మసాలా మిర్చి... మస్తుగుంటది..!

పల్లీలు, కొబ్బరి తురుము మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే సెనగపిండి, నిమ్మరసం, సోంపుగింజలపొడి, దనియాలపొడి, కారం, ఉల్లిముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ..

Published : 26 Jun 2021 16:49 IST

రాజస్థానీ మలై మిర్చి

కావలసినవి
లావు మిర్చి: 100 గ్రా., మీగడ: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, దనియాలపొడి: టీస్పూను, మెంతిపొడి: టీస్పూను, పసుపు: అరటీస్పూను, ఆమ్‌చూర్‌ పొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* మిర్చి కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. తరవాత కాడలు తీసేసి చిన్న ముక్కల్లా కోయాలి. బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి ముక్కలు వేయించి తీయాలి. తరవాత ఇంగువ, జీలకర్ర, పసుపు, దనియాలపొడి, మెంతిపొడి వేసి కలిపి తిప్పాలి. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. ఉప్పు, ఆమ్‌చూర్‌ పొడి కూడా వేసి కలిపి మూతపెట్టి ముక్కల్ని సిమ్‌లో రెండు నిమిషాలు ఉడికించాలి. తరవాత ముక్కల్ని కదుపుతూ మీగడ వేసి కలిపి ఓ నిమిషం ఉడికించి దించాలి. నోరూరించే ఈ మీగడ మిర్చిని అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.

హైదరాబాదీ మిర్చి కా సాలన్‌

కావలసినవి
లావు మిర్చి: ఎనిమిది, ఆవాలు: అరటీస్పూను, చింతపండు గుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, వంటనూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: అరటీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: అరటీస్పూను,
మసాలాముద్ద కోసం: తాజా కొబ్బరి తురుము: అరకప్పు, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: రెండున్నర టేబుల్‌స్పూన్లు, అల్లం తురుము: టీస్పూను, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
* జీడిపప్పు, నువ్వులు విడివిడిగా సుమారు పావుగంటసేపు నీళ్లలో నానబెట్టి వీటికి కొబ్బరి, కొద్దిగా నీళ్లు చేర్చి పేస్టులా రుబ్బాలి. ఇందులోనే దనియాలపొడి, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపాలి. పచ్చిమిర్చిని చీల్చి వాటిల్లో మసాలా ముద్ద పెట్టాలి. ఇలాగే అన్నీ చేయాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక స్టఫ్‌ చేసి మిర్చి వేసి వేయించి తీయాలి. జీలకర్ర, ఆవాలు వేసి వేగాక చింతపండు గుజ్జు, మిగిలిన మసాలా ముద్ద వేసి కలపాలి. దనియాలపొడి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. మంట తగ్గించి, వేయించిన మిర్చి వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించి దించాలి.

గుజరాతీ స్టఫ్‌డ్‌ మిర్చి

కావలసినవి
లావు మిర్చి: పావు కిలో, ఉప్పు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఇంగువ: పావు టీస్పూను,
స్టఫ్‌ కోసం: వేయించిన పల్లీలు: అరకప్పు, సెనగపిండి: 2 టేబుల్‌స్పూను, ఎండుకొబ్బరి తురుము: పావుకప్పు, నిమ్మరసం: టీస్పూను, సోంపు గింజల పొడి: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, కారం: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, ఉప్పు: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కొద్దిగా తొడిమ ఉంచాలి. పచ్చిమిర్చిని చీల్చి అందులోని గింజల్ని తీసేసి కొద్దిగా ఉప్పుని పచ్చిమిర్చి లోపల రుద్దాలి.
* పల్లీలు, కొబ్బరి తురుము మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే సెనగపిండి, నిమ్మరసం, సోంపుగింజలపొడి, దనియాలపొడి, కారం, ఉల్లిముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మిర్చిలో స్టఫ్‌ చేయాలి. తరవాత నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేగాక స్టఫ్‌ చేసిన మిర్చి వేసి, మిగిలిన స్టఫ్‌ని కూడా వేసేసి ఐదు నిమిషాలు వేయించాలి. తరవాత మూతపెట్టి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. అవి పూర్తిగా ఉడికిన తరవాత వీటిని అన్నంలో నంజుకునో లేదా నేరుగానూ కూడా తినొచ్చు.

సిమ్లా మిర్చి కా ఆలూ

కావలసినవి
లావు మిర్చి: రెండు, బంగాళాదుంపలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: అరటీస్పూను, టొమాటో గజ్జు: కప్పు, సోయా సాస్‌: అరటీస్పూను, దనియాలపొడి: టేబుల్‌స్పూను, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, పసుపు: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 4 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* ఉల్లిపాయల్ని నిలువుగా కోయాలి. సిమ్లా మిర్చిని కూడా పెద్ద ముక్కల్లా కోయాలి. బంగాళాదుంపలకి కూడా తొక్కు తీసి ముక్కల్లా కోయాలి.
* బాణలిలో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించి తీయాలి. అదే బాణలిలో మిర్చి ముక్కలు కూడా వేసి వేయించి తీయాలి. తరవాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి వేయించి తీయాలి.
* ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక దనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు టొమాటో గుజ్జు వేసి కలుపుతూ నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత సోయా సాస్‌ వేసి కలిపి వేయించిన ఉల్లి, సిమ్లా మిర్చి, బంగాళాదుంప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలన్నీ మెత్తగా ఉడికి దగ్గరగా అయ్యాక తీసి కొత్తిమీర తురుము చల్లితే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని