ఆహా... అటుకుల పాయసం!

ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది షడ్రుచులు మేళవించిన వేపపువ్వు పచ్చడి.  అయితే దాంతోపాటు తియ్యని పాయసాలూ బొబ్బట్లూ గారెలూ వడలూ  ఇలా మరెన్నో వంటలూ చవులూరిస్తుంటాయి.  వాటినే కాస్త కొత్తగా చేసి చూద్దామా..!

Published : 27 Jun 2021 16:29 IST

ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది షడ్రుచులు మేళవించిన వేపపువ్వు పచ్చడి.  అయితే దాంతోపాటు తియ్యని పాయసాలూ బొబ్బట్లూ గారెలూ వడలూ  ఇలా మరెన్నో వంటలూ చవులూరిస్తుంటాయి.  వాటినే కాస్త కొత్తగా చేసి చూద్దామా..!

బూడిదగుమ్మడి హల్వా

కావలసినవి
బూడిదగుమ్మడికాయ తురుము: 2 కప్పులు(నీళ్లన్నీ పిండినది), పంచదార: కప్పు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: అరటీస్పూను, కుంకుమపువ్వు: చిటికెడు

తయారుచేసే విధానం
* బూడిదగుమ్మడి పైన తొక్క తీసి ముక్కలుగా కోసి గ్రేటర్‌తో తురమాలి. తరవాత తురుమును పిండేసి, నీటిని పక్కన ఉంచాలి.
* మందపాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక రెండు నిమిషాలు వేయించాలి. తరవాత పిండిన నీళ్లను పోసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పంచదార వేసి మూత పెట్టి ఉడికించి, దగ్గరగా ఉడికిన తరవాత కుంకుమపువ్వు చల్లి, నెయ్యి కూడా వేసి కలుపుతూ దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించాలి.

గోధుమ-కొబ్బరి బొబ్బట్లు

కావలసినవి
గోధుమపిండి: 2 కప్పులు, ఉప్పు: తగినంత, కొబ్బరి తురుము: 2 కప్పులు, బెల్లం తురుము: కప్పు, యాలకులపొడి: కొద్దిగా, నెయ్యి: సరిపడా

తయారుచేసే విధానం
* గోధుమపిండిలో ఉప్పు వేసి కలపాలి. తరవాత నీళ్లు కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని చపాతీపిండికన్నా కాస్త పలుచగా కలపాలి. ఇప్పుడు దీనిమీద సుమారు నాలుగు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి.
* మిక్సీలో కొబ్బరితురుము, బెల్లం, యాలకులపొడి వేసి రెండుమూడుసార్లు తిప్పి మెత్తగా చేయాలి. తరవాత ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్‌ పాన్‌లో వేసి అందులోని తడి అంతా పోయేవరకూ మీడియం మంట మీద ఉడికించి దించి ఉండలుగా చేయాలి.
* ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండల్లా చేసి ఒక్కో ఉండ మధ్యలో పూర్ణం పెట్టి అంచుల్ని మూసేసి అప్పడాల కర్రతో పిండి చల్లుతూ పలుచగా చేసి పెనంమీద వేసి నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చితీయాలి.

అటుకుల పాయసం

కావలసినవి
అటుకులు: కప్పు, చిక్కనిపాలు: లీటరు, బాదం: పది, పిస్తా: పది, యాలకులపొడి: చిటికెడు, నెయ్యి: టేబుల్‌స్పూను, పంచదార: కప్పు, జీడిపప్పు: నాలుగు, ఎండుద్రాక్ష: 15

తయారుచేసే విధానం
* అటుకుల్ని కడిగి నీళ్లు వంపేసి పది నిమిషాలు ఓ ప్లేటులో వేసి ఆరబెట్టాలి.
* కాస్త నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించాలి.
* మందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించాలి. సగం అయిన తరవాత అటుకులు వేసి మెల్లగా కలుపుతూ మరికాసేపు మరిగించాలి. ఐదు నిమిషాల తరవాత సిమ్‌లో పెట్టి పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. చివరగా సన్నగా తరిగిన బాదం, పిస్తా వేసి కలిపి దించాలి.

మెంతి వడ

కావలసినవి
సెనగపప్పు: అరకప్పు, కందిపప్పు: అరకప్పు, స్వీట్‌కార్న్‌: అరకప్పు, మెంతిఆకులు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కారం: అరటీస్పూను, పసుపు: పావుటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు: 4 రెబ్బలు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* సెనగపప్పు, కందిపప్పు నాలుగు గంటలసేపు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి ఓ పది నిమిషాలు ఆరనిచ్చి మిక్సీలో వేయాలి. అందులోనే స్వీట్‌కార్న్‌, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి నీళ్లు పోయకుండా రుబ్బాలి.
* మెంతి ఆకుని కడిగి సన్నగా తరగాలి. రుబ్బిన పప్పు మిశ్రమంలో తరిగిన మెంతాకు, పసుపు, కారం, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి కాగిన నూనెలో వడల్లా వేసి వేయించి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని