ధనుర్మువ్వలు! ఇప్పుడు తినకపోతే... మళ్లీ ఏడాదికే!

ధనుర్మువ్వ లేదా మువ్వచెక్కీ... అసలు సిసలు సంక్రాంతి వంటకం ఇది. ఈ ధనుర్మాసం మొదలుకుని ఎండలు ముదిరే వరకూ ఉత్తరాంధ్ర, ఉత్కళ ప్రాంతాల్లో ఏ దుకాణంలో అయినా లభించే ఈ మిఠాయికి భలే గిరాకీ.

Updated : 15 Jan 2023 09:02 IST

రూ. 50కోట్ల వ్యాపారం!

ధనుర్మువ్వ లేదా మువ్వచెక్కీ... అసలు సిసలు సంక్రాంతి వంటకం ఇది. ఈ ధనుర్మాసం మొదలుకుని ఎండలు ముదిరే వరకూ ఉత్తరాంధ్ర, ఉత్కళ ప్రాంతాల్లో ఏ దుకాణంలో అయినా లభించే ఈ మిఠాయికి భలే గిరాకీ. శీతాకాలపు మిఠాయిగా కూడా ఈ వంటకాన్ని పిలుస్తారు. ఒడిశా ప్రాంతంలో ఈ సంక్రాంతి సమయంలో ధనుయాత్ర అని చేస్తారు. ఈ వేడుకప్పుడు వేయించిన పేలాలు, బెల్లం, కొబ్బరి, జీడిపప్పు, యాలకులు వేసి ఈ వంటకాన్ని చేస్తుంటారు.

‘ఒడిశాలో ‘ధనుమువాన్‌’ అని పిలిచే ఈ వంటకం తెలుగులో ధనుర్మువ్వలుగా మారింది.. పంటలు చేతికొచ్చే సమయంలో బలవర్థకమైన పోషకాహారంతో చేసిన వంటకం ఇది. ఇప్పుడు వీటిని తింటే ఏడాదిపొడవునా వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి కావాల్సిన పోషకాలని ఈ వంటకం అందిస్తుందని మన పూర్వీకులు నమ్మేవారు. అందుకే ధనుయాత్రలో ఇది ప్రత్యేకం అంటారు చెఫ్‌ అజయ్‌ సాహో.

హృదయాకారంలో...

హృదయాకారంలో అందంగా కనిపించే ఈ మువ్వచెక్కీలను శ్రీకాకుళం ప్రాంత వాసులు బంధుమిత్రులకు, వియ్యాల వారికి వీటిని అందించి మైత్రిని పదిలపరచుకుంటారు. ఈ మిఠాయిని ‘గుడియా’ సామాజికవర్గం వారు ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఒకప్పుడు వీటిని తయారు చేసే సంస్థలు ఒడిశా, బ్రహ్మపురకే పరిమితం కాగా, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లోనూ రూపుదిద్దుకుంటున్నాయి. మార్చిలోగా సుమారు రూ.50కోట్ల వ్యాపారం జరుగుతుందంటే, వీటికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. వీటి తయారీలో మొదట కొత్తధాన్యం వేయించి, పేలాలు తయారుచేస్తారు. అనంతరం పంచదార పాకంలో పేలాలు వేసి వివిధ ఆకృతుల్లో చెక్కీలుగా మారుస్తారు. వాటికి కొబ్బరి, కిస్‌మిస్‌, జీడిపప్పు, ఖర్జూరాలను చక్కగా సృజనాత్మకత మేళవించి అతికించి ప్యాకింగ్‌ చేస్తారు. నేతితో పాటు, రుచికోసం సుగంధద్రవ్యాలను వేసిన వీటిని కిలో రూ.500 వరకూ అమ్ముతారు. సాధారణ రకాలయితే రూ.140-180కు విక్రయిస్తామని తయారీదారులు చెబుతున్నారు.

ఎస్‌.ఎన్‌.జి. కృష్ణమాచార్యులు, ఇచ్ఛాపురం, న్యూస్‌టుడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని