గమ్మత్తైన ఇమ్మర్తి

గోదావరి జిల్లాల పేరు చెబితే నోరూరించే కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు గుర్తుకు వస్తాయి. రుచిలో వాటితో పోటిపడే మరో తీపి వంటకం కూడా ఉందండోయ్‌! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలపించే ఈ వంటకం పేరు ఇమ్మర్తి.

Published : 19 Feb 2023 00:11 IST

నోరూరించే పెదపూడి తీపి వంటకం

గోదావరి జిల్లాల పేరు చెబితే నోరూరించే కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు గుర్తుకు వస్తాయి. రుచిలో వాటితో పోటిపడే మరో తీపి వంటకం కూడా ఉందండోయ్‌! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలపించే ఈ వంటకం పేరు ఇమ్మర్తి.. అదేంటా  అని ఆలోచిస్తున్నారా..? స్థానికంగా ‘ఇమ్మిత్తి’ అంటారు.

కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన నల్లమిల్లి చెల్లాయమ్మ వీటి తయారీలో ప్రత్యేకతను సాధించారు. వివాహ, శుభకార్యాలకు ఇక్కడి వారు వీటిని ప్రత్యేకంగా తయారు చేయించి బంధువులకు ఇస్తుంటారు. విదేశాలకు సైతం పంపిస్తుంటారు. ఇవి చూడ్డానికి జాంగ్రీల్లా ఉన్నా రుచి, తయారీ విధానం ప్రత్యేకంగా ఉంటాయి.

నాన్నమ్మ నేర్పిన వంట..

చెల్లాయమ్మ నానమ్మ ఈ వంటకాన్ని చేసేవారు. అద్భుతమైన రుచితో ఉండే ఇమ్మిత్తి తయారీకి ఆ గ్రామంలో ఆమె పెట్టింది పేరు. వీటిని అమ్మగా వచ్చిన సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఆమె వారసత్వాన్నే ప్రస్తుతం చెల్లాయమ్మ కొనసాగిస్తున్నారు. ‘18 ఏళ్లుగా ఈ వంటకాన్ని తయారు చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నా. పండుగలు, శుభకార్యాల సీజన్‌లో సుమారు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా.’ అని ఆమె ఆనందంగా చెబుతున్నారు. ఆరోగ్యానికి హాని కలుగచేసే ఎలాంటి కృత్రిమ రంగులు వాడకపోవడం ఈ వంటకం ప్రత్యేకత.

తయారీ విధానం.. మినపప్పు, పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిలేబీ, జాంగ్రీ తరహాలో సన్న మంట సెగపై నూనెలో ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత పంచదార పాకంలో నానబెట్టాలి. దీనికి కొద్దిగా నెయ్యి చేరిస్తే రుచి మరింత పెరుగుతుంది. చల్లారిన తర్వాత ఓ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు పాడవకుండా ఉంటాయి. ఒక కిలో పిండితో మూడు కిలోల స్వీటు వస్తుంది.

ఎ.శ్రీనివాస్‌, పెదపూడి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు