Pickle: రోటితో పనిలేని పచ్చడి

చిట్టి దోసకాయల్లా ఉండే బుడమకాయలు అందరికీ తెలియక పోవచ్చు కానీ.. గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో బాగా దొరుకుతాయి. వీటితో రోటి పచ్చడి, ఊరగాయ పచ్చడి కూడా చేయొచ్చు.

Published : 16 Jun 2024 00:59 IST

చిట్టి దోసకాయల్లా ఉండే బుడమకాయలు అందరికీ తెలియక పోవచ్చు కానీ.. గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో బాగా దొరుకుతాయి. వీటితో రోటి పచ్చడి, ఊరగాయ పచ్చడి కూడా చేయొచ్చు. మా అమ్మమ్మ ఈ కాయలతో పెరుగు పచ్చడి చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఇదెంతో రుచిగా ఉంటుంది కనుక.. మీతో పంచుకుంటున్నాను. ఎలా చేయాలంటే.. నాలుగు బుడమకాయలకు నాలుగు పచ్చిమిర్చి, కప్పు పెరుగు, 2 చెంచాల శనగపిండి, చారెడు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర చెంచా నెయ్యి, తాలింపు దినుసులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. బుడమకాయలను కడిగి, చెక్కు తీసి తురమాలి. పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కోయాలి. శనగపిండిని సన్న సెగ మీద పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. బుడమకాయల తురుములో పెరుగు, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర వేసి కలపాలి. కడాయిలో నెయ్యి వేడయ్యాక.. ఆవాలు, మెంతులు, పచ్చి శనగపప్పు వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేయాలి. ఈ తాలింపును పచ్చడిలో కలిపితే సరి.. ఘుమ ఘుమలాడే ‘బుడమకాయ పెరుగు పచ్చడి’ తయారైపోతుంది. తురమడం వద్దనుకుంటే సన్నగా ముక్కలు కోయొచ్చు. దీంతో జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. మలబద్ధక సమస్యతో బాధపడే వారికి ఇది ఔషధమనే చెప్పాలి.

లక్ష్మీ ఉమాబాల, టి.నగర్, చెన్నై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని