కీరా దోసె తిన్నారా?

వేసవికాలం కీరా తింటే ఒంటికి చల్లగా ఉంటుంది అంటారు. అయితే ఒట్టిగా కీరా తినాలంటే చాలామందికి చిరాకే. అందుకే కీరాతో వెరైటీ వంటలూ చేసేస్తున్నారు నేటి మాస్టర్‌ షెఫ్‌లు. అవేంటో మనమూ చూద్దామా...

Published : 27 Jun 2021 15:30 IST

వేసవికాలం కీరా తింటే ఒంటికి చల్లగా ఉంటుంది అంటారు. అయితే ఒట్టిగా కీరా తినాలంటే చాలామందికి చిరాకే. అందుకే కీరాతో వెరైటీ వంటలూ చేసేస్తున్నారు నేటి మాస్టర్‌ షెఫ్‌లు. అవేంటో మనమూ చూద్దామా...

కీరా దోసె

కావలసినవి
దోసె బియ్యం: కప్పు, కొబ్బరి తురుము: కప్పు, కీరాలు: మూడు, జీలకర్ర: టీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం
* బియ్యం రెండు గంటలపాటు నాననివ్వాలి.
* బియ్యం కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి రుబ్బాలి.
* కీరాల తొక్కు తీసేసి, నిలువుగా కోసి మధ్యలో గింజల్లాంటివేవయినా ఉంటే తీసేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు రుబ్బిన కీరానీ జీలకర్రనీ దోసె పిండిలో వేసి బాగా కలపాలి. తరవాత పెనం మీద కావలసిన సైజులో దోసెల్లా వేసి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. దీన్ని చట్నీ లేదా సాంబారుతో వడ్డిస్తే సరి.

కుకుంబర్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసినవి
వండిన అన్నం: రెండు కప్పులు, కీరా తురుము: కప్పు, గుడ్లు: రెండు, ఉప్పు: తగినంత, కారం: టీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, సోయాసాస్‌: టీస్పూను, చిల్లీ సాస్‌: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: టీస్పూను, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం
* గుడ్ల సొనలో ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి ఆమ్లెట్‌లా వేయాలి.
* కీరాని తొక్కు తీసి సన్నగా పొడవుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత సోయా సాస్‌, చిల్లీ వేసి కలిపి ఓ నిమిషం ఉంచాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన కీరా తురుము కూడా వేసి ఓ నిమిషం వేగాక వండిన అన్నం వేసి కలపాలి. ఆమ్లెట్‌ను చిన్నముక్కలుగా చేసి వాటిని కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించి కొత్తిమీర తురుము చల్లి దించాలి.

కీరా చీజ్‌ కేక్‌

కావలసినవి
సాల్ట్‌ బిస్కెట్లు: 200 గ్రా., వెన్న: 50 గ్రా., నిమ్మకాయతొక్క పొడి: టీస్పూను, మిరియాలపొడి: టీస్పూను, చీజ్‌ తురుము: 50 గ్రా., కీరా: ఒకటి, నీళ్లు లేకుండా వడేసిన పెరుగు: పావులీటరు, క్రీమ్‌: కప్పు, పంచదార: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు,  నిమ్మరసం: 2 టేబుల్‌స్పూన్లు, జెలాటిన్‌: 2 టీస్పూన్లు, పుదీనా తురుము: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం
* కీరా తొక్కు తీసి సన్నగా తురమాలి.
* బిస్కెట్లు పొడి చేయాలి. అందులోనే వెన్న, నిమ్మతొక్క పొడి, చీజ్‌ తురుము వేసి కలిపి వెడల్పాటి గిన్నెలో అడుగున వేయాలి.
* విడిగా గిన్నెలో కీరా తురుము, పెరుగు వేసి గిలకొట్టాలి. ఇప్పుడు పంచదార, జెలాటిన్‌, పుదీనా, పంచదార, క్రీమ్‌ వేసి బాగా గిలకొట్టినట్లుగా కలిపి బిస్కెట్‌ మిశ్రమం మీద పోయాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిజ్‌లో ఎనిమిది గంటలపాటు ఉంచి తీసి చల్లచల్లగా అందించాలి.

నూడుల్స్‌ కీరా సలాడ్‌

కావలసినవి
నూడుల్స్‌: కప్పు, కీరాలు: రెండు, నిమ్మరసం: 2 టీస్పూను, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: టీస్పూను, చీజ్‌ తురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* నూడుల్స్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించి నీళ్లు వంపేసి, చల్లని నీళ్లతో కడిగి ఓ గిన్నెలో వేయాలి.
* కీరా తొక్కు తీసి గ్రేటర్‌తో సన్నగా తురమాలి. వీటిని నూడుల్స్‌లో వేసి కలిపి దానిమీద ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. చివరగా కాస్త చీజ్‌ తురుము కూడా చల్లి నిమ్మరసం పిండి అందిస్తే సరి.

కీరా బజ్జీ

కావలసినవి
మైదాపిండి లేదా సెనగపిండి: కప్పు, రాక్‌సాల్ట్‌: 2 టీస్పూన్లు, కారం: అరటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, పచ్చిమిర్చి తురుము: టేబుల్‌స్పూను, కీరాలు: రెండు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో మైదా వేసి అందులో ఉప్పు, దనియాలపొడి, కారం, పచ్చిమిర్చి వేసి కావలసినన్ని నీళ్లు పోసి కాస్త జారుగా కలపాలి.
* బాణలిలో నూనె పోసి కాగాక సిమ్‌లో పెట్టి, పిండి మిశ్రమంలో కీరా ముక్కలు ముంచి పకోడీల మాదిరిగా వేసి వేయించి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో అందిస్తే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు