తవా పులావు... తింటే వదలరు..!

బాణలిలో 2 టీస్పూన్ల వెన్న వేసి జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేగాక, సన్నగా తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌, పచ్చిబఠాణీలు, బీన్స్‌ ముక్కలు వేసి అరటీస్పూను ఉప్పు చల్లి ..

Updated : 08 Jul 2021 20:24 IST

తవా పులావ్‌

కావలసినవి.. బాస్మతి బియ్యం: పావుకిలో, పసుపు: పావుటీస్పూను, వెన్న: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి(చిన్నది), అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, క్యారెట్‌: ఒకటి, క్యాప్సికమ్‌: రెండు, బఠాణీలు: రెండు టేబుల్‌స్పూన్లు, బీన్స్‌: ఆరు, టొమాటోలు: రెండు, బంగాళాదుంప: ఒకటి,
గరంమసాలా: 2 టీస్పూన్లు, కారం: పావుటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం
బియ్యం కడిగి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, టీస్పూను నూనె వేసి ఉడికించి ఉంచాలి.
బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేయాలి.
బాణలిలో 2 టీస్పూన్ల వెన్న వేసి జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేగాక, సన్నగా తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌, పచ్చిబఠాణీలు, బీన్స్‌ ముక్కలు వేసి అరటీస్పూను ఉప్పు చల్లి వేయించాలి. అవి కాస్త ఉడికిన తరవాత టొమాటోముక్కలు కూడా వేసి బాగా ఉడికిన తరవాత గరంమసాలా, కారం వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి, ఉడికించి ఉంచిన అన్నం కూడా వేసి బాగా కలిపి కొత్తిమీర తురుము చల్లి, నిమ్మరసం పిండి వడ్డించాలి.

పాలక్‌ పులావ్‌

కావలసినవి
బియ్యం: పావుకిలో, పాలకూర: 6 కట్టలు(చిన్నవి), ఉల్లిపాయ: ఒకటి, తాజాబఠాణీలు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: 4, అల్లం: అంగుళం ముక్క, జీలకర్ర: టీస్పూను, పులావ్‌ఆకు: ఒకటి, లవంగాలు: రెండు, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, కారం:టీస్పూను, పసుపు: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, ఉప్పు: టీస్పూను, నూనె లేదా నెయ్యి: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
ప్రెషర్‌కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. పులావ్‌ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క కూడా వేసి వేగాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. దంచిన పచ్చిమిర్చి ముద్ద, ఉల్లిముక్కలు వేసి వేగాక, సన్నగా తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. బఠాణీలు వేసి ఓ నిమిషం వేగాక పసుపు, ఉప్పు, కారం, గరంమసాలా వేసి కడిగిన బియ్యం కూడా వేసి కలిపి సుమారు అరలీటరు నీళ్లు పోసి మూతపెట్టి మూడు విజిల్స్‌ రానిచ్చి దించాలి.

 

అచరి పనీర్‌ పులావ్‌

కావలసినవి
పనీర్‌ ముక్కలు: ఒకటిన్నర కప్పులు, బియ్యం: కప్పు, నూనె: టేబుల్‌స్పూను, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఉల్లిగింజలు: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, కారం: టీస్పూను, పెరుగు: అరకప్పు, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, దాల్చినచెక్క: 2 అంగుళాల ముక్క, లవంగాలు:రెండు, షాజీరా: అరటీస్పూను, యాలకులు: రెండు, నూనె: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
అన్నం విడిగా ఉడికించి ఆరనివ్వాలి.
బాణలిలో టీస్పూను నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిగింజలు వేసి వేయించాలి. తరవాత పసుపు, కారం వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద కూడా వేసి బాగా కలిపి పనీర్‌ ముక్కలు వేసి ఒకసారి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
మరో బాణలిలో మిగిలిన నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు వేసి ఓ నిమిషం వేగాక ఉడికించిన అన్నం వేసి కలపాలి. ఇప్పుడు పక్కన ఉంచిన పనీర్‌ ముక్కల్ని వేసి బాగా కలిపి మీడియం మంటమీద రెండు నిమిషాలు ఉడికించి, కొత్తిమీర చల్లి దించాలి.

 

మష్రూమ్‌ పులావ్‌

కావలసినవి
బాస్మతి బియ్యం: పావుకిలో, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, లవంగాలు: రెండు, యాలకులు: ఒకటి, దాల్చినచెక్క: అంగుళంముక్క, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, అల్లం: అంగుళంముక్క, మిరియాలపొడి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, బటన్‌ పుట్టగొడుగులు: పావుకిలో

తయారుచేసే విధానం
బియ్యం కడిగి నాననివ్వాలి.
వెల్లుల్లి, అల్లం, మిరియాలు తగినన్ని నీళ్లు పోసి మెత్తని ముద్దలా రుబ్బాలి.
ప్రెషర్‌ పాన్‌లో నెయ్యి వేసి కాగాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేగాక రుబ్బిన మసాలా ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు కోసిన పుట్టగొడుగు ముక్కలు వేసి పది నిమిషాలు వేగనివ్వాలి. తరవాత కడిగి వడబోసి ఉంచిన బియ్యం, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి మూడు విజిల్స్‌ రానివ్వాలి. మూత తీశాక ఓసారి కలిపి వడ్డించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని