వానాకాలం ఆకాకర తిందాం

ఆకాకర కాయల్ని ముక్కలుగా కోయాలి. తరవాత ఉప్పు చల్లి ఓ గంట నాననివ్వాలి. తరవాత ముక్కల్ని పిండేసి పక్కన ఉంచాలి...

Published : 27 Jun 2021 14:25 IST

ఆకాకరకాయ కూర

కావలసినవి
ఆకాకర కాయలు: పావుకిలో, ఉల్లిపాయలు: రెండు, కొబ్బరి తురుము: ముప్పావుకప్పు, ఎండుమిర్చి: ఐదు, దనియాలు: టేబుల్‌స్పూను, చింతపండు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 4 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* ఆకాకర కాయల్ని ముక్కలుగా కోయాలి. తరవాత ఉప్పు చల్లి ఓ గంట నాననివ్వాలి. తరవాత ముక్కల్ని పిండేసి పక్కన ఉంచాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి ముక్కల్ని వేయించి తీయాలి. విడిగా ఓ బాణలిలో దనియాలు, ఎండుమిర్చి వేయించి తీయాలి. వీటికి కొబ్బరి తురుము, చింతపండు, తగినన్ని నీళ్లు, ఉప్పు జోడించి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత రుబ్బిన ముద్ద వేసి మంచి వాసన వచ్చేవరకూ వేగనివ్వాలి. ఇప్పుడు వేయించి తీసిన ఆకాకర కాయ ముక్కలు వేసి కాసేపు వేయించి తీయాలి.

ఆకాకర వేపుడు

కావలసినవి
ఆకాకరకాయలు: పావుకిలో, బియ్యప్పిండి: అరకప్పు, సేమ్యా: పావుకప్పు, కారం: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* ఆకాకర కాయల్ని పలుచని చిప్స్‌లా కోయాలి. సేమ్యాని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఓ గిన్నెలో బియ్యప్పిండి, సేమ్యా పొడి, ఉప్పు, కారం అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముక్కలు వేసి బాగా కలిపి కాగిన నూనెలో వేయించి తీస్తే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌లానూ తినొచ్చు.

ఆకాకర పాలకూర

కావలసినవి
ఆకాకర కాయలు: ఆరు, అల్లంముద్ద: టేబుల్‌స్పూను, పాలు: కప్పు, పసుపు: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* ఆకాకరకాయల్ని పలుచని చక్రాల్లా కోయాలి.
* బాణలిలో నూనె పోసి కాగాక ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి కలిపి సిమ్‌లో మూతపెట్టి కాసేపు ఉడికించి ముక్కల్ని విడిగా తీయాలి. తరవాత అందులోనే అల్లం ముద్ద వేసి వేయించాలి. అది బాగా వేగాక వేయించిన ముక్కలు వేసి, పాలు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. ముక్కలు పూర్తిగా ఉడికి, కూర దగ్గరగా అయ్యాక దించాలి.

ఆకాకర-టొమాటో కర్రీ

కావలసినవి
ఆకాకర: పావుకిలో, టొమాటోలు: మూడు, ఉల్లిపాయలు: మూడు, పచ్చిమిర్చి: నాలుగు, కారం: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, కరివేపాకు: 3 రెబ్బలు, అల్లంవెల్లుల్లి: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, నూనె: 4 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* నాన్‌స్టిక్‌పాన్‌లో నూనె వేసి కాగాక, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి కూడా వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి ఓ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆకాకర కాయ ముక్కలు వేసి ఓ నిమిషం తిప్పిన తరవాత ఉప్పు, కారం, దనియాలపొడి చల్లి రెండు నిమిషాలు వేయించాలి. 
* తరవాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి, సిమ్‌లో ఉడికించాలి. ముక్కలు ఉడికి, కూర దగ్గరగా అయిన తరవాత కొత్తిమీర తురుము చల్లి దించాలి.

కొబ్బరి మసాలాతో ఆకాకర 

కావలసినవి
ఆకాకరకాయలు: పావుకిలో, ఎండుమిర్చి: ఆరు, ఆవాలు: టీస్పూను, కొబ్బరితురుము: కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: చిటికెడు, చితపండు గుజ్జు: 2 టీస్పూన్లు, అల్లం: చిన్నముక్క, నూనె: వేయించడానికి సరిపడా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* ఆకాకర కాయ ముక్కలకు ఉప్పు పట్టించి, పావుగంట పక్కన ఉంచాలి. తరవాత ముక్కల్లో నుంచి నీళ్లు పిండేసి వాటిమీద టీస్పూను నూనె వేసి ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ముక్కల్ని వేయించి తీయాలి.
* పాన్‌లో అరటీస్పూను నూనె వేసి కాగాక ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత అల్లం ముక్కలు కూడా వేయించి తీయాలి. వీటికి కొబ్బరి తురుము, చింతపండు, ఆవాలు చేర్చి రుబ్బాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక రుబ్బిన ముద్ద వేసి వేయించాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి మిశ్రమాన్ని గ్రేవీలా ఉడికించాలి. ఇప్పుడు వేయించిన ముక్కలు వేసి మరికాసేపు ఉడికించి, కొత్తిమీర తురుము చల్లి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు