నేపాలీ ప్రత్యేకం..నోరూరించే సెల్‌రోటీలు!

పండగొస్తే మనం బూరెలు, పులిహోర ఎలా వండుకుంటామో.. అలా నేపాలీలు పండగొస్తే సెల్‌రోటీ వంటకాన్ని ఇష్టంగా చేసుకుంటారు.

Published : 25 Dec 2022 01:03 IST

పండగొస్తే మనం బూరెలు, పులిహోర ఎలా వండుకుంటామో.. అలా నేపాలీలు పండగొస్తే సెల్‌రోటీ వంటకాన్ని ఇష్టంగా చేసుకుంటారు. అది వాళ్ల జాతీయ వంటకం. నేపాల్‌ నుంచి మనదేశానికి వ్యాపించి ఇక్కడా సందడి చేస్తున్న ఆ వంటకం గురించిన కొన్ని విశేషాలు...

పొరుగింటి పుల్లకూర!

సెల్‌రోటీ అంటే మనం టెన్నిస్‌ ఆడే రింగ్‌లా ఉంటుంది. బియ్యప్పిండితో చేసే తీపి వంటకం ఇది. నేపాలీలు మొదట్లో దీపావళినాడు మాత్రమే దీన్ని  వండు కొనేవారట. ప్రస్తుతం ప్రతి శుభకార్యంలోనూ ఈ వంటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైతే మనం తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా అక్కడ ఈ సెల్‌రోటీలని బుట్టలతో ఇచ్చిపుచ్చుకుంటారు. పెళ్లైన అమ్మాయి పుట్టింటినుంచి వస్తూవస్తూ వెదురుబుట్ట నిండా ఈ తీపిరొట్టెలని సారెగా తెస్తుంది. నేపాల్లో పర్వతసానువుల్లో పండే సెల్‌రకం బియ్యంతో చేసేవారు కాబట్టి దీనికి సెల్‌రోటీ అనే పేరు వచ్చిందట. ఈవంటకం తయారీలో చేయి తిరిగిన గృహిణులు దీనిని ఒట్టి చేతులతోనే తయారుచేస్తారు. రానివాళ్లు మాత్రం ప్రత్యేకమైన పరికరాలతో ఈ రింగులని తయారుచేస్తారు. నేపాల్‌ ప్రభావం ఉండే సిక్కిమ్‌, డార్జిలింగ్‌లలోనూ దీనిని ప్రధాన పిండి వంటకంగా చేసుకుంటారు. దమ్‌ఆలూ, ఆలూఆచార్‌, వెలుల్లి పచ్చడి కాంబినేషన్‌తో కలిపి తింటారు. కొబ్బరి, దాల్చినచెక్క, పంచదార, బెల్ల..  ఇలా వాడే పదార్థాల్ని బట్టి వందకుపైగా సెల్‌రోటీలని తయారుచేస్తారు. మొదట్లో నేపాల్‌, సిక్కింలకే పరిమితమైన ఈ వంటకం యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ల పుణ్యమాని అందరికీ తెలిసింది. దాంతో ఈ సెల్‌రోటీని సులభంగా చేసేందుకు వీలుగా పరికరాలని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. చేసుకోవడం సులభం కాబట్టి ఈ వంటకానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని