పిజ్జా ఇంట్లో చేసుకోవచ్చా?

పిల్లలకు పిజ్జా అంటే చాలా ఇష్టం. దీన్ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారుచేసుకోవాలో చెబుతారా? - భవ్య, హైదరాబాద్‌....

Published : 05 Sep 2021 02:23 IST

పిల్లలకు పిజ్జా అంటే చాలా ఇష్టం. దీన్ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారుచేసుకోవాలో చెబుతారా?

- భవ్య, హైదరాబాద్‌

పిజ్జా బేస్‌ బజారులో దొరుకుతుంది. దీంట్లో నార్మల్‌, మినీసైజ్‌ల్లో పిజ్జా బేస్‌లుంటాయి. ఎక్కువ వెరైటీస్‌ ఒకేసారి చేసుకోవాలనేటప్పుడు, మినీ పిజ్జా బేస్‌ వాడుకోవవచ్చు.

పిజ్జా ఇంట్లో చేసుకోవడానికి ఓటీజీ (అవెన్‌, టోస్టర్‌, గ్రిల్‌) అవెన్‌ కావాలి. సాస్‌ తయారుచేసుకోవడమూ చాలా ముఖ్యం. ఇందుకోసం అరకిలో టొమాటోలు, ఒకటిన్నర చెంచా నూనె, చెంచా వెల్లుల్లి తరుగు, పావు చెంచా చొప్పున రెడ్‌ చిల్లీఫ్లేక్స్‌, ఉప్పు; చెంచా చొప్పన చక్కెర, అరెగానో లేదా రోజ్‌మెరీ హెర్బ్స్‌; అర చెంచా మిరియాల పొడి అవసరమవుతాయి.

టొమాటోలను మిక్సీజార్‌లో వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక తరిగిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చేటప్పుడు రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌ వేసి వేయించాలి. ఇందులోనే టొమాటో ప్యూరీని జత చేయాలి. ఉప్పు, చక్కెర కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. మూతపెట్టి సన్నని మంటపై మెత్తగా దగ్గరకు వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు హెర్బ్స్‌, మిరియాల పొడిని చేర్చాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. గ్రేవీ చిక్కగా అవడం చాలా ముఖ్యం. పలుచగా ఉంటే బేస్‌ నానిపోయి రుచి పోతుంది. చల్లారిన తర్వాత దీన్ని ఓ జార్‌లోకి తీసుకుని నిల్వ చేసుకుని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు.

టాపింగ్‌ చేసుకోవడమిలా...
పిజ్జా బేస్‌పైన పిజ్జా సాస్‌ను సమానంగా వేయాలి. దీనిపైన కాయగూరల ముక్కలను ఓ పొరలా వేసుకోవాలి. ఆపైన హెర్బ్స్‌తో కలిపి చీజ్‌ లేయర్‌ను కూడా వేసి 150 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద 8-10 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. వెజిటబుల్‌ పిజ్జాలో టాపింగ్‌ కోసం క్యాప్సికమ్‌, టొమాటో, పుట్టగొడుగులు, గ్రీన్‌ ఆలివ్స్‌, రెడ్‌ ఆనియన్‌, వెల్లుల్లి, చెర్రీ టొమాటో ముక్కలను వాడుకోవచ్చు. చీజ్‌ ఆప్షన్స్‌... పిజ్జాకి రుచి చాలావరకు చీజ్‌ వల్లే వస్తుంది. సాధారణంగా మోజరెల్లా,  గోట్‌, పర్‌మేసన్‌ రకాలను వాడతారు. వీటితోపాటు పాలకూర, తులసి ఆకులు,  పార్స్‌లీలనూ వాడుకోవచ్చు. డ్రై అరెగానో, మిరియాలు, వెల్లుల్లి పొడి... పిజ్జాకు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి.

చికెన్‌, మటన్‌, గుడ్డు... వీటిని కూడా టాపింగ్‌లో వాడుకోవచ్చు. ఇటాలియన్‌ సీజనింగ్‌ను ఎక్కువగా వాడుతుంటారు. రోజ్‌మెరీ రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌ మంచి రుచినిస్తాయి. పిజ్జా తయారీలో ఆలివ్‌ ఆయిల్‌ చాలా ముఖ్యమైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని