ప్రియమైన వారికి... లవ్‌ శాండ్‌విచ్‌ కుకీస్‌!

మనం ఇష్టపడే వారికి మనసులో ఉన్న మాట చెప్పే రోజు ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున ఎర్రగులాబీలూ కానుకలూ చాక్లెట్లూ... ఇవ్వడమే కాదు ఈ పదార్థాలూ చేసి... మీ ప్రియమైనవారికి రుచి చూపించండి.

Published : 26 Jun 2021 14:02 IST

మనం ఇష్టపడే వారికి మనసులో ఉన్న మాట చెప్పే రోజు ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున ఎర్రగులాబీలూ కానుకలూ చాక్లెట్లూ... ఇవ్వడమే కాదు ఈ పదార్థాలూ చేసి... మీ ప్రియమైనవారికి రుచి చూపించండి.


రోజ్‌ వైట్‌ చాక్లెట్‌ మౌసె

కావలసినవి
వైట్‌ చాక్లెట్‌ ముక్కలు: ఒకటిన్నర కప్పు, గుడ్లు: నాలుగు(తెల్లసొన మాత్రమే తీసుకోవాలి), క్యాస్టర్‌ షుగర్‌: పావుకప్పు, చిక్కని క్రీమ్‌: రెండుంబావు కప్పులు, గులాబీసిరప్‌: చెంచా, గులాబీ, ఆకుపచ్చ రంగులు: చుక్క చొప్పున.

తయారుచేసే విధానం
* స్టౌమీద ఓ గిన్నె పెట్టి సగం వరకూ నీళ్లు పోయాలి. మరో గిన్నెలో చాక్లెట్‌ ముక్కలు తీసుకుని నీళ్లున్న గిన్నెలో ఉంచాలి. చాక్లెట్‌ కరిగాక స్టౌ కట్టేయాలి. సొనను గిలకొట్టి క్యాస్టర్‌ షుగర్‌ వేసి మళ్లీ గిలకొట్టి క్రీమ్‌ వేసి బాగా కలపాలి. తరువాత చాక్లెట్‌, గులాబీసిరప్‌ వేసి ఓసారి కలిపి మూడు భాగాలుగా వేరు చేసుకోవాలి. ఒకదాన్లో గులాబీ, మరోదాన్లో ఆకుపచ్చ ఆహార రంగు కలుపుకోవాలి. ఇప్పుడు ఓ గ్లాసులో మొదట రంగు కలపని మిశ్రమం కొద్దిగా వేసి.. పైన ఆకుపచ్చ, దానిపైన గులాబీరంగులో ఉన్నవి కొద్దికొద్దిగా వేసుకోవాలి. మిగిలిన గ్లాసుల్లోనూ ఇలాగే వేసుకుని కనీసం నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి తీసుకోవాలి.


వెజిటబుల్‌ కబాబ్స్‌

కావలసినవి
ఉడికించిన బంగాళాదుంపలు: నాలుగు, బ్రెడ్‌పొడి: రెండు టేబుల్‌స్పూన్లు, మైదా: అరకప్పు, పనీర్‌: కప్పు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ తరుగు: కప్పు చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తరుగు: చెంచా, వెన్న: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: అరకప్పు, పుదీనా తరుగు: రెండు చెంచాలు, కారం, పసుపు: అరచెంచా చొప్పున, ఉప్పు: తగినంత, గరంమసాలా, చాట్‌మసాలా: పావుచెంచా చొప్పున, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారుచేసే విధానం
* బంగాళాదుంపల్ని ఓ గిన్నెలోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని అన్నింటినీ కలిపి కబాబ్‌ల మాదిరి చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


చికెన్‌ మెజెస్టిక్‌

కావలసినవి
సన్నగా కోసిన చికెన్‌ ముక్కలు: రెండు కప్పులు, మజ్జిగ: కప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, మొక్కజొన్నపిండి: పావుకప్పు, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: ఒకరెబ్బ, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: మూడు, పసుపు: అరచెంచా, కారం, ధనియాలపొడి: టేబుల్‌స్పూను చొప్పున, గరంమసాలా: పావుచెంచా, సోయాసాస్‌, వెనిగర్‌: చెంచా చొప్పున, పెరుగు: పావుకప్పు, ఉల్లికాడల తరుగు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, నిమ్మరసం: ఐదు చెంచాలు.

తయారుచేసే విధానం
* ఓ కప్పులో మజ్జిగ, మూడు చెంచాల నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇందులో చికెన్‌ ముక్కల్ని వేసి రెండుగంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత తీసి, మజ్జిగ పిండేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. వీటిపై మొక్కజొన్నపిండి వేసి బాగా కలపాలి. ఈ ముక్కల్ని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మరో కడాయిని స్టౌపైన పెట్టి మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేయించాలి. నిమ్మరసం, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని కలుపుకోవాలి. తరువాత చికెన్‌ ముక్కలు వేసి వాటికి మసాలా పట్టేలా కలపాలి. అయిదు నిమిషాలయ్యాక మిగిలిన నిమ్మరసం, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.


లవ్‌ శాండ్‌విచ్‌ కుకీస్‌

కావలసినవి
కుకీస్‌ కోసం: ఉప్పు కలపని వెన్న: కప్పు, చక్కెర: కప్పు, గుడ్డు: ఒకటి, వెనిల్లా ఎసెన్స్‌: చెంచా, మైదా: రెండు కప్పులు, చాక్లెట్‌పొడి: ముప్పావుకప్పు, బేకింగ్‌ పౌడర్‌: ఒకటిన్నర చెంచా, ఉప్పు: చెంచా.
ఫిల్లింగ్‌ కోసం: ఉప్పు కలపని వెన్న: అరకప్పు, చక్కెర: రెండుకప్పులు, గులాబీ రంగు: రెండు మూడు చుక్కలు.

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో మైదా, చాక్లెట్‌పొడి, బేకింగ్‌పౌడర్‌, ఉప్పు తీసుకుని అన్నింటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, చక్కెర వేసుకుని నురగ వచ్చేలా గిలకొట్టుకోవాలి. తరువాత ఇందులోనే గుడ్డు సొన, వెనిల్లా ఎసెన్స్‌ కూడా వేసుకుని... మైదాను కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ముద్దలా అయ్యాక ఇవతలకు తీసి ప్లాస్టిక్‌ కవరు చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంటయ్యాక ఈ ముద్దను హృదయాకారంలో బిస్కెట్ల మాదిరి చేసుకుని 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసుకున్న ఒవెన్‌లో పన్నెండు నిమిషాలు బేక్‌చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యేలోగా ఫిల్లింగ్‌కోసం చేసి పెట్టుకున్న పదార్థాలను కలుపుకోవాలి. ఓ బిస్కెట్‌పైన ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి.. మరో బిస్కెట్‌ని దానిపైన పెట్టాలి. ఇలానే మిగతావీ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని