మమ‘కారం’తో వడ్డిద్దాం!

నాలికకి రుచి తగలడానికో.. కంచంలో ఓ వెరైటీగా కనిపించడానికో..  అని పొడులని తేలికగా తీసిపారేయొద్దండోయ్‌! వీటితో బోలెడు ప్రయోజనాలున్నాయ్‌.

Updated : 20 Nov 2022 06:33 IST

నాలికకి రుచి తగలడానికో.. కంచంలో ఓ వెరైటీగా కనిపించడానికో..  అని పొడులని తేలికగా తీసిపారేయొద్దండోయ్‌! వీటితో బోలెడు ప్రయోజనాలున్నాయ్‌. వ్యాధి నిరోదక శక్తి పెంచే మునగాకు పొడి.. వైరస్‌లను తరిమికొట్టే ఉసిరి పొడి.. జీర్ణశక్తిని పెంచే బీరకాయ పొట్టు పొడి.. బరువు తగ్గించే అవిసెగింజల పొడి.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే దోసగింజల పొడి.. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి..!


అవిసెగింజల పొడి

కావాల్సినవి: అవిసె గింజలు- అరకప్పు, సెనగపప్పు- పావుకప్పు, మినపప్పు- పావుకప్పు, ఎండుమిర్చి- పది, చింతపండు- నిమ్మకాయంత, కరివేపాకు- రెబ్బ, నూనె- చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: అడుగు మందంగా ఉండే ఒక కడాయి తీసుకుని దానిలో ముందుగా సెనగపప్పుని ఎర్రగా అయ్యేంతవరకూ సన్నమంట మీద వేయించి పక్కనపెట్టుకోవాలి. తర్వాత మినపప్పు, అవిసె గింజలని విడివిడిగా వేయించుకోవాలి. చివరిగా కడాయిలో కాస్త నూనె వేసుకుని అందులో ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అన్నీ చల్లారాక మిక్సీలో సెనగపప్పు, మినపప్పులని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అవిసెగింజలని విడిగా..మరీ మెత్తగా కాకుండా మిక్సీపట్టాలి. లేదంటే అవి వేడికి గడ్డ కట్టేస్తాయి. చివరిగా ఎండుమిర్చి కూడా ఆడించుకుని ఉప్పువేసి అన్నింటినీ కలుపుకొంటే అవిసెగింజల పొడి సిద్ధం. ఈ పొడి అన్నంలోకి లేదా కూరల్లో వేసుకున్నా బాగుంటుంది. చెమ్మ లేకుండా డబ్బాలో దాచిపెడితే రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.  
* అవిసె గింజలు బరువుని తగ్గిస్తాయి. జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి.


ఉసిరికారం పొడి

కావాల్సినవి: ఉసిరికాయలు- పది, ఆవనూనె- రెండు చెంచాలు, ఇంగువ- చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, సెనగపప్పు- చెంచా, ఎండుమిర్చి- ఎనిమిది, ధనియాలు- అరచెంచా, మెంతిపొడి- పావుచెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: ఉసిరికాయల్ని కడిగి తడిలేకుండా శుభ్రం చేసి చిన్నముక్కలుగా కోసి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌లో చెంచా ఆవనూనె పోసి వేడెక్కాక.. అందులో ఉసిరికాయ ముక్కల్ని వేసి బాగా కరకరలాడేంతగా వేయించుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరొక చెంచా నూనె వేసుకుని అందులో ఇంగువ, వెల్లుల్లిరెబ్బలు, సెనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. వీటితోపాటు మిక్సీలో ఉసిరికాయముక్కలు, మెంతిపొడి, తగినంత ఉప్పువేసి అన్నింటినీ పొడిచేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. కాస్త బరకగా చేసుకుంటే చాలు. రుచికరమైన, పోషకాలు నిండిన ఉసిరిపొడి సిద్ధం.  జలుబు, జ్వరం నుంచే కాదు ఇతర వైరస్‌ల బారినపడకుండా ఉసిరిలోని సుగుణాలు రక్షణగా నిలుస్తాయి.


బీరకాయపొట్టు పొడి

కావాల్సినవి: లేత బీరకాయపొట్టు- అరకేజీ, వాము- చెంచా, ఎండుమిర్చి-12, మినపప్పు- రెండు చెంచాలు, పసుపు- పావుచెంచా, వెల్లుల్లిరెబ్బలు- ఏడు, చింతపండు- 10గ్రా.

తయారీ: బీరకాయపొట్టులో చెమ్మలేకుండా చూసుకుని అరచెంచా ఉప్పు వేసి మిక్సీలో బరకగా ఆడించుకోవాలి. పొయ్యిమీద పాన్‌ పెట్టుకుని చెంచా నూనె వేసుకుని ఎండు మిరపకాయల్ని రంగు మారేంతవరకూ వేడి చేసి పక్కనపెట్టేయాలి. ఆ తర్వాత అదేపాన్‌లో మినపప్పుని ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో చెంచా నూనె వేసుకుని వేడెక్కాక
బీరకాయ పొట్టుని వేసి పొడిపొడిగా అయ్యేంతవరకూ వేయించుకోవాలి. ఇందులోనే పసుపు, వాము కూడా వేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. మిక్సీలో వేయించిన ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లిపాయరెబ్బలు, చింతపండు వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయపొట్టు, ఉప్పు కూడా వేసి పొడి చేసుకోవాలి.  
* యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉండే ఈ పొడి.. వామువల్ల జీర్ణప్రక్రియ సజావుగా సాగేట్టు చేస్తుంది.


దోసగింజల పొడి

కావాల్సినవి: దోసగింజలు- అరకప్పు, మినప్పప్పు- అరకప్పు, నువ్వులు- పావుకప్పు, సెనగపప్పు- పావుకప్పు, ఎండుమిర్చి- 20, జీలకర్ర- పావుకప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు- ఐదు.

తయారీ: వెల్లుల్లి తప్పించి తక్కిన వాటిని విడివిడిగా పాన్‌లో ఎర్రగా వేయించుకోవాలి. చల్లారాక ముందుగా దోసగింజల్ని, ఎండుమిర్చితో కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత తక్కినవాటిని కూడా మిక్సీ పట్టుకుని చివర్లో వెలుల్లి కూడా వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకుంటే దోసగింజల పొడి సిద్ధమవుతుంది. ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది.


మునగాకుపొడి

కావాల్సినవి: మునగాకు- కప్పు, కరివేపాకు- రెబ్బ, పల్లీలు- అర కప్పు, సెనగపప్పు- చెంచా, మినప్పప్పు- చెంచా, జీలకర్ర- అరచెంచా, ఎండుమిర్చి- ఆరు, ఉప్పు- తగినంత, ఆమ్‌చూర్‌పొడి- అరచెంచా.

తయారీ: అడుగుమందంగా ఉండే పాన్‌ తీసుకుని అందులో మునగ, కరివేపాకు వేసుకుని బాగా గలగలమనేలా వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత పల్లీలను దోరగా వేయించుకోవాలి. వాటికే సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. చల్లారాక మునగాకు కూడా వేసుకుని పొడిచేసుకోవాలి. ఆమ్‌చూర్‌ పొడి అంటే ఎండు మామిడి పొడిని కూడా చేర్చుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది.

* ఈ పొడి రక్తహీనత రాకుండా చూస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని