Published : 27 Jun 2021 17:41 IST

సంక్రాంతికి కోవా నువ్వుల లడ్డూ!

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు... అరిసెలూ పాకుండలూ బూందీలడ్డూలూ కజ్జికాయలూ చెక్కలూ జంతికలూ సకినాలూ రిబ్బన్‌ పకోడీలూ... ఇలా ఎన్నో రకాల పిండివంటలు నోరూరిస్తుంటాయి. వాటితోబాటు వీటినీ  ఆస్వాదించండి మరి..!

కోవా నువ్వుల లడ్డూ

కావలసినవి
నువ్వులు: అరకప్పు, కోవా: అరకప్పు, బెల్లం తురుము: ముప్పావుకప్పు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* బాణలిలో నువ్వులు వేసి సిమ్‌లో కరకరలాడేవరకూ వేయించి దించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఓ వెడల్పాటి గిన్నెలో వేయాలి.
* బాణలిలో కోవా తురుము వేసి సిమ్‌లో కలుపుతూ వేయించాలి. అది కాస్త మెత్తబడ్డాక బెల్లం తురుము వేసి కరిగించాలి. ఇప్పుడు నెయ్యి వేసి కలిపి దించాలి. తరవాత నువ్వులపొడి వేసి బాగా కలిపి ఉండలు చుట్టుకుని చల్లారాక గాలిచొరని డబ్బాలో పెట్టాలి.

మొక్కజొన్న గారెలు

కావలసినవి
మొక్కజొన్న లేదా స్వీట్‌కార్న్‌ గింజలు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, ఉల్లిపాయ: ఒకటి, నూనె: వేయించడానికి సరిపడా, సగ్గుబియ్యం: అరకప్పు, కరివేపాకు: 2 రెబ్బలు

తయారుచేసే విధానం
* సగ్గుబియ్యం పూర్తిగా ఉబ్బేవరకూ సుమారు గంటసేపు నాననివ్వాలి.
* మిక్సీలో మొక్కజొన్నగింజలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. దీన్ని ఓ వెడల్పాటి గిన్నెలో వేసి అందులో ఉల్లిముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వత్తి కాగిన నూనెలో బాగా వేయించి తీయాలి.

పల్లీ బొబ్బట్లు

కావలసినవి
పల్లీలు: పావుకప్పు, నువ్వులు: పావుకప్పు, మెత్తటి బెల్లంతురుము: అరకప్పు, యాలకులపొడి: పావుటీస్పూను, జాజికాయపొడి: కొద్దిగా, గోధుమపిండి: అరకప్పు, మైదా: పావుకప్పు, పాలు: పావుకప్పు, నెయ్యి: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* బాణలిలో పల్లీలు, నువ్వులు విడివిడిగా వేయించి తీయాలి. పల్లీల పొట్టు తీసేసి రెండూ కలిపి మెత్తని పొడిలా చేయాలి. తరవాత అందులోనే బెల్లం పొడి కూడా వేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి యాలకులపొడి, జాజికాయ పొడి వేసి కలపాలి.
* గోధుమపిండిలో మైదా, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కాస్త కాగిన నెయ్యి కూడా వేసి కలపాలి. తరవాత గోరువెచ్చని పాలు పోసి ముద్దలా అయ్యేవరకూ కలిపి రెండు గంటలపాటు నాననివ్వాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చపాతీ ఉండల్లా చేసుకోవాలి.
* పల్లీ మిశ్రమాన్ని ఓసారి స్టవ్‌మీద పెట్టి వేడి చేసి దించాలి. దాన్ని చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని పూరీల్లా వత్తి, అందులో పల్లీ మిశ్రమంతో చేసిన ఉండని పెట్టి అంచుల్ని మూసేసి బొబ్బట్టులా కర్రతోగానీ చేత్తోగానీ నెయ్యి అద్దుకుంటూ వత్తి పెనంమీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చాలి. వేగాక తీసి పైన కాస్త నెయ్యి రాసి, మరికాస్త పంచదార చల్లి అందిస్తే ఎంతో రుచిగా ఉంటాయి.

రవ్వ కట్టెపొంగలి

కావలసినవి
గోధుమరవ్వ: కప్పు, పెసరపప్పు: అరకప్పు, మిరియాలు: టీస్పూను, జీలకర్ర: టేబుల్‌స్పూను, జీడిపప్పు: పది, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, అల్లంతురుము: టీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం
* పెసరపప్పు, రవ్వ విడివిడిగా కడిగి ఉంచాలి.
* ప్రెషర్‌కుక్కర్‌లో పెసరపప్పు వేసి ఓ కప్పు నీళ్లు పోసి, ఓ చుక్క నెయ్యి, చిటికెడు పసుపు వేసి ఉడికించి పక్కకు తీయాలి. మళ్లీ అందులోనే రవ్వ వేసి, మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.
* బాణలిలో టేబుల్‌స్పూను నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన ఉంచాలి.
* తరవాత జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, అల్లం తురుము వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన రవ్వ, పప్పు, ఉప్పు వేసి బాగా కలుపుతూ కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ ఉడికించాలి. మిశ్రమం బాగా కలిసిన తరవాత చివరగా వేయించి తీసిన జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి వడ్డించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని