మిఠాయిల వేడుక!

రంగవల్లికలూ దీపకాంతుల వరసలూ బాణసంచా వెలుగులూ తియ్యతియ్యని మిఠాయిలూ... వహ్వా... దీపావళి!

Published : 26 Jun 2021 16:11 IST

రంగవల్లికలూ దీపకాంతుల వరసలూ బాణసంచా వెలుగులూ తియ్యతియ్యని మిఠాయిలూ... వహ్వా... దీపావళి!

కడా ప్రసాద్‌

కావలసినవి:
గోధుమపిండి: కప్పు, పంచదార: కప్పు, నెయ్యి: కప్పు, మంచినీళ్లు: 3 కప్పులు

తయారుచేసే విధానం
* బాణలిలో పంచదార వేసి, మంచినీళ్లు పోసి మరిగిన తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అది మరిగే సమయంలో మరో బాణలిలో మందపాటి బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగిన తరవాత గోధుమపిండి వేసి ఉండలు కట్టకుండా వేయించాలి. పిండి రంగు మారి మంచి వాసన రానివ్వాలి. ఇప్పుడు పాకాన్ని రెండు భాగాలుగా చేసి ముందుగా ఓ భాగాన్ని గోధుమపిండిలో వేసి  కలపాలి. అది బాగా కలిసి బుడగలు వచ్చాక రెండో భాగాన్ని కూడా కలిపి హల్వాలోంచి నెయ్యి బయటకు వచ్చేవరకూ తిప్పుతూ ఉడికించాలి. దగ్గరగా ఉడికిన తరవాత దించి వడ్డించాలి.

బాసుంది

కావలసినవి
కండెన్స్‌డ్‌ మిల్క్‌: 400 గ్రా., క్రీమ్‌ మిల్క్‌: లీటరు, యాలకులు: ఐదు, జీడిపప్పు: 15, పిస్తా: 15, బాదం: 15, కుంకుమపువ్వు: కొద్దిగా, జాజికాయ పొడి: చిటికెడు

తయారుచేసే విధానం
* మందపాటి బాణలిలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి సిమ్‌లో మరిగించాలి. అంటుకోకుండా సుమారు 25 నిమిషాలపాటు గరిటెతో తిప్పాలి. తరవాత జాజికాయ పొడి, సన్నగా తరిగిన నట్స్‌, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలిపి మరో రెండు నిమిషాలు సిమ్‌లోనే ఉంచి దించాలి. దీన్ని వేడిగానూ చల్లగానూ తినొచ్చు.

బాదం లడ్డూ

కావలసినవి
బాదం: కప్పు, బెల్లం తురుము: అరకప్పు, ఎండుద్రాక్ష: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు: మూడు

తయారుచేసే విధానం
* మందపాటి బాణలిలో బాదం వేసి సిమ్‌లో మెల్లగా వేయించాలి. అవి వేగాక దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు వాటికి ఎండుద్రాక్ష, యాలకులు జోడించి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. చివరగా బెల్లం పొడి వేసి మరోసారి తిప్పాలి. ఇప్పుడు వీటిని కోరిన సైజులో లడ్డూల్లా చుట్టాలి.

మాల్పువా

కావలసినవి
మైదాపిండి: ఒకటిన్నర కప్పులు, యాలకులపొడి: అర టీస్పూను, సోంపు: టీస్పూను, పాలు: ఒకటిన్నర కప్పులు, నెయ్యి: వేయించడానికి సరిపడా, పాలపొడి లేదా కోవా: 3 టేబుల్‌స్పూన్లు పంచదార పాకం కోసం:పంచదార: అరకప్పు, మంచినీళ్లు: పావుకప్పు, నిమ్మరసం: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో పాలు, పాలపొడి లేదా కోవా వేసి కలపాలి. తరవాత అందులోనే మైదా, సోంపు, యాలకులపొడి వేసి కలపాలి. అవసరమైతే మరికాసిని పాలు పోసి పకోడీల పిండిలా జారుగా కలపాలి. ఇప్పుడు దీన్ని సుమారు నాలుగు గంటలపాటు నాననివ్వాలి.
* బాణలిలో పంచదార, మంచినీళ్లు పోసి మీడియం మంట మీద మరిగించి సన్నని తీగ పాకం రానివ్వాలి. తరవాత నిమ్మరసం కూడా కలిపి చిక్కబడకుండా వేడినీటి గిన్నెలో ఉంచాలి.
* బాణలిలో నెయ్యి వేసి కాగాక గరిటెతో మాల్పువాల్ని వేసి వేయించాలి. రెండువైపులా వేగాక తీసి వీటిని పంచదార పాకంలో వేసి పది నిమిషాలు ఉంచి తీసి పిస్తా ముక్కలతో అలంకరించాలి.

మిల్క్‌ గులాబ్‌జామ్‌

కావలసినవి
పాలపొడి: కప్పు, మైదాపిండి: టేబుల్‌స్పూను, బేకింగ్‌ పౌడర్‌: చిటికెడు, నెయ్యి: టేబుల్‌స్పూను, పాలు: 5 టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: పది, పిస్తా: పది, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా, పంచదార పాకం కోసం: పంచదార: కప్పు, మంచినీళ్లు: అరకప్పు, యాలకులు: ఐదు, నిమ్మకాయ: ఒకటి

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో పాలపొడి, మైదాపిండి, బేకింగ్‌పౌడర్‌ వేసి కలపాలి. తరవాత నెయ్యి వేసి మిశ్రమాన్ని బాగా కలిపి, రెండు టేబుల్‌స్పూన్ల పాలు పోసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా మిగిలిన పాలు పోసి కలపాలి.
* పిస్తా, జీడిపప్పులను సన్న ముక్కలుగా కోసి, వీటికి యాలకులపొడి, రెండు టీస్పూన్ల గులాబ్‌జామూన్‌ మిశ్రమం జోడించి కలపాలి.
* అరచేతులకు నెయ్యి రాసుకుని పిండిని కొంచెంకొంచెంగా తీసుకుని ఉండలా చేసి దాని మధ్యలో నట్స్‌ మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసి ఉంచాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి.
* బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి దాన్ని కాగనివ్వాలి. అదే సమయంలో పక్కనే మరో గిన్నెలో పంచదార, నీళ్లు పోసి మరిగించాలి. యాలకులపొడి కూడా కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు కాగిన నూనెలో జామూన్‌లు కొన్ని కొన్ని వేసి వేయించి తీసి పాకంలో వేసి నాననివ్వాలి.

27 అక్టోబరు 2019


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని