పనసపిండి... అనాస పిండి!

పండ్లతో పిండి ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఇది నిజమే. బేకింగ్‌ చేయాలన్నా, కొన్ని రకాల పిండి వంటలు చేయాలన్నా... మనకి మైదా ఠక్కున గుర్తొస్తుంది.

Published : 16 Oct 2022 00:19 IST

నెలవారీ పచారీ సరకులు రాసేటప్పుడు సాధారణంగా మన జాబితాలో బియ్యప్పిండి, గోధుమపిండి, సెనగపిండి... ఇవి ఉంటాయి కదా! ఇక నుంచి వీటితోపాటు... అనాసపిండి, స్ట్రాబెర్రీ పిండి, పనసపిండి వంటి పండ్ల పిండ్లు కూడా తోడుకావొచ్చు...

పండ్లతో పిండి ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఇది నిజమే. బేకింగ్‌ చేయాలన్నా, కొన్ని రకాల పిండి వంటలు చేయాలన్నా... మనకి మైదా ఠక్కున గుర్తొస్తుంది. కానీ ఈ మైదాలో పీచు ఉండదు. పైగా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దాంతో ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని తేలిపోయింది. దాని మోతాదుని తగ్గించుకొనేందుకు, ప్రత్యామ్నాయంగా మార్కెట్లో మనకి పండ్లతో తయారుచేసిన పనసపిండి, అరటిపిండి వంటి పండ్ల పొడులు దొరుకుతున్నాయి. వీటిని గోధుమపిండివంటి వాటితో కలిపి వాడటం వల్ల అదనపు పోషకాలూ అందుతాయి. రుచీ పెరుగుతుంది.


పసనపిండి: దీనిని చపాతీ పిండిలోకి, కూరల్లోకి, సూపుల్లోకి వేసుకోవచ్చు. పీచుతో పాటు ప్రొటీన్‌ని సమృద్ధిగా అందిస్తుంది. రుచి కూడా పెరుగుతుంది.


నేరేడు పిండి: సీజన్‌లో తప్ప మళ్లీ కనిపించని ఈ పండు పిండి రూపంలో రావడం మన అదృష్టమే. యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే ఈ పిండిని స్మూథీల్లో వాడుకోవచ్చు. దీనికుండే చక్కని రంగు కావాలనుకుంటే స్వీట్లలో కూడా వాడుకోవచ్చు.


ఖర్జూరం: వంటల్లో పంచదార వాడకుండా ప్రత్యామ్నాయంగా ఈ పిండిని వాడుకోవచ్చు. స్వీట్ల తయారీలో, బేకింగ్‌లో వాడతారు.


అనాసపిండి: కేకులు, పుడ్డింగులు, మిఠాయిల తయారీలో ఈ పిండిని వాడుకోవచ్చు. అద్భుతమైన రుచి... మనసు దోచే పరిమళం రెండూ వంటకాలకి తోడవుతాయి.


దానిమ్మ: కూరలకి పుల్లటి రుచి కావాలనుకున్నప్పుడు, చాట్‌మసాలాకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. బేకింగ్‌, సూపులకు మంచి రుచి ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆరెంజ్‌, స్టాబెర్రీ మామిడి పొడులను కూడా బేకింగ్‌లో  రుచి కోసం వాడుతుంటారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని