వానల్లో వేడివేడిగా...

కాస్త వర్షం పడితే చాలు... వేడివేడి పకోడీనో సమోసానో తినాలనిపిస్తుంటుంది ఎవరికైనా. అయితే ఎప్పుడూ ఒకేరకమైన స్నాక్స్‌ కాకుండా వెరైటీగా ట్రై చేస్తేనో..!

Published : 27 Jun 2021 14:35 IST

కాస్త వర్షం పడితే చాలు... వేడివేడి పకోడీనో సమోసానో తినాలనిపిస్తుంటుంది ఎవరికైనా. అయితే ఎప్పుడూ ఒకేరకమైన స్నాక్స్‌ కాకుండా వెరైటీగా ట్రై చేస్తేనో..!

కార్న్‌ ఫ్రిట్టర్స్‌

కావలసినవి
మొక్కజొన్న గింజలు: 2 కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, బేకింగ్‌ పౌడర్‌: టీస్పూను, బేకింగ్‌ సోడా: అరటీస్పూను, సెనగపిండి: టేబుల్‌స్పూను, మైదా: టేబుల్‌స్పూను, జీలకర్ర పొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, పాలు: 2 టేబుల్‌స్పూన్లు, కారం: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* పాన్‌లో ఉల్లిముక్కలు, వెల్లుల్లిరెబ్బలు, మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాలి.
* చల్లారాక వీటిని మిక్సీలో వేసి రుబ్బాలి. తరవాత అందులో సెనగపిండి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, జీలకర్ర పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.

ఆలూ దాల్‌ టిక్కీ

కావలసినవి
బంగాళాదుంపలు: అరకిలో, బ్రెడ్‌ స్లైసెస్‌: మూడు, ఉప్పు: తగినంత, కారం: 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి: టీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, సెనగపప్పు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, నిమ్మరసం: కొద్దిగా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. సెనగపప్పుని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉడికించి ఉంచాలి.
* బ్రెడ్‌ స్లైసెస్‌ని చిదమాలి.
* చిదిమిన బంగాళాదుంపల్లో ఉడికించిన సెనగపప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. తరవాత జీలకర్ర పొడి, దనియాల పొడి, కారం, ఉప్పు, రెండు చుక్కల నూనె వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని గుండ్రని బిళ్లల్లా చేసి కాగిన నూనెలో బంగారు రంగులోకి మారేవరకూ వేయించి తీయాలి.

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పకోడా

కావలసినవి
సెనగపిండి: పావుకిలో, బంగాళాదుంప: ఒకటి, క్యాబేజి తురుము: కప్పు, కొత్తిమీర తురుము: కప్పు, కాలీఫ్లవర్‌ ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కారం: 2 టీస్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌: టీస్పూను, చాట్‌మసాలా: కొద్దిగా, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో సన్నగా తరిగిన క్యాబేజీ తురుము, కొత్తిమీర తురుము, కాలీఫ్లవర్‌ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు అన్నీ వేసి కలపాలి. తరవాత అల్లంవెల్లుల్లి, ఉప్పు, కారం, బేకింగ్‌ పౌడర్‌, సెనగపిండి వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలిపి కాగిన నూనెలో వేయించి తీశాక చాట్‌ మసాలా చల్లి వేడివేడిగా అందించాలి.

బ్రెడ్‌ కట్‌లెట్స్‌

కావలసినవి
బ్రెడ్‌ స్లైసెస్‌: రెండు, అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లి తురుము: 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి తురుము: ఒకటిన్నర టీస్పూన్లు, బంగాళాదుంపలు: రెండు, ఉల్లిముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌ తురుము: పావుకప్పు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, బ్రెడ్‌ పొడి: అరకప్పు, నూనె: తగినంత

తయారుచేసే విధానం
* బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి.
* బ్రెడ్‌ స్లైసెస్‌ని నీళ్లలో ముంచి తీయాలి. నీళ్లు పిండేసి అందులో ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, ఉల్లిముక్కలు, క్యారెట్‌ తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి గుండ్రని పట్టీల్లా చేయాలి. వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి, పెనంమీద కొంచెం కొంచెంగా నూనె వేస్తూ రెండువైపులా వేయించి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని