పోషక ఉసిరి!

కార్తీకమాసం వచ్చిందంటే.. ఉసిరి వంటకాలకి రెడ్‌కార్పెట్‌ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం...

Published : 30 Oct 2022 00:16 IST

కార్తీకమాసం వచ్చిందంటే.. ఉసిరి వంటకాలకి రెడ్‌కార్పెట్‌ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం...


ఉసిరికాయ నువ్వుల పచ్చడి

కావాల్సినవి: ఉసిరికాయలు- 500గ్రా, పచ్చిమిర్చి- 150గ్రా, నువ్వులు- 50గ్రా, జీలకర్ర- చెంచా, ఆవాలు- చెంచా, ఉప్పు- 100గ్రా, పసుపు- తగినంత, మెంతులు- పావుచెంచా, వెల్లుల్లిపాయ- ఒకటి, ఇంగువ- పావుచెంచా, నూనె- 200గ్రా

తయారీ: ఉసిరికాయల్ని శుభ్రం చేసి తడిలేకుండా తుడుచుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులని పొడిగా వేయించుకుని, చల్లారాక మిక్సీలో మెత్తగా పొడికొట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయరెబ్బల్ని విడి, విడిగా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. వెడల్పాటి పాన్‌లో నూనె పోసి.. వేడెక్కాక ఉసిరికాయల్ని వేసి చిన్నమంట మీద ఎక్కడా పచ్చిలేకుండా మగ్గించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ముందుగా చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, పచ్చిమిర్చి పేస్ట్‌, వెల్లుల్లి పేస్ట్‌, ఇంగువ, ఉప్పు వేసుకుని నూనెలో మగ్గించుకోవాలి. గరిటెతో కలుపుతూ ఉంటే కాసేపటికి నూనె వేరవుతూ ఉంటుంది. అప్పుడు వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా వేసి మరో పదినిమిషాలన్నా మగ్గించుకుంటే పచ్చడి సిద్ధం. ఇది నెలరోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే మూడునెలల వరకూ ఉంటుంది.


సాల్ట్‌ క్యాండీలు

కావాల్సినవి: ఉసిరికాయలు- అరకేజీ, పంచదార- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత

తయారీ: ఉసిరికాయల్ని కడిగి శుభ్రం చేసి, తడిలేకుండా తుడిచి జిప్‌లాక్‌ కవర్‌లో ఉంచి డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక రోజు తర్వాత వీటిని తీస్తే పెద్దగా శ్రమ లేకుండా చాకుతో క్యాండీలకు కావాల్సిన విధంగా ముక్కలు చేసుకోవచ్చు. ఇప్పుడా ఆమ్లా ముక్కలపై మనకి కావాల్సిన పరిమాణంలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువగా ఉన్నా తినలేం. కాబట్టి కాస్త తగ్గించి వేసుకుంటే మేలు. ఆపై పంచదారని కూడా వేసుకుని బాగా కలపాలి. మరుసటిరోజుకి ఈ ముక్కలు బాగా ఊరతాయి. ఆ తర్వాత నాలుగు రోజులు ఎండలో ఉంచితే సాల్డ్‌ క్యాండీస్‌ సిద్ధమవుతాయి. ఈ ముక్కలతో ఉసిరి పులిహోర చేసుకోవచ్చు. దధ్యోజనంలో వేసుకున్నా రుచిగా ఉంటాయి.


కొబ్బరి పచ్చడి

కావాల్సినవి: ఉసిరికాయలు- ఐదు, కొబ్బరికోరు- కప్పు, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- అరచెంచా, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, నిమ్మరసం- చెంచా, ధనియాలు- అరచెంచా తాలింపు కోసం: ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పసుపు- పావుచెంచా చొప్పున, కరివేపాకు- రెబ్బ, ఎండుమిర్చి- ఒకటి, ఇంగువ- పావుచెంచా

తయారీ: ఉసిరికాయల్లో తడిలేకుండా చేసుకుని వాటిల్లోని గింజలని తీసేయాలి. స్టౌపై పాన్‌ పెట్టి వేడెక్కాక... చెంచాన్నర నూనె పోసుకోవాలి. వేడెక్కాక పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరో చెంచాన్నర వేసుకుని అందులో ఉసిరిముక్కల్ని తక్కువ మంట మీద ఐదునిమిషాలు వేయించుకోవాలి. రోటిలో లేదా మిక్సీలో వేయించిపెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అందులో వేయించిన ఉసిరిముక్కలు, ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి. అవన్నీ నలిగాక అప్పుడు కొబ్బరికోరు వేసి మళ్లీ రుబ్బుకోవాలి. పాన్‌లో ఇంగువ తాలింపు వేసి స్టౌ కట్టేసి, అందులో రుబ్బిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఈ ఉసిరి కొబ్బరి పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకుంటే అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.


మురబ్బా

కావాల్సినవి: ఉసిరికాయలు-20, పంచదార- రెండున్నర కప్పులు, యాలకులపొడి- పావుచెంచా, కుంకుమపువ్వు- ఐదు పలుకులు

తయారీ: ఉసిరికాయల్ని కడిగి శుభ్రం చేసి వాటికి ఫోర్క్‌తో గాట్లు పెట్టాలి. స్టౌ వెలిగించి ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఉసిరికాయల్ని ఉడికించి, నీళ్లు వార్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మూడుకప్పుల నీళ్లు తీసుకుని పంచదార వేసి కరిగించుకోవాలి. ఇందులోనే ఉసిరికాయల్ని కూడా వేసి మెత్తగా అయ్యేలా అరగంటపాటు ఉడికించుకోవాలి. ఈపాకాన్ని రెండు రోజులు పాటు ఉంచితే ఉసిరికాయలు బాగా ఊరతాయి. ఆ తర్వాత పాకం నుంచి ఉసిరికాయల్ని వేరుచేసి మరోసారి పొయ్యిమీద పాకాన్ని పెట్టి అప్పుడు యాలకులపొడి, కుంకుమపువ్వు కూడా వేసి తీగపాకం రానివ్వాలి. తిరిగి ఉసిరికాయల్ని కలిపితే మురబ్బా సిద్ధం. ఇవి ఏడాది పాటు నిల్వ ఉంటాయి.


ఉసిరి కారం

కావాల్సినవి: ఉసిరికాయలు- మూడు, ఉల్లిపాయ- ఒకటి(చిన్నది), వెల్లుల్లి రెబ్బలు- మూడు, నూనె- మూడు చెంచాలు, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, తాలింపు కోసం: ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- పావుచెంచా, కరివేపాకు- ఒక రెబ్బ

తయారీ: ఉసిరికాయల్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని ముక్కలు చేసి గింజలు తీసేసి ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లితో కలిపి మిక్సీ పట్టుకోవాలి. స్టౌపై పాన్‌పెట్టి మూడు చెంచాల నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. ఇందులో రుబ్బిపెట్టుకున్న ఉసిరిముద్దను వేసుకుని పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు వేసి కాసేపు ఉడకనివ్వాలి. మరి కాసేపటికి నూనె వేరవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది టిఫిన్లలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు