రండి... పొడిచేద్దాం!

టొమాటో, వెల్లుల్లి, అల్లం పొడులు... ఇలా రకరకాల పొడులు ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.  అయితే వీటిని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు ఆదాతోపాటు రుచి, శుచిగానూ ఉంటాయి. మరి ఎలా తయారుచేసుకోవాలో చూద్దామా...

Updated : 27 Feb 2022 06:24 IST

టొమాటో, వెల్లుల్లి, అల్లం పొడులు... ఇలా రకరకాల పొడులు ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.  అయితే వీటిని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు ఆదాతోపాటు రుచి, శుచిగానూ ఉంటాయి. మరి ఎలా తయారుచేసుకోవాలో చూద్దామా...


టొమాటో పొడి...

కిలో టొమాటోలను శుభ్రంగా కడిగి తడిపోయేలా తుడవాలి. ఆ తర్వాత పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి ఈ ముక్కలను వేసి చిన్న మంటపై మగ్గించాలి. టొమాటోలోని నీరు పూర్తిగా ఇంకిపోయేలా చాలాసేపటి వరకు ఉడికించాలి. కూర పూర్తిగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు మూతకు నూనె రాసి టొమాటో గుజ్జును వేసి చెంచాతో వెడల్పుగా నొక్కి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో పెట్టాలి. దీన్ని రెండు రోజుల తర్వాత అట్ల కాడతో తిరగేసి మరో రెండు రోజులు ఎండ బెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకుని ఆ తర్వాత జల్లించాలి.


అల్లంపొడి....

దీన్ని మట్టిపోయేలా శుభ్రంగా కడిగి పొట్టు తీసి మరోసారి కడిగి సన్నగా తరగాలి. ప్లేట్‌పై బటర్‌ పేపర్‌ వేసి దానిపై ఈ తరుగును పరిచి ఎండలో ఆరబెట్టాలి. ఆరిన పొట్టును మిక్సీలో వేసుకుని పొడి చేసుకుంటే సరి. దీన్ని జల్లించకుండా నేరుగా కూడా వాడుకోవచ్చు.


వెల్లుల్లి పొడి...

ర కేజీ వెల్లుల్లి రెబ్బలను విడదీసి నీటితో శుభ్రంగా కడగాలి. స్టెయినర్‌లో వేస్తే నీరంతా పోతుంది. ఆ తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. పళ్లానికి నూనె రాసి వెల్లుల్లి ముద్దను సమంగా పరవాలి. బరకగా ఉన్న ఈ మిశ్రమాన్ని ఎండలో పూర్తిగా ఆరే వరకు అంటే నాలుగైదు రోజులవరకు పెట్టాలి. ఇది పూర్తిగా పొడి పొడిగా మారాక ఓసారి పళ్లెంతోనే చెరిగితే పొట్టు వేరవుతుంది. దీన్ని తీసేసి మిగతా వెల్లుల్లి మిశ్రమాన్ని ఓసారి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దీన్ని జల్లించి, పొడిని శుభ్రమైన గాజుసీసాలో భద్రపరుచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని