దుర్గమ్మకు తియ్యన్నం!

నవరాత్రుల్లో రోజుకో నైవేద్యంతో కొలిచిన దుర్గామాతను విజయదశమినాడు ఆ నవ వంటకాలతోబాటు మరికొన్ని నివేదనలతో సంతుష్ఠిపరిచి మరీ అమ్మను సాగనంపుతారు. అలాంటి వాటిల్లో కొన్ని...

Updated : 14 Oct 2022 10:32 IST

నవరాత్రుల్లో రోజుకో నైవేద్యంతో కొలిచిన దుర్గామాతను విజయదశమినాడు ఆ నవ వంటకాలతోబాటు మరికొన్ని నివేదనలతో సంతుష్ఠిపరిచి మరీ అమ్మను సాగనంపుతారు. అలాంటి వాటిల్లో కొన్ని...

పెసరపప్పు పాయసం

కావలసినవి
పెసరపప్పు: కప్పు, మంచినీళ్లు: కప్పు, పాలు: అరలీటరు, కొబ్బరిపాలు: అరకప్పు, బెల్లం తురుము: అరకప్పు, యాలకులపొడి: టీస్పూను, జీడిపప్పు, ఎండుద్రాక్ష: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: తగినంత
తయారుచేసే విధానం
* బాణలిలో పెసరపప్పు వేసి వేయించాలి.

* తరవాత దాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో పెసరపప్పు వేసి ఓ కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరవాత ఓసారి మెదిపి, పప్పులో కావలసిన చిక్కదనం మేరకు పాలు పోసి కలుపుతూ ఉడికించాలి.
* ఓ గిన్నెలో బెల్లం తురుము వేసి సరిపడా నీళ్లు పోసి, సిమ్‌లో పెట్టి కరిగించి, దించి వడబోసి, కాస్త చల్లారిన తరవాత పెసరపప్పు పాయసంలో పోసి యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా పోసి సిమ్‌లో ఉండలు కట్టకుండా * రెండు నిమిషాలు కలిపి దించాలి. విడిగా చిన్న బాణలిలో నెయ్యి వేసి ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి వేయించి పాయసంలో కలిపితే సరి.

తీపి కొబ్బరి అన్నం

కావలసినవి
బియ్యం: కప్పు, తాజా కొబ్బరి తురుము: ఒకటిన్నర కప్పులు, యాలకులపొడి: అరటీస్పూను, లవంగాలు: నాలుగు, బెల్లంతురుము: ఒకటిన్నర కప్పులు, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: 2 కప్పులు
తయారుచేసే విధానం

* బియ్యం కడిగి ఓ గంటసేపు పక్కన ఉంచాలి.
* ప్రెషర్‌ పాన్‌ లేదా నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి సిమ్‌లో పెట్టి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. తరవాత లవంగాలు కూడా వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు కడిగి నీళ్లు వంపేసిన బియ్యం కూడా వేసి సిమ్‌లో రెండు నిమిషాలు వేయించాలి. తరవాత మంచినీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు తురిమిన బెల్లం, తాజా కొబ్బరి తురుము వేసి కలిపి సిమ్‌లో సుమారు పది నిమిషాలు ఉడికించి చివరగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి దించాలి.

రవ్వ గారెలు

కావలసినవి

బొంబాయి రవ్వ: కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, అల్లం తురుము: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు తురుము: కొద్దిగా, జీలకర్ర: అరటీస్పూను, మిరియాలు: పది (కచ్చాపచ్చాగా నూరాలి), పెరుగు: అరకప్పు, బేకింగ్‌ సోడా: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం

ఓ గిన్నెలో రవ్వ వేయాలి. అందులోనే ఉల్లిముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము వేసి కలపాలి. తరవాత జీలకర్ర, నూరిన మిరియాలు వేసి కలపాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసి కలిపి, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి కలపాలి. మిశ్రమాన్ని కలిపిన తరవాత మూతపెట్టి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు రెండు టేబుల్‌స్పూన్ల నీళ్లు పోసి మళ్లీ కలిపి మరో ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు మిశ్రమాన్ని మరోసారి కలిపి చేతులకి నెయ్యి రాసుకుని పిండిని కొంచెంకొంచెంగా తీసుకుని ప్లాస్టిక్‌ కవర్‌ లేదా అరటిఆకుమీద గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

గోంగూర పులిహోర

కావలసినవి

అన్నం: 4 కప్పులు, పసుపు: అరటీస్పూను, పేస్టుకోసం: గోంగూర ఆకులు: 4 కప్పులు, ఆవాలు: టీస్పూను, మెంతులు: అరటీస్పూను, ఎండుమిర్చి: రెండు, తాలింపుకోసం: ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, మినప్పప్పు: టేబుల్‌స్పూను, సెనగపప్పు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: నాలుగు, పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: మూడు, ఇంగువ: చిటికెడు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: 4 రెబ్బలు
తయారుచేసే విధానం

* వెడల్పాటి బేసిన్‌లో ఉడికించిన అన్నం వేసి అందులో పసుపు, టీస్పూను నూనె, ఉప్పు, రెండు కరివేపాకు రెబ్బలు వేసి కలిపి పక్కన ఉంచాలి.
* బాణలిలో టీస్పూను నూనె వేసి అందులో టీస్పూను ఆవాలు, మెంతులు వేసి వేగాక గోంగూర ఆకులు కూడా వేసి మెత్తగా మగ్గనివ్వాలి. చల్లారాక వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, ఈ ముద్దను అన్నంలో వేసి కలపాలి.
* విడిగా బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగాక మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఇప్పుడు దీన్ని చల్లార్చిన అన్నంలో వేసి కలిపితే సరి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని