సమోసా.. తియ్యగా..!

రాఖీపౌర్ణమి రోజున అన్న లేదా తమ్ముడికి కట్టే రాఖీని ఆచీతూచీ ఎంచుకుంటున్నప్పుడు వాళ్లకు పెట్టే స్వీట్‌ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలిగా...

Updated : 29 Nov 2022 13:35 IST

రాఖీపౌర్ణమి రోజున అన్న లేదా తమ్ముడికి కట్టే రాఖీని ఆచీతూచీ ఎంచుకుంటున్నప్పుడు వాళ్లకు పెట్టే స్వీట్‌ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలిగా... అందుకే  స్వయంగా వండి నోటిని తీపి చేసేయండి. 


స్వీట్‌ సమోసా

కావలసినవి: మైదా: రెండు కప్పులు, బొంబాయిరవ్వ: చెంచా, నెయ్యి: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా. స్టఫింగ్‌కోసం: కోవా: కప్పు, చక్కెరపొడి: అరకప్పు, కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, యాలకులపొడి: చెంచా, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు. పాకం కోసం: నీళ్లు: పావుకప్పు, చక్కెర: కప్పు
తయారీవిధానం: ముందుగా ఓ గిన్నెలో మైదా, బొంబాయిరవ్వ వేసుకుని బాగా కలపాలి. తరవాత నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా కలిపి ఓ చెంచా నెయ్యి వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు పలుకులు వేసి వేయించి తరువాత కోవా, చక్కెర, కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. మరో గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా అవుతున్నప్పుడు దింపేయాలి. నానిన పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తి మధ్యకు కోయాలి. అలా కోసిన చపాతీ ముక్క మధ్యలో ఒకటిన్నర చెంచా కోవా మిశ్రమాన్ని ఉంచి... సమోసా ఆకృతి వచ్చేలా అంచుల్ని మూసేయాలి. ఇలా అన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని రెండు నిమిషాలయ్యాక చక్కెరపాకంలో ముంచి తీయాలి.


నువ్వుల లడ్డు

కావలసినవి: తెల్ల నువ్వులు: అరకప్పు, కోవా: అరకప్పు, బెల్లం పొడి: ముప్పావుకప్పు, నెయ్యి: పావుకప్పు.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నువ్వుల్ని వేయించుకుని తీసుకోవాలి. అవి వేడి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద  కడాయి పెట్టి కోవా వేయాలి. అది మెత్తగా అయ్యాక స్టౌ కట్టేసి నువ్వులపొడి, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అన్నీ కలిశాయనుకున్నాక నెయ్యి చల్లుకుంటూ ఉండల్లా చుట్టాలి. 


క్యారెట్‌ పనీర్‌ ఖీర్‌

కావలసినవి: చిక్కనిపాలు: రెండు కప్పులు, కొబ్బరిపాలు: అరకప్పు, పనీర్‌: అరకప్పు, క్యారెట్లు: రెండు, యాలకులపొడి: అరచెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: అన్నీ కలిపి పావుకప్పు, నెయ్యి: రెండు పెద్ద చెంచాలు, చక్కెర: కప్పు.
తయారీవిధానం: ముందుగా క్యారెట్లను ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలు తీసుకుని స్టౌ మీద పెట్టాలి. అవి మరిగాక చక్కెర, పనీర్‌ తురుము వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక క్యారెట్‌ ముద్ద, కొబ్బరిపాలు, యాలకులపొడి వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇది చిక్కబడుతున్నప్పుడు నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి దింపేస్తే చాలు.


డ్రై ఫ్రూట్‌ హల్వా

కావలసినవి: మొక్కజొన్నపిండి: అరకప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పు, నెయ్యి: పావుకప్పు, బాదం, కిస్‌మిస్‌, పిస్తా పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా.
తయారీవిధానం: ముందుగా ఒకటిన్నర కప్పు నీటిలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్‌ పెట్టి చక్కెర వేసి కప్పు నీళ్లు పోయాలి. చక్కెర కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు మొక్కజొన్న మిశ్రమం వేసి బాగా కలిపి మంటను మీడియంలో పెట్టాలి. అయిదు నిమిషాల తరువాత కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నెయ్యి పూర్తిగా అయిపోయాక డ్రైఫ్రూట్స్‌ పలుకులు, యాలకులపొడి వేసి బాగా కలపాలి. కాసేపటికి ఈ మిశ్రమం చిక్కగా అవుతుంది. అప్పుడు స్టౌ కట్టేసి నెయ్యి రాసిన ప్లేటులోపోసి ముక్కల్లా కోయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని