చలువ కూరల రుచి పెరుగుతుంది!

ఎండల్లో చలువ చేసే పదార్థాలకుండే డిమాండ్‌ తెలిసిందేగా! అలాగని పెరుగు, మజ్జిగలతోనే కాలక్షేపం చేయలేం కదా! ఇదిగో వీటిని జోడించండి.. పోషకాలూ, రుచిని బోనస్‌గా అందించే పెరుగు పచ్చళ్లు చేసేయండి..

Published : 21 May 2023 00:22 IST

ఎండల్లో చలువ చేసే పదార్థాలకుండే డిమాండ్‌ తెలిసిందేగా! అలాగని పెరుగు, మజ్జిగలతోనే కాలక్షేపం చేయలేం కదా! ఇదిగో వీటిని జోడించండి.. పోషకాలూ, రుచిని బోనస్‌గా అందించే పెరుగు పచ్చళ్లు చేసేయండి..


బెండకాయతో

కావాల్సినవి: బెండకాయలు- ఎనిమిది, ఎండుమిర్చి- 3, ఉల్లిపాయ-1, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- ఒకటి, ఆవాలు- పావుచెంచా, పసుపు- పావుచెంచా, ఇంగువ- అరచెంచా, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, చిక్కని పెరుగు- కప్పు

తయారీ: ముందుగా కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని బెండకాయ ముక్కల్ని తక్కువ మంట మీద బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వీటిని బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో ఒక చెంచా నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. దీనిలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ముద్ద, ఇంగువ, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనివ్వాలి. స్టౌ కట్టేసి కాస్త చల్లారనిచ్చి బెండకాయ ముక్కలు, కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకుంటే బెండకాయ పెరుగు పచ్చడి సిద్ధం.


దొండకాయతో

కావాల్సినవి: అల్లం- రెండు ఇంచుల ముక్క, పచ్చిమిర్చి- 3, కొత్తిమీర- కొద్దిగా, నూనె- ఒక చెంచా, తాలింపు గింజలు- చెంచా, ఎండుమిర్చి-2, కరివేపాకు- రెమ్మ, పసుపు- అర చెంచా, గుండ్రంగా తరిగిన దొండకాయలు- పావు కిలో, ఉప్పు- తగినంత, చిలికిన పెరుగు- 300 గ్రా, నీళ్లు- అర కప్పు  

తయారీ: ముందుగా మిక్సీలోకి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో తాలింపు దినుసులు వేసి వేయించి తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత దొండకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. దొండకాయ ముక్కలను ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించాలి. తరువాత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ వేసి కలపాలి. 2 నిమిషాలు వేయించిన తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి. దొండకాయ ముక్కలు చల్లారాక చిలికిన పెరుగు, కాసిని నీళ్లు వేసి కలపాలి. ఈ పెరుగు పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.


మెంతికూర పెరుగు పచ్చడి

కావాల్సినవి: పెరుగు- కప్పున్నర, ఉప్పు- రుచికి తగినంత, మెంతులు- పావుచెంచా, మెంతికూర- కట్ట, ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- పావుచెంచా, ఎండుమిర్చి- రెండు, ఉల్లిపాయ- ఒకటి, పసుపు- కొద్దిగా, పచ్చిమిర్చి- రెండు, కరివేపాకు- రెమ్మ, నూనె- చెంచా

తయారీ: పెరుగుని ఉండల్లేకుండా చిలికి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, కాసిని నీళ్లు పోసి మళ్లీ ఒక్కసారి చిలికి పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడిచేసుకుని ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతి ఆకులు వేసి వేయించుకోవాలి. అవి బాగా దోరగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూడు నిమిషాలపాటు వేగనిచ్చి చివరిగా పసుపు వేసి మంట తగ్గించి పెరుగు కలపాలి. మెంతికూర పెరుగు పచ్చడి సిద్ధం.


మాగాయ పెరుగు పచ్చడి

కావాల్సినవి: తాజా మాగాయ్‌ - 2 చెంచాలు, పెరుగు- కప్పు, ఉల్లిపాయ- సగం(సన్నగా తరిగి పెట్టుకోవాలి) , ఆవాలు- పావుచెంచా, నూనె- చెంచా, ఉప్పు- రుచికి తగినంత,

తయారీ: ఒక గిన్నెలో పెరుగు ఉండల్లేకుండా మెత్తగా చిలికి పెట్టుకోవాలి. మాగాయిని చేత్తోకానీ, మిక్సీలో కానీ వేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిలికిన పెరుగులో మాగాయ, ఉప్పు మరియు ఉల్లిపాయల ముక్కల్ని వేసి బాగా కలపాలి. పచ్చడి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనెపోసి.. ఆవాలు వేసి అవి చిటపటలాడేవరకూ వేయించుకోవాలి. పచ్చడిలో ఈ ఆవాల్నీ, నూనెని వేస్తే మాగాయ పెరుగు పచ్చడి సిద్ధం. ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, ఉప్మాలతో పాటు పప్పు కూరల్లోకీ బాగుంటుంది.


మామిడికాయతో..

కావాల్సినవి: పెరుగు- ఒకటిన్నర కప్పు, పచ్చి మామిడికాయ- ఒకటి, చిన్న ఉల్లిపాయలు- నాలుగు, పచ్చిమిర్చి- 2, పసుపు- పావుచెంచా, ఉప్పు- రుచికి తగినంత, ఆవాలు- పావుచెంచా, మినపప్పు- చెంచా, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- అరచెంచా, కరివేపాకు- రెమ్మ, నూనె- చెంచా

తయారీ: కడాయిలో నూనె వేసుకుని, తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. అందులో మినపప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి. దానిలో ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత మామిడిముక్కలు, పసుపు వేసి మరో మూడు నిమిషాలు వేగనివ్వాలి. దీనికి తగినంత ఉప్పు వేసి మంట తగ్గించుకుని చిలికిన పెరుగు, కాసిని నీళ్లు కలిపి ఉప్పు సరిచూసుకుని స్టౌ కట్టేయడమే. చివరిగా కొద్దిగా కొత్తిమీర కలుపుకొంటే మామిడికాయ పెరుగు పచ్చడి సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని