పనీరు... నోరూరు!

అందరూ ఇంట్లో ఉండే ఈ సమయంలో... సాయంత్రం పూట ఏవో ఒక స్నాక్స్‌ తప్పనిసరి. రోజుకోరకం చేయాల్సి వస్తుంది కాబట్టి... ఈసారి పిల్లల నుంచీ పెద్దవాళ్లవరకూ ఇష్టపడే పనీర్‌తో ఇలాంటి రుచుల్ని వండేయండి.

Updated : 30 Apr 2022 15:54 IST

అందరూ ఇంట్లో ఉండే ఈ సమయంలో... సాయంత్రం పూట ఏవో ఒక స్నాక్స్‌ తప్పనిసరి. రోజుకోరకం చేయాల్సి వస్తుంది కాబట్టి... ఈసారి పిల్లల నుంచీ పెద్దవాళ్లవరకూ ఇష్టపడే పనీర్‌తో ఇలాంటి రుచుల్ని వండేయండి.


లాలిపాప్‌

కావలసినవి: సోయాకీమా: అరకప్పు, పనీర్‌ తురుము: ముప్పావుకప్పు, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, అల్లం తరుగు: పావుచెంచా, పచ్చిమిర్చి ముక్కలు: రెండు చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, ఎండుమిర్చి గింజలు: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, నిమ్మరసం: రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌పొడి:అరకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, ఐస్‌క్రీమ్‌ పుల్లలు: కొన్ని.
తయారీ విధానం: సోయాకీమాలో కప్పు నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. వేడి చల్లారాక నీళ్లు పిండేసి కీమాను ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. నిమ్మకాయంత ఉండను తీసుకుని లాలీపాప్‌ ఆకృతిలో వచ్చేలా చేసి, ఐస్‌క్రీమ్‌ పుల్లను గుచ్చాలి. ఇదేవిధంగా అన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


చిల్లీ పనీర్‌

కావలసినవి: మొక్కజొన్నపిండి: పావుకప్పు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, కారం: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, ఉప్పు: తగినంత, పనీర్‌ ముక్కలు: పదిహేను, నూనె: వేయించేందుకు సరిపడా. సాస్‌కోసం: వెల్లుల్లి తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు,ఉల్లికాడల తరుగు: పావుకప్పు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు,క్యాప్సికం ముక్కలు: కొన్ని, చిల్లీసాస్‌: చెంచా, టొమాటోసాస్‌: టేబుల్‌స్పూను, వెనిగర్‌: టేబుల్‌స్పూను, సోయాసాస్‌: టేబుల్‌స్పూను, కారం: పావుచెంచా, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: పావుచెంచా.
తయారీ విధానం: ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి, మైదా, అల్లంవెల్లుల్లిముద్ద, కారం, మిరియాలపొడి, ఉప్పు వేసి అన్నింటినీ కలపాలి. ఇందులో పావుకప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మరోసారి కలిపి, పనీర్‌ ముక్కలు వేయాలి. వాటన్నింటికీ ఈ మిశ్రమం పట్టేలా జాగ్రత్తగా కలిపి... రెండుమూడు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి, ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేయించాలి. నిమిషమయ్యాక ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, చిల్లీసాస్‌, టొమాటోసాస్‌, వెనిగర్‌, సోయాసాస్‌, కారం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేయాలి.  ఓసారి కలిపి తరువాత వేయించుకున్న పనీర్‌ ముక్కలు వేసి మరోసారి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


పనియారం

కావలసినవి: ఇడ్లీపిండి: కప్పు, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, నూనె: అరకప్పు, పనీర్‌ తురుము: అరకప్పు, టొమాటోముక్కలు: రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, కారం: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా.
తయారీ విధానం: స్టౌమీద పాన్‌ పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర వేసి వేయించి, సగం చొప్పున ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అవీ వేగాయనుకున్నాక పసుపు, కారం, ఉప్పు, పనీర్‌ తురుము వేసి బాగా కలిపి నాలుగు నిమిషాలయ్యాక స్టౌ కట్టేయాలి. ఇడ్లీపిండిలో మిగిలిన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. స్టౌమీద గుంటపొంగనాల పాన్‌ పెట్టి.. అన్నింట్లో పావుచెంచా చొప్పున నూనె వేయాలి. ఇప్పుడు చెంచా చొప్పున ఇడ్లీపిండి వేసి... దానిమీద చెంచా పన్నీర్‌ మిశ్రమం వేసి మళ్లీ పైన ఇడ్లీ పిండి వేయాలి. వీటిని నూనె వేస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే సరి.


అమృతసరీ టిక్కా

కావలసినవి: వెడల్పుగా కోసిన పనీర్‌ ముక్కలు: పన్నెండు, సెనగపిండి: పావుకప్పు, వాము: పావుచెంచా, పసుపు: పావుచెంచా, గరంమసాలా: పావుచెంచా, కారం: అరచెంచా, నిమ్మరసం: చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా, నీళ్లు: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, చాట్‌మసాలా: చెంచా.
తయారీవిధానం: ఓ గిన్నెలో నూనె పనీర్‌ ముక్కలు, చాట్‌మసాలా, కొత్తిమీర తప్పమిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. ఇందులో పనీర్‌ ముక్కలు వేసి వాటికి ఆ మిశ్రమం పట్టేలా మరోసారి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గంటయ్యాక ఇవతలకు తీయాలి. ఇప్పుడు స్టౌమీద పాన్‌ పెట్టి... రెండు పనీర్‌ ముక్కలు ఉంచి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకుని వాటిపైన చాట్‌ మసాలా, కొత్తిమీర చల్లితే సరి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని