పండగ విందులో... అటుకుల పొంగలి!

పండగ సమయంలో అరిసెలు, జంతికలు, పప్పుచెక్కల్లాంటివి చేసుకోవడం మామూలే. అవి మాత్రమే కాకుండా... ఆ రోజున చేసుకునే పదార్థాల్లో వీటినీ చేర్చుకుని చూడండి.

Published : 26 Jun 2021 15:07 IST

పండగ సమయంలో అరిసెలు, జంతికలు, పప్పుచెక్కల్లాంటివి చేసుకోవడం మామూలే. అవి మాత్రమే కాకుండా... ఆ రోజున చేసుకునే పదార్థాల్లో వీటినీ చేర్చుకుని చూడండి.


పంచరత్న హల్వా

కావలసినవి
ఖర్జూరాలు: పదిహేను, కిస్‌మిస్‌: పావుకప్పు, బెల్లంపొడి: అరకప్పు, చక్కెర: రెండు టేబుల్‌స్పూన్లు, తాజా కొబ్బరి తురుము: అరకప్పు, నెయ్యి: ఆరు చెంచాలు, బాదం, జీడిపప్పు పలుకులు: రెండు చెంచాలు.

తయారుచేసే విధానం
* ఖర్జూరాల్లోని గింజలు తీసేసి కిస్‌మిస్‌తో కలిపి స్టౌమీద పెట్టాలి. ఇందులో కాసిని నీళ్లు పోస్తే... కాసేపటికి ఖర్జూరాలూ కిస్‌మిస్‌ ఉడుకుతాయి. స్టౌ కట్టేసి జీడిపప్పు, బాదం పలుకులు, ఖర్జూరాలు, కిస్‌మిస్‌లను మిక్సీలో మెత్తగా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మరో గిన్నెలో రెండు చెంచాల నీళ్లూ చక్కెరా బెల్లంపొడి తీసుకుని స్టౌమీద పెట్టాలి. ఈ రెండూ కరిగి, ఉండ పాకంలా తయారవుతున్నప్పుడు కొబ్బరి తురుమూ రెండు చెంచాల నెయ్యీ ఖర్జూరాల ముద్ద వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇది హల్వాలా తయారవుతున్నప్పుడు... మూడు చెంచాల నెయ్యి వేసి దింపేయాలి. మిగిలిన నెయ్యిని వెడల్పాటి ప్లేటుకు రాసి, ఈ మిశ్రమాన్ని అందులో వేసి... చల్లగా అయ్యాక ముక్కల్లా కోస్తే చాలు.


పనీర్‌ పాయసం

కావలసినవి
చిక్కని పాలు: మూడుకప్పులు, పనీర్‌: అరకప్పు, చక్కెర: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు: అన్నీ కలిపి పావుకప్పు, గులాబీ నీరు: చెంచా, నెయ్యి: రెండు పెద్ద చెంచాలు.

తయారుచేసే విధానం
* పాలను ఓ గిన్నెలోకి తీసుకుని స్టౌమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు మెత్తగా చేసుకున్న పనీర్‌ అందులో వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. పాలు మరుగుతున్నప్పుడు చక్కెర వేయాలి. అది కరిగి, పాయసం చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడీ నేతిలో వేయించిన బాదం, పిస్తా జీడిపప్పు పలుకులూ, గులాబీనీరు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.


అటుకుల పొంగలి

కావలసినవి
అటుకులు: కప్పు, పెసరపప్పు: పావుకప్పు, బెల్లం తురుము: కప్పు, పాలు: కప్పు, నెయ్యి: అరకప్పు, నీళ్లు: కప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు: రెండూ కలిపి పావుకప్పు, యాలకులపొడి: చెంచా.

తయారుచేసే విధానం
* స్టౌమీద బాణలి పెట్టి చెంచా నెయ్యి వేయాలి. అది కరిగాక కడిగిన పెసరపప్పు వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాలయ్యాక పావుకప్పు నీళ్లు పోసి మెత్తగా అయ్యేవరకూ ఉడికించుకుని ఓ కప్పులోకి తీసుకుని పెట్టుకోవాలి. మరో బాణలిలో చెంచా నెయ్యి వేసి అటుకుల్ని వేయించుకోవాలి. అవి గోధుమరంగులోకి మారుతున్నప్పుడు మిగిలిన నీళ్లు పోయాలి.
* అటుకులు మెత్తగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ముద్దా బెల్లం తురుమూ పాలు పోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. అటుకులు ఉడికి, పొంగలిలా తయారయ్యాక యాలకులపొడీ మిగిలిన నెయ్యీ, జీడిపప్పూ కిస్‌మిస్‌ పలుకులు వేసి, అన్నింటినీ కలిపి దింపేయాలి.


గోధుమ కోవా లడ్డు

కావలసినవి
గోధుమపిండి: అరకేజీ, చక్కెరపొడి: రెండు కప్పులు, నెయ్యి: ఒకటిన్నర కప్పు, కోవా: కప్పు, సన్నగా తరిగిన బాదం, పిస్తా, కిస్‌మిస్‌ పలుకులు: అన్నీ కలిపి పావుకప్పు.

తయారుచేసే విధానం
* బాణలిని స్టౌమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక గోధుమపిండి వేసి కలుపుతూ ఉండాలి. పిండి ఎర్రగా వేగిందనుకున్నాక బాదం, పిస్తా, కిస్‌మిస్‌ పలుకులు, కోవా వేయాలి. రెండు నిమిషాలయ్యాక చక్కెరపొడి కూడా వేసి, స్టౌని సిమ్‌లో పెట్టి... కలుపుతూ ఉండాలి. ఇది ముద్దలా తయారవుతున్నప్పుడు దింపేసి, వేడి తగ్గాక లడ్డూల్లా చుట్టుకోవాలి.


బేసన్‌ బర్ఫీ

కావలసినవి
సెనగపిండి: కప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: ముప్పావు కప్పు, చక్కెర: పావుకప్పు, నెయ్యి: అరకప్పు, యాలకులపొడి: పావుచెంచా, బాదం, పిస్తా పలుకులు: అలంకరణకోసం.

తయారుచేసే విధానం
* బాణలిని స్టౌమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక స్టౌని సిమ్‌లో పెట్టి సెనగపిండి వేసి వేయించాలి. పది నిమిషాలయ్యాక కండెన్స్‌డ్‌మిల్క్‌ పోసి కలుపుతూ ఉంటే కాసేపటికి ముద్దలా తయారవుతుంది. అప్పుడు దింపేసి చక్కెరపొడి, యాలకులపొడి వేసి బాగా కలపాలి. నెయ్యిరాసిన ప్లేటులోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని పైన బాదం, పిస్తా పలుకులు అలంకరించి, ముక్కల్లా కోస్తే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని