కల్యాణ రామునికి... కమ్మగా!

‘రామా కనవేమిరా...’ అంటూ రాగయుక్తంగా ఆ సీతాపతిని స్తుతిస్తూ శ్రీరామనవమినాడు పానకం, వడపప్పు, చలిమిడి... వంటి వంటకాలను నివేదించడం అందరికీ తెలిసిందే. వాటికి మరికొన్ని రుచుల్నీ జోడిస్తే...

Published : 27 Jun 2021 15:51 IST

‘రామా కనవేమిరా...’ అంటూ రాగయుక్తంగా ఆ సీతాపతిని స్తుతిస్తూ శ్రీరామనవమినాడు పానకం, వడపప్పు, చలిమిడి... వంటి వంటకాలను నివేదించడం అందరికీ తెలిసిందే. వాటికి మరికొన్ని రుచుల్నీ జోడిస్తే...

కొబ్బరి పూర్ణాలు

కావలసినవి
మినప్పప్పు: కప్పు, బియ్యం: 2 కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, పూర్ణం కోసం: బెల్లం తురుము: కప్పు, మంచినీళ్లు: పావుకప్పు, కొబ్బరి తురుము: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: టీస్పూను

తయారుచేసే విధానం
* బియ్యం, మినప్పప్పు విడివిడిగా సుమారు ఐదు గంటలు నాననివ్వాలి. తరవాత నీళ్లు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. పిండి మరీ పలుచగానూ మరీ జారుగానూ కాకుండా రుబ్బుకోవాలి. తరవాత కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఉంచాలి.
* పాన్‌లో బెల్లం తురుము వేసి, నీళ్లు పోసి సిమ్‌లో పెట్టి కరిగించాలి. బెల్లం కరిగిన తరవాత వడబోయాలి. ఇప్పుడు దీన్ని మళ్లీ పాన్‌లో పోసి, అందులోనే కొబ్బరి తురుము వేసి తిప్పుతూ సుమారు పావుగంటసేపు ఉడికించాలి. దగ్గరగా ఉడికిన తరవాత యాలకులపొడి వేసి బాగా కలిపి మిశ్రమాన్ని ఉండల్లా చేయాలి. ఈ ఉండల్ని ముందే రుబ్బి ఉంచిన బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేగాక తీయాలి.


పండ్ల పంచామృతం!

కావలసినవి
పాలు: అరకప్పు, పెరుగు: అరకప్పు, బెల్లం తురుము: పావుకప్పు, తేనె: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, పండ్లముక్కలు (దానిమ్మగింజలు, ద్రాక్షపండ్లు, ఆపిల్‌, కమలా, అరటిపండ్ల ముక్కలు): కప్పు

తయారుచేసే విధానం
* పాలు, పెరుగు, బెల్లం తురుము, తేనె, నెయ్యి వేసి బాగా కలపాలి. తరవాత సన్నగా తరిగిన పండ్లముక్కలు, దానిమ్మగింజలు వేసి కలిపితే పండ్ల పంచామృతం రెడీ.


గట్టి వడలు

కావలసినవి
బియ్యప్పిండి: 2 కప్పులు, పుట్నాలపప్పుల పొడి: పావుకప్పు, మినప్పిండి (మినప్పప్పుని వేయించి పిండి చేయాలి): పావుకప్పు, సెనగపప్పు, పెసరప్పప్పు: 3 టేబుల్‌స్పూన్ల చొప్పున, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, కారం: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: కట్ట, మంచినీళ్లు: పిండి కలపడానికి సరిపడా, నూనె: తగినంత

తయారుచేసే విధానం
* వెడల్పాటి బేసిన్‌లో బియ్యప్పిండి, పుట్నాలపప్పులపొడి, మినప్పిండి, వెన్న వేసి కలపాలి.
* తరవాత అందులోనే నానబెట్టిన సెనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, కరివేపాకు తురుము వేసి కలిపాక తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు పిండి ముద్దను చిన్న ఉండల్లా చేసి, చేతులకి నెయ్యి రాసుకుంటూ ప్లాస్టిక్‌ షీటుమీద చిన్న చిన్న చెక్కల్లా వత్తి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.


స్టఫ్‌డ్‌ గులాబ్‌జామ్‌

కావలసినవి
కోవా: కప్పు, పనీర్‌ తురుము: పావుకప్పు, మైదాపిండి: 5 టేబుల్‌స్పూన్లు, వంటసోడా: చిటికెడు, లోపల నింపేందుకు: బాదం: పది, పిస్తా: పది, జీడిపప్పు: పది, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా పాకం కోసం: పంచదార: 3 కప్పులు, యాలకులపొడి: అరటీస్పూను, రోజ్‌ఎసెన్స్‌: 2 చుక్కలు

తయారుచేసే విధానం
* ముందుగా కోవా, పనీర్‌ తురుములని విడివిడిగా బాగా మెత్తగా చేయాలి. అందులోనే వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసి ఉండ చేయడానికి వచ్చేలా మృదువుగా కలపాలి.
* చిన్నగిన్నెలో కలిపిన పిండి మిశ్రమంలోంచి కొద్దిగా (సుమారు నిమ్మకాయంత) పక్కకు తీసి అందులో సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కల్ని వేసి కలిపి ఉంచాలి.
* పిండి మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి బిళ్లల్లా వత్తి, దాని మధ్యలో బాదం, పిస్తా జీడిపప్పు ముక్కల మిశ్రమాన్ని కొంచెం పెట్టి మళ్లీ గుండ్రంగా చేయాలి. ఇలాగే అన్నీ చేయాలి.
* విడిగా మందపాటి గిన్నెలో పంచదార వేసి మునిగేవరకూ నీళ్లు పోసి మరిగిన తరవాత యాలకులపొడి, రోజ్‌ఎసెన్స్‌ వేసి కలిపి ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగిన తరవాత సిమ్‌లో పెట్టి ఉండల్ని వేసి ఎర్రగా వేయించి పాకంలో వేసి కాసేపు ఉంచితే సరి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని