలూదా సేవ్‌ సమంగా వేయాలి. దాని మీద నానిన సబ్జా గింజలు, వాటి మీద కార్న్‌ ఫ్లేక్స్, ఆపైన జీడిపప్పు, పండ్ల ముక్కలు, టూటీ ఫ్రూటీ ఒక్కొక్కటిగా వేసి.. చాక్లెట్, పంచదార కలిసిన పాలు పోయాలి. అంతే నోరూరించే ‘చాక్లెట్‌ ఫాలూదా’ రెడీ. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని