ఉసిరి... కొసరి కొసరి!

బాణలిలో మెంతులు వేయించి చల్లారాక ఆవాలు కూడా వేసి పొడి చేసి తీయాలి. ఇప్పుడు అందులోనే ఉసిరి ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి రుబ్బాలి...

Published : 26 Jun 2021 15:59 IST

ఆమ్లా రైస్‌

కావలసినవి
ఉసిరికాయ ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఆవాలు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, సెనగపప్పు: 2 టీస్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లు, పల్లీలు: 3 టేబుల్‌స్పూన్లు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, అల్లంతురుము: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: రెండు, పసుపు: అరటీస్పూను, ఆవాలు: అరటీస్పూను, మెంతులు: చిటికెడు, ఉడికించిన అన్నం: 3 కప్పులు
తయారుచేసే విధానం
* పలుకుగా వండిన అన్నాన్ని పక్కన ఉంచాలి.
* బాణలిలో మెంతులు వేయించి చల్లారాక ఆవాలు కూడా వేసి పొడి చేసి తీయాలి. ఇప్పుడు అందులోనే ఉసిరి ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేగనివ్వాలి. తరవాత కరివేపాకు, అల్లంతురుము వేసి మంచి వాసన వచ్చేవరకూ వేగాక రుబ్బిన ఉసిరి ముద్ద వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. తరవాత ఆవపొడి కూడా వేసి కలిపి ఉడికించిన అన్నం వేసి బాగా కలిపితే సరి.


ఉసిరికాయ రైతా

కావలసినవి
ఉసిరికాయలు: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, కొబ్బరితురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, పెరుగు: కప్పు, తాలింపుకోసం: ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం
* పెరుగుని బాగా గిలకొట్టి పక్కన ఉంచాలి. ఉసిరికాయల్ని సన్నగా తురమాలి.
* పచ్చిమిర్చి, కొబ్బరితురుము మిక్సీలో వేసి కాసిని నీళ్లు చిలకరించి మెత్తగా రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, ఆవాలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి గిలకొట్టిన పెరుగు, ఉప్పు, తురిమిన ఉసిరికాయలు, పచ్చిమిర్చిముద్ద వేసి కలిపి మూతపెట్టి ఓ పది నిమిషాల తరవాత వడ్డించాలి.


ఉసిరికాయ పచ్చడి

కావలసినవి
ఉసిరికాయ ముక్కలు: కప్పు, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: ఆరు, జీలకర్ర: టీస్పూను, మినప్పప్పు: టీస్పూను, ఆవాలు: అర టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, నూనె: టేబుల్‌స్పూను, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
* ముందుగా నువ్వుల్ని వేయించి చల్లారనివ్వాలి. తరవాత టీస్పూను నూనె వేసి ఎండుమిర్చి, అరటీస్పూను జీలకర్ర వేసి వేయించి తీయాలి. తరవాత అందులోనే ఉసిరి ముక్కలు కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి చల్లారనివ్వాలి.
* ఇప్పుడు మిక్సీలో నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి పొడి చేయాలి.
* తరవాత చల్లారిన ఉసిరి ముక్కలు కూడా వేసి రుబ్బాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసి పచ్చడిలో కలిపితే సరి.


ఉసిరికాయ వేపుడు

కావలసినవి
ఉసిరికాయలు: పావుకిలో, పచ్చిమిర్చి: 100 గ్రా., జీలకర్ర: టీస్పూను, వాము: టీస్పూను, పసుపు: అరటీస్పూను, మెంతులు: ఒకటిన్నర టీస్పూన్లు, దనియాలపొడి: టీస్పూను, కారం: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: రెండున్నర టేబుల్‌స్పూన్లు, ఇంగువ: చిటికెడు
తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, జీలకర్ర, వాము వేసి వేయించాలి. తరవాత పసుపు, దనియాలపొడి, మెంతుల పొడి వేసి వేగనివ్వాలి. మిశ్రమాన్ని ఓ నిమిషం వేయించాక ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. తరవాత మూతపెట్టి ముక్క మెత్తబడే వరకూ ఉడికించి దించి, చల్లారాక ఓ పింగాణీ గిన్నె లేదా జాడీలో పెట్టుకుంటే రెండు వారాల వరకూ
నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో వేసుకుని తింటే జీర్ణశక్తి బాగుంటుంది.


ఉసిరి తీపి చట్నీ

కావలసినవి
ఉసిరికాయలు: పావుకిలో, బెల్లం: 200గ్రా., యాలకులపొడి: పావుటీస్పూను, కారం: పావుటీస్పూను, ఉప్పు: టీస్పూను, సైంధవ లవణం: టీస్పూను, మిరియాలపొడి: అరటీస్పూను
తయారుచేసే విధానం
* ఉసిరికాయల్ని ఆవిరిమీద ఉడికించి గింజలు తీసేసి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో రుబ్బిన ఉసిరి ముద్ద, ఉప్పు, కారం, సైంధవ లవణం, మిరియాలపొడి, యాలకులపొడి, బెల్లం తురుము అన్నీ వేసి మూతపెట్టి మీడియం మంటమీద మధ్యమధ్యలో కలుపుతూ సుమారు పావుగంటసేపు ఉడికించి దించితే పుల్లని తియ్యని చట్నీ రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని