‘బాదుషా’కు గులాం నేను..

జంక్‌ ఆహారానికి దూరంగా.. అసలుసిసలు దక్షిణాది రుచులు వడ, దోసె, ఇడ్లీలని స్వయంగా వండి పెట్టడమే నాకిష్టం అంటోంది స్నేహ. ఫిట్‌నెస్‌కి...

Updated : 29 Nov 2022 13:54 IST

జంక్‌ ఆహారానికి దూరంగా.. అసలుసిసలు దక్షిణాది రుచులు వడ, దోసె, ఇడ్లీలని స్వయంగా వండి పెట్టడమే నాకిష్టం అంటోంది స్నేహ. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇస్తానంటున్న స్నేహ పాటించే డైట్‌ రహస్యాలేంటో మనమూ తెలుసుకుందామా!

క్షిణాది వంటకాలైన వడ, పూరీ, దోసె, ఇడ్లీ అంటే నాకు చాలాచాలా ఇష్టం. టిఫిన్‌లో వడ, పూరీ, దోసె ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇక భోజనం అంటారా? అన్నం, పప్పు, సాంబారు, కాయగూర భోజనం, పెరుగు, చికెన్‌ ఇవి ఉంటే ఇంక అంతకుమించిన భోజనం ఉండదని అనిపిస్తుంది. అయితే ఇది మా రోజువారీ మెనూ కాదండోయ్‌. అవన్నీ రోజూ చెయ్యడం నావల్లకాదు. ఈ మెనూ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే. పుట్టినరోజు, పెళ్లిరోజు, వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి,  దీపావళి, సంక్రాంతి వంటి రోజుల్లో ఇవన్నీ ఉండాల్సిందే. మరి రోజూ ఏం తింటారు అంటారా? అక్కడికే వస్తున్నా...

సాధారణంగా ప్రతీరోజూ మాది బ్యాలెన్స్డ్‌ డైట్‌ ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్లు , పీచు పదార్థం ఉండేలా... కూరగాయలు, తాజా పండ్లు తప్పనిసరి. ఉదయం నాకిష్టమైన టిఫిన్‌తో పాటూ గుడ్డులోని తెల్లసొన, పండ్లు తప్పనిసరిగా తీసుకుంటా. ఇక భోజనంలోకి ఒక చపాతీ, ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు, గ్రిల్డ్‌ చికెన్‌ మాత్రమే ఉంటాయి. సాయంకాలం ఆకలి వేస్తే పండ్ల ముక్కలు లేదా పండ్లరసం బస్‌... రాత్రిపూట ఉడకబెట్టిన కూరగాయల ముక్కలతోపాటు  గ్రిల్డ్‌ ఫిష్‌, లేదా గ్రిల్డ్‌ చికెన్‌తో డిన్నర్‌ ముగుస్తుంది. నూనెపదార్థాలకి, అన్నానికి వీలైనంత దూరంగా ఉంటాను

సాంబారు వడ తింటే వదలరు...
మావారు ప్రసన్నకు నేను చేసే వడ అంటే చాలా ఇష్టం. అందులోకి సాంబారు ఉంటే... ఇక ఆయన్ని ఆపలేం. ముందే చెప్పానుగా ఇవన్నీ ప్రత్యేకమైన రోజుల్లోనే. డైటింగ్‌ విషయంలో మావారు నాకంటే కూడా ఒక అడుగు ముందున్నారనే చెప్పాలి. పూర్తిగా కూరగాయలు, పండ్లు, సలాడ్లు మాత్రమే తింటారు. ఎప్పుడైనా మాత్రమే గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ వంటివి  తింటారు. అలాని ఏడాదంతా ఇలానే గడిపేస్తాం అని కాదు. మా ఇద్దరికీ ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో బిరియానీ, ఫ్రైడ్‌రైస్‌లని ఓ పట్టు పట్టేస్తాం. స్వీట్‌లంటే ఇద్దరికీ ఇష్టం. అందులోనూ నేను చేసే గులాబ్‌జామూన్లు, రస్‌మలాయ్‌ అంటే తను ఎగిరి గంతేస్తారు. అంతగా అతని ఫేవరేట్లు అవి. నాకు బాదుషా ఉంటే నన్నెవరూ ఆపలేరు.అలాగే కోవా, బర్ఫీలు కూడా.

వాడికి అవేమి తెలియవు...

బర్గర్లు, పిజా, పాస్తా వంటి ఆహారానికి మేమిద్దరమూ దూరమే. మీకో విషయం తెలుసా మా అబ్బాయి విహాన్‌కైతే ఇవేమీ ఇప్పటి వరకూ రుచి చూపించలేదు. కనీసం కార్న్‌ఫ్లేక్స్‌ కూడా. ఉదయం ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ ఏదో ఒకటి పెడతా. మావాడికి సాంబారన్నమంటే  చాలా ఇష్టం. అందులో గుడ్డు ఉంటే మరేం మాట్లాడకుండా తినేస్తాడు. 

- సీహెచ్‌. వసుంధరాదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని