పచ్చళ్లు పదిరోజులు నిల్వ ఉండాలంటే!

ఇంట్లో చేసుకునే పచ్చళ్లు వారం, పది రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెబుతారా..?

Published : 06 Feb 2022 00:32 IST

ప్రశ్న-సమాధానం

* ఇంట్లో చేసుకునే పచ్చళ్లు వారం, పది రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెబుతారా..?

- లత, హైదరాబాద్‌

ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్లు తేలికగా వారం నుంచి పది రోజులు నిల్వ చేసుకోవచ్చు. దానికోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చళ్లను గాజు సీసాల్లో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. మూత సరిగ్గా ఉన్నది చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్లాస్టిక్‌ సీసాలు, స్టీలు డబ్బాలు సాధ్యమైనంత వరకు వాడొద్దు.
పచ్చడిని నిల్వ చేసే సీసాని ముందుగా చక్కగా శుభ్రం చేయాలి. వేడినీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత తుడిచి మూత పెట్టేయాలి. సీసాలో పచ్చడి వేశాక మూత గట్టిగా పెట్టాలి. (ఫుడ్‌గ్రేడ్‌ వాక్యూమ్‌ ప్యాక్‌ బ్యాగులో కూడా నిల్వ చేసుకోవచ్చు.)అలా కాకుండా తెరిచి పెడితే బూజు పడుతుంది. అలాగే వేడి పచ్చడిని సీసాలో వేసేయొద్దు. చల్లారాక నింపితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సీసాలో పచ్చడి పూర్తిగా పై వరకు నింపొద్దు. కనీసం అంగుళం వరకు ఖాళీగా వదిలేయాలి. మూత కూడా ఏ మాత్రం తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి.
పచ్చడి పైన ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వరకు నూనె ఉండేలా చూసుకోవాలి. పచ్చడిలో ఉప్పుతోపాటు ఆవ పిండి కలపడం వల్ల కూడా  ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. వెడల్పాటి గిన్నెలో నీళ్లు మరిగించి అందులో పచ్చడి సీసాని కాసేపుంచి, ఆ తర్వాత తడి తుడిచి పక్కకు పెట్టుకోవాలి. పూర్తిగా పచ్చి కూరగాయలతో చేసే పచ్చళ్లను ఐస్‌ ట్రేకి బటర్‌ లేదా కొద్దిగా నూనె రాసి అందులో వేసి ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మూడు నాలుగు క్యూబ్స్‌ తీసి కరిగించి వాడుకోవచ్చు. తియ్యటి పచ్చళ్లకు పంచదార పాకం లేదా బెల్లం పాకాన్ని పచ్చళ్లపై పోయడం వల్ల వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఉడికించిన, వేయించిన పచ్చళ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే సీసాలో పచ్చడి నింపాక పైన మూడు, నాలుగు చెంచాల కాచిన ఆవనూనె పోస్తే మంచిది.

- శ్రీదేవి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణురాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని