మీఠాచట్నీ... మస్త్‌మజా!

బజార్లో మామిడికాయలు దొరికే సీజను ఇదే కాబట్టి వారంలో వీలైనన్ని రోజులు వాటితో చేసుకునే పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మనమందరం చేసేదే. ఈసారి ఎప్పుడూ చేసుకునే  పదార్థాలతోపాటూ ఈ రుచుల్నీ వండుకుందాం రండి.

Published : 26 Jun 2021 13:19 IST

బజార్లో మామిడికాయలు దొరికే సీజను ఇదే కాబట్టి వారంలో వీలైనన్ని రోజులు వాటితో చేసుకునే పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మనమందరం చేసేదే. ఈసారి ఎప్పుడూ చేసుకునే  పదార్థాలతోపాటూ ఈ రుచుల్నీ వండుకుందాం రండి.


కొబ్బరిపాల కూర

కావలసినవి: చెక్కుతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు, పసుపు: అరచెంచా, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, అల్లం తరుగు: చెంచా, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు రెబ్బలు: మూడు వెనిగర్‌: చెంచా, ధనియాలపొడి: రెండుచెంచాలు, గరంమసాలా: చిటికెడు, చిక్కని కొబ్బరిపాలు: మూడు కప్పులు, పల్చని కొబ్బరిపాలు: పావుకప్పు, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: రెండు.

తయారీ విధానం: మామిడికాయ ముక్కలపైన పావుచెంచా చొప్పున పసుపు, కారం, ఉప్పు వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఉల్లిపాయముక్కలు, అల్లంతరుగు, పచ్చిమిర్చి, రెండు రెబ్బల కరివేపాకు, వెనిగర్‌, రెండు చెంచాల నూనె, కొద్దిగా ఉప్పు, ధనియాలపొడి, గరంమసాలా తీసుకుని కలుపుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మామిడిముక్కలూ, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం, పల్చని కొబ్బరిపాలు పోసుకోవాలి. మామిడిముక్కలు ఉడికాక చిక్కని కొబ్బరిపాలు
పోయాలి. అవీ ఉడికి, కూర చిక్కగా అయ్యాక కొద్దిగా ఉప్పు, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. మరో స్టౌమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేసి ఎండుమిర్చి, మిగిలిన కరివేపాకు వేయించి కూరపైన వేసి దింపేయాలి.


మీఠా చట్నీ

కావలసినవి: కొద్దిగా పండిన మామిడికాయలు: రెండు, జీలకర్ర, సోంపు, ఆవాలు, ఉల్లిగింజలు, మెంతులు: అన్నీ కలిపి చెంచా, బెల్లం తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: టేబుల్‌స్పూను, అల్లం తరుగు: అరచెంచా, కారం: అరచెంచా, గరంమసాలా: చిటికెడు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ముందుగా జీలకర్ర, సోంపు, ఆవాలు, ఉల్లిగింజలు, మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించుకుని అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. మామిడికాయల చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మంట తగ్గించి... ముందుగా చేసుకున్న జీలకర్ర మసాలా, అల్లం తరుగు వేసి వేయించాలి. నిమిషం తరువాత మామిడి ముక్కలు, గరంమసాలా, కారం, ఇంగువ వేసి బాగా కలపాలి. మామిడి ముక్కలు మెత్తగా అయ్యాక బెల్లం తరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి, చట్నీ చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇది దోశలూ, చపాతీల్లోకి బాగుంటుంది.


కైరీచీ దాల్‌

కావలసినవి: సెనగపప్పు: కప్పు (గంట ముందు నానబెట్టుకోవాలి), మామిడి కాయ: ఒకటి, తాజా కొబ్బరి తురుము: రెండుటేబుల్‌స్పూన్లు, పసుపు: పావుచెంచా, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, ఆవాలు: చెంచా, నూనె: పావుకప్పు, ఇంగువ: చిటికెడు కారం: అరచెంచా.

తయారీ విధానం: నానబెట్టిన సెనగపప్పును మిక్సీలో తీసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి నూనె వేసి ఆవాలు, ఇంగువ వేయించాలి. అవి వేగాక సెనగపప్పు మిశ్రమం, మామిడి తురుము, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. సెనగపప్పు బాగా వేగాక కారం, కొత్తిమీర తరుగు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


మ్యాంగోఫిష్‌ కర్రీ

కావలసినవి: పచ్చి మామిడికాయ: ఒకటి, ఏదయినా ఒకరకం చేప ముక్కలు: అయిదు, వెల్లుల్లి తరుగు: అరచెంచా, అల్లం తరుగు: చెంచా, ఉల్లిపాయముక్కలు: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు: రెండు,  నిలువుగా తరిగిన పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు.
మసాలాకోసం: కొబ్బరి తురుము: అరకప్పు, పసుపు: పావుచెంచా, ధనియాలపొడి: చెంచా, కారం: ఒకటిన్నర చెంచా.తాలింపుకోసం: నూనె: చెంచా, ఆవాలు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయలు: రెండు చిన్నవి.
తయారీ విధానం: మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా గ్రైండ్‌     చేసుకోవాలి. ఓ గిన్నెను స్టౌమీద పెట్టి నూనె వేసి అల్లం, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మామిడిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. నిమిషమయ్యాక కొబ్బరి మిశ్రమం, తగినంత ఉప్పు వేసి, పావుకప్పు నీళ్లు పోయాలి. మామిడి ముక్కలు మెత్తగా అయ్యాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. అవీ ఉడికి, కూర దగ్గరగా అవుతున్నప్పుడు మంట తగ్గించాలి. మరో స్టౌమీద ఓ  కడాయిని పెట్టి నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేయించి కూర మీద వేసి నిమిషం తరువాత స్టౌ కట్టేయాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని