తేనెలొలికేలా..కొక్కొరకోలా..

చికెన్‌ని ఎలా వండినా తినే వాళ్లుంటారు. అబ్బే... ఎలాగో అలా వండేసుకోవడంలో కిక్‌ ఏముంది? ప్రత్యేకంగా వండుకోవడంలోనే కదా మజా అంతా అంటారా.. నిజమే! అందుకే చిప్స్‌తో తాలింపు వేద్దాం.... తేనె వేసి కట్టామీఠా...

Updated : 22 Nov 2022 15:52 IST

చికెన్‌ని ఎలా వండినా తినే వాళ్లుంటారు. అబ్బే... ఎలాగో అలా వండేసుకోవడంలో కిక్‌ ఏముంది? ప్రత్యేకంగా వండుకోవడంలోనే కదా మజా అంతా అంటారా.. నిజమే! అందుకే చిప్స్‌తో తాలింపు వేద్దాం.... తేనె వేసి కట్టామీఠా కూర చేద్దాం! పైనాపిల్‌తో వండి పండగ చేసుకుందాం... 
చికెన్‌ మారినేట్‌ చేసేటప్పుడు రెండు చెంచాల గ్రీన్‌టీ డికాషిన్‌ని కలిపితే ఆ రుచి ప్రత్యేకంగా ఉంటుంది.

చిప్స్‌తో ..

కావాల్సినవి: చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌- ఆరు, గరంమసాలా- చెంచాన్నర, మొక్కజొన్నపిండి- కప్పు, మైదా- అరకప్పు, మజ్జిగ- పావుకప్పు, గుడ్లు- మూడు, మొరంగా(బరకగా) దంచిన ఆలూ చిప్స్‌ పొడి- కప్పున్నర, మిరియాలపొడి- మూడుచెంచాలు, నూనె- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, సోయాసాస్‌- చెంచాన్నర

తయారీ: ముందుగా అవెన్‌ని 375 డిగ్రీల దగ్గర వేడి చేసుకోవాలి. చికెన్‌ ముక్కలకి గరంమాసాలా, సోయాసాస్‌ పట్టించాలి. ఒక పాత్రలో గుడ్లలోని తెల్లసొన, మజ్జిగ వేసుకొని రెండూ ఒకదానితో ఒకటి కలిసేట్టు బాగా గిలక్కొట్టాలి. వేరొక పాత్రలో చిప్స్‌పొడి, మిరియాలపొడి వేసి కలుపుకోవాలి. వెడల్పాటిపాన్‌లో మొక్కజొన్నపిండి, మైదాపిండి కలిపి పెట్టుకుని దాన్లో చికెన్‌ ముక్కలని దొర్లించి ఎక్కువగా ఉన్న పిండిని దులిపేయాలి. తర్వాత గుడ్డు సొనలో ముంచి చివరిగా చిప్స్‌పొడిలో దొర్లించాలి. నూనెలో చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ని దోరగా వేయించుకుని చివరిగా అవెన్‌లో పావుగంటపాటు బేక్‌ చేసుకోవాలి. కరకరలాడే ఆలూచిప్స్‌చికెన్‌ రెడీ!

ఖట్టామీఠా స్పెషల్‌

కావాల్సినవి: చికెన్‌ వింగ్స్‌(రెక్కలు)- అరకిలో, మేథీఆకులు- రెండు చెంచాలు, సోంపుగింజలు- పావుచెంచా, పెరుగు- రెండు చెంచాలు, నిమ్మరసం- చెంచా, పంచదార- చెంచాన్నర, ఆవనూనె- తగినంత, ఉప్పు- తగినంత, యాలకులు- మూడు, దాల్చినచెక్కలు- రెండు, లవంగాలు- మూడు, ఎండుమిర్చి- నాలుగు, కారం- రెండు చెంచాలు, జీడిపప్పులు- ఎనిమిది, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచాన్నర, గరంమసాలాపొడి- చెంచా, మెంతిగింజలు- చిటికెడు, ఉల్లిపాయలు- రెండు

తయారీ: ముందుగా చికెన్‌కి తగినంత పెరుగు, నిమ్మరసం, ఉప్పు, ఆవనూనె, ఎండిన మెంతిఆకులు పట్టించి గంటన్నరపాటు పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులని నీళ్లలో నానబెట్టుకోవాలి. మందపాటి పాత్రలో ఎండుమిర్చి, సోంపుగింజలు, మెంతిగింజలతో సహా తక్కిన మసాలాదినుసులని వేసి వేయించుకోవాలి. వీటిని ఉల్లిపాయముక్కలు, నానబెట్టిన జీడిపప్పులతో కలిపి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడి చేసుకుని రుబ్బుకున్న మిశ్రమంతోపాటు అల్లంవెల్లుల్లిపేస్ట్‌, ఉప్పు, కారం కూడా వేసి నూనె పైకి తేలేంతవరకూ మగ్గించుకోవాలి. ఇప్పుడు మెంతిఆకులు, నిమ్మరసం, పంచదార కూడా కలిపి మూతపెట్టేయాలి. మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు ఆగి మారినేట్‌ చేసిన చికెన్‌ వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడకనివ్వాలి. చికెన్‌ మొత్తం ఉడికిన తర్వాత మరి కొద్దిగా నిమ్మరసం, పంచదార, మెంతిఆకులు వేసి చివరిగా గరంమసాలా వేసి దించుకోవాలి.

తేనెతో

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌ - కేజీ, మొక్కజొన్నపిండి- పావుకప్పు, వంటనూనె- రెండు గరిటెలు, తరిగిన వెల్లుల్లి పలుకులు- మూడు చెంచాలు, తరిగిన ఉల్లిపొరక - మూడు చెంచాలు, వేయించిన నువ్వులు- చెంచా, ఉప్పు- తగినంత హానిగార్లిక్‌సాస్‌ కోసం: తేనె- అరకప్పు, సోయాసాస్‌-  §వుకప్పు, ఆలివ్‌నూనె- రెండు చెంచాలు సాస్‌ తయారీ: ఒక పాత్రలో తేనె, సోయాసాస్‌, ఆలివ్‌నూనె వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.

తయారీ: చికెన్‌ని చిన్నముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి. వీటికి ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లిపొడి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో చికెన్‌ ముక్కలు వేసుకుని మొక్కజొన్నపిండిని వేసి బాగా కలపాలి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మాంసం తడికి అంటుకున్న పిండే చాలు. వెడల్పాటి పాన్‌లో నూనె వేసి అందులో మాంసం ముక్కల్ని ఉంచి రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. దీనికి సన్నగా తరిగిన వెల్లుల్లిపలుకులు, ఉప్పు కూడా కలిపి రెండు నిమిషాలపాటు ఉంచాలి. మంట తగ్గించి తయారుచేసి పెట్టుకున్న హనీ గార్లిక్‌ సాస్‌ కలిపి మరో ఐదునిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా వేయించిన నువ్వుల, ఉల్లిపొరకని వేస్తే స్పైసీ హనీ చికెన్‌ రెడీ!

కోలాతో...

కావాల్సినవి: బ్రౌన్‌షుగర్‌(ముదురు రంగు పంచదార)- అరకప్పు, కోలా(డైట్‌)- చిన్నక్యాన్‌ ఒకటి, ఉల్లిపాయలు- రెండు, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు- చెంచా, సోయాసాస్‌- రెండు చెంచాలు, బోన్‌లెస్‌ చికెన్‌ - కిలో, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- చెంచా, సన్నగా తరిగిన అల్లం ముక్కలు- చెంచా

తయారీ: ముందుగా చికెన్‌ ముక్కలకి తగినంత సోయాసాస్‌, ఉప్పు, మిరియాలపొడి పట్టించి  గంటపాటు పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో పంచదార, కోలా, ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి పలుకులు, సోయాసాస్‌, ఉప్పు, మిరియాలపొడి వేసి అన్నీ ఒకదానితో ఒకటి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో చికెన్‌ ముక్కలని ఉంచి ముక్కలన్నింటికీ బాగా పట్టనివ్వాలి. మిశ్రమంతో సహా అవెన్‌లో 350 డిగ్రీల దగ్గర గంటపాటు బేక్‌ చేసుకోవాలి. అవెన్‌ లేకపోతే కుక్కర్‌లో ఉంచి కూడా ఉడికించుకోవచ్చు. సాస్‌ పల్చగా ఉందనుకుంటే అందులో కొద్దిగా మొక్కజొన్నపిండి కలిపితే గ్రేవీ చిక్కబడుతుంది.

పైనాపిల్‌ చికెన్‌

కావాల్సినవి: పైనాపిల్‌ జ్యూస్‌- అరకప్పు, సోయాసాస్‌- మూడు చెంచాలు, చికెన్‌ ఉడికించిన నీళ్లు- పావుకప్పు, ముదురురంగు పంచదార(బ్రౌన్‌షుగర్‌)- అరకప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లిపలుకులు- చెంచా, మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు, వంటనూనె- చెంచాన్నర, బోన్‌లెస్‌ చికెన్‌- అరకిలో( ముక్కలుగా చేసి పెట్టుకోవాలి), పైనాపిల్‌ ముక్కలు- కప్పు, వేయించిన జీడిపప్పు పలుకులు- మూడు చెంచాలు

తయారీ: ఉప్పు, మిరియాలపొడి పట్టించిన చికెన్‌ని గంటపాటు పక్కన పెట్టుకోవాలి.  వెడల్పాటి పాన్‌లో పైనాపిల్‌జ్యూస్‌, సోయాసాస్‌, చికెన్‌స్టాక్‌, పంచదార, వెల్లుల్లి పలుకులు, మొక్కజొన్నపిండి, ఉప్పు వేసి అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో బాగా దగ్గరకు వచ్చేంతవరకూ మరిగించుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని రెండు చెంచాల నూనె వేసి అందులో చికెన్‌ ముక్కలని వేసి నీరు అంతా బయటకు వచ్చేంతవరకూ ఉడకనివ్వాలి. పొడిగా ఉన్న చికెన్‌కి ముందుగా మరిగించి పెట్టుకున్న సాస్‌ వేసి కలపాలి. చికెన్‌ ఉడికిన తర్వాత దీనికి పైనాపిల్‌ ముక్కలు, వేయించిన జీడిపప్పు వేసి మరో నిమిషంపాటు ఉడకనివ్వాలి. పైనాపిల్‌ చికెన్‌ సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని