అదరహో.. అప్పటికప్పుడు పచ్చళ్లు

వేసవి అంటే పచ్చళ్లే గుర్తుకొస్తాయి.. కాకపోతే ఆవకాయ పెట్టడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు అప్పటికప్పుడు చేసుకునే ఇతర తాత్కాలిక పచ్చళ్ల పనిపడదాం. అవి కూడా ఎప్పుడూ చేసుకునే టొమాటోలూ... నిమ్మకాయలతో అనుకునేరు. కాస్త కొత్తగా క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, బీట్‌రూట్‌ వంటి వాటితో చేసి చూద్దాం!

Updated : 09 Dec 2022 15:08 IST

వేసవి అంటే పచ్చళ్లే గుర్తుకొస్తాయి.. కాకపోతే ఆవకాయ పెట్టడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు అప్పటికప్పుడు చేసుకునే ఇతర తాత్కాలిక పచ్చళ్ల పనిపడదాం. అవి కూడా ఎప్పుడూ చేసుకునే టొమాటోలూ... నిమ్మకాయలతో అనుకునేరు. కాస్త కొత్తగా క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, బీట్‌రూట్‌ వంటి వాటితో చేసి చూద్దాం!

బీట్‌రూట్‌తో..

కావల్సినవి: బీట్‌రూట్‌- ఒకటి, ఉప్పు- తగినంత, కారం- అరకప్పు, ఆవపిండి- పావుకప్పు, నిమ్మరసం- ఆరుచెంచాలు, పసుపూ, నూనె- కప్పు, ఆవాలు- అరచెంచా, ఎండుమిర్చి- రెండు.
తయారీ: బీట్‌రూట్‌ని చిన్నముక్కలుగా తరిగి అందులో నిమ్మరసం కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ వేయించి పొయ్యి కట్టేయాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ వేసి నిమిషం అయ్యాక ఈ తాలింపునంతా బీట్‌రూట్‌ ముక్కలకు కలిపితే చాలు.

క్యాబేజీతో..

కావల్సినవి: క్యాబేజీ- చిన్న ముక్క, ఉప్పు- తగినంత, కారం- నాలుగు చెంచాలు, వెనిగర్‌- రెండు చెంచాలు, ఆవపిండి- మూడు చెంచాలు, ఆవాలు - అరచెంచా, ఎండుమిర్చీ - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పల్లీనూనె- కప్పు.
తయారీ: క్యాబేజీని సన్నగా తరిగి వెనిగర్‌ కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పూ, కారం, నూనె, ఆవపిండి కలపాలి. ఇందులో వెల్లుల్లి తరుగు వేయాలి. వెనిగర్‌లో క్యాబేజీ వూరిన తర్వాత ఇందులో కలపాలి. దీనిపై ఆవాలూ, ఎండుమిర్చితో తాలింపు వేస్తే ఆ వేడికి క్యాబేజీ బాగా మగ్గి మంచి రుచి వస్తుంది. ఇష్టమైన వారు పల్లీలు కూడా వేసుకోవచ్చు.

దొండకాయతో..

  కావల్సినవి: దొండకాయలు- ఎనిమిది, ఉప్పు- రెండు చెంచాలు, కారం- నాలుగు చెంచాలు, ఆవపిండి- రెండు చెంచాలు, పల్లీనూనె- పావుకప్పు, నిమ్మరసం- నాలుగు చెంచాలు, పసుపూ - పావుచెంచా, ఆవాలు - అరచెంచా, ఎండు మిర్చి- రెండు, మెంతిపిండి- పావుచెంచా.
తయారీ: దొండకాయల్ని చిన్నముక్కలుగా తరిగి పసుపూ, నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ, మెంతుపిండీ, ముప్పావువంతు నూనె వేసి అన్నింటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో దొండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిగిలిన నూనెను వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చి వేయించి పచ్చడిపై వెయ్యాలి. ఇష్టమైన వాళ్లు ఆ తాలింపులో వెల్లుల్లీ వేసుకోవచ్చు.

కూరగాయలతో..

  కావల్సినవి: క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున, క్యాబేజీ తరుగు - రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చి - ఐదు, వెల్లుల్లి తరుగు - పెద్ద చెంచా, ఆవనూనె - పావుకప్పు, ఉప్పు- తగినంత, ఆవపిండి - రెండు చెంచాలు, ఎండుమిర్చి - మూడు, నిమ్మకాయ - ఒకటి, ఆవాలు - చెంచా.
తయారీ: క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయని సన్నగా తరిగి ఈ ముక్కలకు క్యాబేజీ కూడా కలపాలి. వీటిపై ఆవపిండీ, తగినంత ఉప్పూ వేసి మరోసారి కలపాలి. తరవాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ, వెల్లుల్లి ముక్కలు వేయించి.. ఈ కూరముక్కలపై వేయాలి. చివరగా నిమ్మరసం కలిపితే చాలు. ఇందులో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం అవసరంలేదు.

క్యాలీఫ్లవర్‌తో...

కావల్సినవి: క్యాలీఫ్లవర్‌ పువ్వులు - కప్పు, ఉప్పు- తగినంత, కారం- నాలుగు చెంచాలు, ఆవపిండి- చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, నువ్వుల నూనె- అరగ్లాసు, మెంతి పిండి - చెంచా, ఇంగువ, పసుపు - చిటికెడు చొప్పున.
తయారీ: ఒక పాత్రలో క్యాలీఫ్లవర్‌ పువ్వులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత కడిగి తడి పూర్తిగా ఆరిన క్యాలీఫ్లవర్‌ పువ్వులు వేయాలి. ఇందులో ఇంగువ ఉంటుంది కాబట్టి.. అదనంగా తాలింపు వేయాల్సిన అవసరంలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని