వారెవ్వా... ఏం పూరీ..!

మైదాపిండిలో టేబుల్‌స్పూను నూనె వేసి కలపాలి. తరవాత మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి ఉండల్లా చేసుకుని చిన్న పూరీల్లా వత్తాలి ..

Published : 26 Jun 2021 15:35 IST

పుదీనా పూరీ

కావలసినవి
మైదాపిండి: కప్పు, పుదీనా: కట్ట, జీలకర్ర: అరటీస్పూను, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, నిమ్మరసం: అర టేబుల్‌స్పూను, పంచదార: ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం

* పుదీనా ఆకులు, జీలకర్ర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, టేబుల్‌స్పూను నీళ్లు కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
* మైదాపిండిలో టేబుల్‌స్పూను నూనె వేసి కలపాలి. తరవాత మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి ఉండల్లా చేసుకుని చిన్న పూరీల్లా వత్తాలి. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేయించి తీయాలి.


ఫార్సి పూరీ

కావలసినవి
కొబ్బరి తురుము: పావు కప్పు, పచ్చిమిర్చి: మూడు, అల్లం తురుము: టీస్పూను, నూనె: టేబుల్‌స్పూను, మైదా: కప్పు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుటీస్పూను, సెనగపిండి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, బొంబాయిరవ్వ: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను, కారం: చల్లడానికి సరిపడా
తయారుచేసే విధానం

* పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, కొంచెం ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. దీన్నిఓ గిన్నెలో వేసి టేబుల్‌స్పూను నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి.
* విడిగా మరో గిన్నెలో నెయ్యి, మైదా వేసి కలపాలి. అందులోనే సెనగపిండి, పసుపు, ఉప్పు, కొత్తిమీర తురుము, ఉప్పు, బొంబాయిరవ్వ, జీలకర్ర, నువ్వులు, నిమ్మరసం, సరిపడా నీళ్లు వేసి ముద్దలా కలపాలి. దీన్ని చిన్న చిన్న ఉండల్లా చేయాలి. ఇప్పుడు ఒక్కోదాన్నీ పూరీలా చేసి దానిమీద కొత్తిగా కొబ్బరి మిశ్రమాన్ని రాసి, త్రికోణాకారంలో మడవాలి. ఇప్పుడు బాణలిలో సరిపడా నూనె వేసి కాగాక కొన్ని కొన్ని చొప్పున పూరీలు వేసి వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని ప్లేటులో పెట్టి కారం చల్లి అందిస్తే సరి.


స్టఫ్‌డ్‌ షాహీ పూరీ

కావలసినవి
మెంతిఆకులు: ఒకటిన్నర కప్పులు, గోధుమపిండి: ఒకటిన్నర కప్పులు, బేకింగ్‌పౌడర్‌: పావుటీస్పూను, పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, స్టఫింగ్‌కోసం: పనీర్‌ తురుము: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం

* శుభ్రంగా కడిగిన మెంతి ఆకులమీద ఉప్పు చల్లి, ఓ పదిహేను నిమిషాలు పక్కన ఉంచాలి. తరవాత ఈ ఆకుల్లోని నీటిని పిండేయాలి. ఇప్పుడు దీన్ని పిండిలో వేసి, తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి ఉండల్లా చేసి పక్కన ఉంచాలి.
* సన్నగా తురిమిన పనీర్‌లో తురిమిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఒక్కో ఉండనీ పూరీలా వత్తి మధ్యలో టేబుల్‌స్పూను పనీర్‌ మిశ్రమం వేసి అంచుల్ని మడిచి, మళ్లీ దాన్ని పూరీలా వత్తాలి. ఇలాగే అన్నీ చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.


బంగాళాదుంప పూరీ

కావలసినవి
గోధుమపిండి: కప్పు, కార్న్‌ఫ్లోర్‌: కప్పు, బంగాళాదుంపలు: పావుకిలో, కొత్తిమీర తురుము: 4 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: అరటీస్పూను, వాము: అరటీస్పూను, కారం: పావు టీస్పూను, ఉప్పు: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం

* ఓ గిన్నెలో గోధుమపిండి, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, బంగాళాదుంప తురుము, కారం, వాము, జీలకర్ర, సన్నగా తురిమిన పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము అన్నీ వేసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా మంచినీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి ఓ ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి. తరవాత మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని మందపాటి పూరీల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.


స్టఫ్‌డ్‌ బెంగాలీ పూరీ

కావలసినవి

మైదాపిండి: 2 కప్పులు, లోపల నింపేందుకు: మినప్పప్పు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, సోంపుగింజలు: టీస్పూను, కశ్మీరీ ఎండుమిర్చి: రెండు, గరంమసాలా: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, పంచదార: అరటీస్పూను, ఉప్పు: అరటీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* మినప్పప్పుని నాలుగు గంటలు నానబెట్టాలి. మైదాపిండిలో కొంచెంకొంచెంగా నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి పూరీ పిండిలా కలపాలి.

* విడిగా పాన్‌లో ఎండుమిర్చి, అరటీస్పూను జీలకర్ర, అరటీస్పూను సోంపు, వేసి వేయించి తీసి చల్లారాక మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
* మిక్సీలో మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
* ఎండుమిర్చి వేయించిన పాన్‌లోనే కొద్దిగా నూనె వేసి మిగిలిన జీలకర్ర, సోంపు గింజలు వేసి వేగాక మినప్పప్పు ముద్ద వేసి బాగా కలపాలి. తరవాత ఎండుమిర్చి మసాలా, గరంమసాలా, పంచదార, ఉప్పు కూడా వేసి బాగా కలుపుతూ పప్పు మిశ్రమం గోధుమ రంగులోకి మారేవరకూ వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. చల్లారాక మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి.
* పూరీ పిండిని చిన్న ఉండల్లా చేసుకుని వత్తి మధ్యలో స్టఫ్‌డ్‌ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ పూరీలా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని